పిక్కా..పిక్కా.. ధర ఏదీ?
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:27 AM
Cashew nuts.. what is the price? ఉద్దానంలో జీడి పిక్కలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి తరువాత ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న జీడి పంటపై ఈ ఏడాది ఆశలు వదులుకున్నారు. ప్రస్తుతం పండిన కాస్త పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, లేదంటే కనీస పెట్టుబడులు కూడా రావని ఆందోళన చెందుతున్నారు.
జీడి పంటకు మద్దతు కరువు
రైతులకు తప్పని ఇబ్బందులు
80 కిలోల బస్తా రూ.16వేలు చేయాలని డిమాండ్
పలాస మండలం మాకన్నపల్లి గ్రామానికి చెందిన కుత్తుమ వినోద్‌కుమార్ అనే రైతుకు ఐదు ఎకరాల జీడితోట ఉంది. మూడేళ్ల కిందట ఎకరాకు నాలుగు బస్తాల వరకూ జీడిపిక్కలు పండేవి. ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎకరాకు కేవలం రెండు బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. ఎకరాకు రూ.20వేల వరకూ పెట్టుబడి పెట్టగా.. ప్రస్తుతం మార్కెట్‌లో జీడిపిక్కలకు ఆశించిన ధర లేకపోవడంతో తనకు నష్టం తప్పేలా లేదని వినోద్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
పలాస, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): ఉద్దానంలో జీడి పిక్కలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి తరువాత ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న జీడి పంటపై ఈ ఏడాది ఆశలు వదులుకున్నారు. ప్రస్తుతం పండిన కాస్త పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, లేదంటే కనీస పెట్టుబడులు కూడా రావని ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు జీడిచెట్లు ట్రిమ్మింగ్, యూరియా, దుక్కు, పురుగుల మందులు తదితర వాటికి రూ.20వేలు వరకూ ఖర్చవుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో జీడిపిక్కలు బస్తా(80 కిలోలు) రూ.13వేలు వరకూ ఉంది. దీంతో కూలి కూడా మిగలడం లేదని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో 34వేల హెక్టార్లులో జీడి సాగవుతుండగా.. ఒక్క ఉద్దానం ప్రాంతంలోనే 25వేల ఎకరాల్లో పండిస్తున్నారు. జీడి పంటపై ఆధారపడి లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఒకప్పుడు ఎకరాకు 4 నుంచి 6 బస్తాల వరకూ జీడి పిక్కలు పండేవి. 2018 ్ఞ్ఞఅక్టోబరులో తితలీ తుఫాన్ దెబ్బకు చాలా జీడిచెట్లు నేలకొరిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తర్వాత వాటిస్థానంలో మొక్కలు నాటగా.. ఇప్పుడిప్పుడే పంట చేతికి అందుతోంది. ఈ ఏడాది కూడా ప్రకృతి వైపరీత్యాలు, పొగమంచు, అకాల వర్షాల కారణంగా జీడి పూత దశలోనే మాడిపోయింది. దీంతో ఎకరాకు రెండు బస్తాలకు మించి దిగుబడి రావడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో జీడి పిక్కల బస్తా రూ.16వేలు చేస్తే కానీ తమకు గిట్టుబాటు లభించదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి జీడి రైతాంగ సాధన కమిటీ విన్నపాలు కూడా చేసింది. మార్క్‌ఫెడ్ ద్వారా జీడి గింజలు కొనుగోలు చేసి గిట్టుబాటు కల్పించాలని కోరుతోంది. దీనిపై ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రైతులు నిరుత్సాహంతో ఉన్నారు. ఇప్పటికైనా జీడిపిక్కలకు మద్దతు ధర పెంచాలని కోరుతున్నారు.