Share News

c పురుగు మందులతో చేటు

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:24 AM

Pesticide spraying:జీడికి పెట్టింది పేరైన ఉద్దానం ప్రాంతంలో గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో దిగుబడి ఉండడం లేదు.

c పురుగు మందులతో చేటు
జీడిచెట్టుకు మందు పిచికారీ చేస్తున్న రైతులు

- విచ్చలవిడిగా జీడి పంటకు పిచికారీ

- తెగుళ్లు లేకపోయినా కొడుతున్న రైతులు

- దిగుబడిపై ప్రభావం పడుతుందంటున్న అధికారులు

సోంపేట రూరల్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జీడికి పెట్టింది పేరైన ఉద్దానం ప్రాంతంలో గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో దిగుబడి ఉండడం లేదు. దీనికి రైతులు విచ్చలవిడిగా వినియోగిస్తున్న పురుగు మందులే ప్రధాన కారణమని అధికారులు అంటున్నారు. పురుగు పట్టినప్పుడు మాత్రమే మందులు చల్లాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ, రైతులు మాత్రం జీడికి పురుగు సోకినా, లేకపోయినా అలవాటు ప్రకారం మందులు పిచికారీ చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు మందులను చల్లుతున్నారు. దీంతో పిందె దశలో పలు మార్పులు సంభవిస్తున్నట్టు ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో రావాల్సిన పూత కాస్త ఆలస్యంగా వచ్చినా ప్రస్తుతం జీడికి ఎటువంటి చీడపీడలు ఆశించలేదు. ఇలాంటి సమయంలో పురుగు మందులు పిచికారీ చేస్తే జీడి పువ్వును కాపాడే మిత్ర పురుగులు చనిపోతాయి. ఫలితంగా పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండదు. సోంపేట మండలంలో 1,700 ఎకరాల్లో రైతులు జీడి పంటను పండిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో సుమారు 3 వేల ఎకరాల్లో జీడి సాగవుతుంది. ఏడాదికి ఒకసారి పండే ఈపంటపై ఆధారపడి వేల కుటుంబాలు బతుకుతున్నాయి. అంతర పంటలు ఉన్నచోట ఒకలా, లేనిచోట మరోలా సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జీడికి ‘టీ దోమ’ ఉంటే తప్ప మందులు వాడవద్దని హార్టికల్చర్‌ సిబ్బంది రైతులకు సూచిస్తున్నారు.

ఈ ఏడాది జీడిపూతకు ఏ తెగుళ్లూ లేవు. పూత నుంచి పిక్కదిగి 15 రోజుల తర్వాత పిక్కకు ఏదైనా తెగులు సోకినా లేదా పిక్క రాలిపోతున్నా స్థానిక హార్టికల్చర్‌ అధికారిని సంప్రదించి తగు మోతాదులో వారు చెప్పిన పురుగు మందులు, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు.

అవసరం మేరకే వినియోగించాలి..

అవసరం లేకున్నా జీడి పంటలకు కొందరు రైతులు పురుగు మందులు కొడుతున్నారు. మోతాదుకు మించి పిచికారీ చేస్తున్నారు. ఈ ఏడాది పంట కాస్త వెనుకగా వస్తుంది. ప్రస్తుత రోజుల్లో అవసరం మేరకే పురుగు మందు పిచికారీ చేయాలి.

-పి.మాధవీలత, ఉద్యానవనశాఖ అధికారి, బారువ

మగపూత ఎక్కువగా ఉంది

జీడిలో వచ్చే మొదటి పూతలో ఎక్కువగా మగపూత ఉంటుంది. అదిపిక్కగా మారలేదు. అందుకే రాలిపోతుంది. తదుపరి దశల్లో వచ్చ పూతలో ఆడ, ద్విలింగ పూత ఉంటుంది. ఈ పూతలు ముఖ్యమైనవి. పిక్క దిగుబడి వీటి బట్టే ఉంటుంది. ఈ దశలో పూత మాడు అనేది తామర పురుగు, టిదోమ వంటి రసం పీల్చే పురుగుల వల్ల కలుగుతుంది.

- పాతిన వీరాస్వామి, రైతు, పాతినివలస

Updated Date - Mar 19 , 2026 | 12:24 AM