మూతపడుతున్న పెట్రోల్ బంకులు
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:00 AM
పశ్చిమాసియాలో యుద్ధ నేపథ్యంలో గ్యాస్, ఆయిల్ కొరత ప్రభావం గ్రామాలపై పడుతోంది.
నగదు చెల్లించినా సరఫరా ఆలస్యం
ఆందోళనలో వాహనదారులు
సరుబుజ్జిలి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో యుద్ధ నేపథ్యంలో గ్యాస్, ఆయిల్ కొరత ప్రభావం గ్రామాలపై పడుతోంది. సరుబుజ్జిలి మండల కేంద్రం సమీపంలోని మర్రిపాడు ఇండియన్ పెట్రోల్ బంకు ఆయిల్ కొరత కారణంగా గురువారం రాత్రి నుంచి మూతపడింది. అలాగే సరుబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట, ఆమ దాలవలస మండలాలతో పాటు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పెట్రోల్ బంకు నిర్వాహకులు ఆయిల్ కంపెనీల కు రెండు రోజులు ముందుగా డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ ఆయిల్ తరలించే లారీలు కొరత చూపుతూ సరఫరా ఆలస్యం చేస్తుండడంతో బంకు యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొన్ని ఆయిల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేకపోవడం వల్ల తాత్కాలికంగా బంకులు నిలుపుదల చేయడంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా ఉన్నంతలో పెట్రోల్, డీజిల్‌ను క్యాన్లలో నింపుకుంటున్నారు కొందరు వినియోగదారులు. హెచ్‌పీ, భారత్, ఇండియన్ ఆయిల్ బంకులకు విశాఖపట్నం హెచ్‌పీసీఎల్ ఆయిల్ కంపెనీ నుంచి సరఫరా కావాల్సి ఉండగా.. నయారా ఆయిల్ ంకులకు కాకినాడ నుంచి ఆయిల్ రావాల్సి ఉంది. గురువారం నుంచి నయారా బంకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినప్పటికీ మిగిలిన ఆయిల్ బంకుల్లో ఆయిల్ కొరతతో వాహనదారులు ఎటువంటి ఆందోళన వ్యక్తం చేయకుండా నయారా బంకులకు పరిగెడుతున్న దృశ్యాలు కనిసిస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
ఐటీడీఏ ఫిల్లింగ్ స్టేషన్‌లో నోస్టాక్
హిరమండలం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో హిరమండలం బ్యారేజీ సెంటర్ వద్ద ఉన్న ఐటీడీఏ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద గత 18 రోజులుగా పెట్రోల్, డీజల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో బంకు వద్ద పెట్రోల్, డీజల్ లేదని బోర్డులు పెట్టారు. సిబ్బంది మాట్లాడుతూ.. ఈ నెల 10న బంకులో ఆయిల్ అయిపోయిందని అప్పటి నుంచి సరఫరా లేదని చెప్పారు. కాగా హిరమండలంలోని మరో రెండు బంకుల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయిల్ సరఫరా జరుగుతుంది.