చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:06 AM
శ్రీకూర్మం పంచాయతీ పడపానపేటకి చెందిన బోర తవిటయ్య (60) ఈనెల 7న ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో తలకు గాయమైంది.
గార, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): శ్రీకూర్మం పంచాయతీ పడపానపేటకి చెందిన బోర తవిటయ్య (60) ఈనెల 7న ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో తలకు గాయమైంది. దీంతో శ్రీకాకుళంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్టు ఏఎస్‌ఐ టి.చంద్రమోహన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. తవిటయ్య ఆ రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకొనేందుకు గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లగా అక్కడ కాలుజారి వెనక్కి పడిపోవడంతో తలకు గాయమైంది. ఐదు రోజుల తర్వాత తలకు నొప్పిగా ఉండడంతో శ్రీకాకుళంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. భార్య అప్పలనరసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ తెలిపారు. తవిటయ్య వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
విద్యార్థి మృతిపై కేసు నమోదు
కోటబొమ్మాళి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): జలుమూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న గద్దిబోయిన మణికంఠ (15) నరసన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై విద్యార్థి తల్లి రాజులమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 16న తన గ్రామంలో జరిగిన పండగకు వెళ్లిన మణికంఠ.. ఆదే రోజు రాత్రి ద్విచక్ర వాహనంపై వసతి గృహానికి వస్తుండగా నిమ్మాడ- ఊడికలపాడు గ్రామాల మధ్యలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. గాయపడిన మణికంఠను నరన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు.
ఆగి ఉన్న లారీని ఢీకొని..
వ్యక్తికి తీవ్ర గాయాలు
కోటబొమ్మాళి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహ దారి కన్నేవలస పెట్రోల్ బంకు సమీపంలో ఆగిఉన్న లారీని ఢీ కొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయ పడిన ఘటన బుధవారం చోట చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఊడికలపాడు గ్రామానికి చెందిన కుసుమకు మార్ కొత్తపే ట నుంచి టెక్కలి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. కన్నేవలస పెట్రోల్ బంకు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆగిఉన్న లారీని ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని 108వాహనంలో చికిత్స కోసం టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎటువంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు.