మూడోసారి
ABN , Publish Date - May 23 , 2026 | 11:41 PM
Petrol prices increased పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో నెలకొన్న పరిస్థితుల పేరిట కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచేసింది.
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఆందోళనలో వాహనదారులు
టెక్కలి, మే 23(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో నెలకొన్న పరిస్థితుల పేరిట కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచేసింది. తొమ్మిది రోజుల వ్యవధిలో మూడోసారి ధరలు పెంచడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో జియో పీబీ, నయారా, హిందూస్థాన్ పెట్రోలియం, ఐఓసీ, హెచ్‌పీ సీఎల్, బీపీహెచ్‌పీఎల్ తదితర పెట్రోల్ బంకులు 145 ఉన్నాయి. ఈ బంకుల ద్వారా రోజుకు పెట్రోల్ సుమారు 65వేల లీటర్ల పెట్రోల్, దాదాపు 60 వేల లీటర్ల డీజిల్ విక్రయిస్తున్నారు. ఈ నెల 15న లీటరు పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచేశాయి. దీంతో లీటరు పెట్రల్ ధర రూ.113.02కి పెరిగింది. డీజిల్ లీటరు రూ.100.66కి చేరుకుంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా జిల్లాలో వాహనదారులపై రోజుకు సుమారు రూ.4.15 లక్షల అదనపు భారం పడింది. దీంతో వాహనదారులు ఆందోళన చెందగా.. ఇంధన సంస్థలు మళ్లీ ఈ నెల 19న లీటరు పెట్రోల్‌పై 86 పైసలు, లీటరు డీజిల్‌పై 83 పైసలు చొప్పున పెంచేశాయి. తాజాగా శనివారం మూడోసారి.. లీటరు డీజిల్‌పై 99 పైసలు, పెట్రోల్‌పై 97 పైసలు చొప్పున పెంచేశాయి. డీజిల్ రూ.102.68, పెట్రోల్ రూ.115.04కి చేరుకుంది. దీంతో జిల్లాలో వాహనదారులపై ఒక రోజుకు సుమారు రూ.6.56 లక్షల అదనపు భారం పడనుంది. ఇందన సంస్థలు ముడిసరుకు బేరల్‌ను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రవాణా చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతున్నారు. మరోవైపు విపక్షాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ఆందోళన చేస్తున్నాయి.