Share News

పోర్టు పరిశీలనకు అనుమతి ఇచ్చాం

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:16 AM

మూలపేట పోర్టు పరిశీలనకు వైసీపీ నాయకులకు అనుమతి ఇచ్చినా ఎందుకు వెళ్లలేదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

పోర్టు పరిశీలనకు అనుమతి ఇచ్చాం
దివ్యాంగుడికి పింఛన్‌ అందిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

అయినా వెళ్లకుండా దూరంగా సభ ఏర్పాటు

వైసీపీ మాజీలపై మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): మూలపేట పోర్టు పరిశీలనకు వైసీపీ నాయకులకు అనుమతి ఇచ్చినా ఎందుకు వెళ్లలేదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వారే వెళ్లకుండా దూరంగా సభ పెట్టుకున్నారన్నారు. బుధవారం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి ఆయన కోటబొమ్మాళి పంచాయతీ హడ్కోకాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘వైసీపీ మాజీ మంత్రులంతా ఇటీవల పోర్టుకు పోదాం కార్యక్రమం నిర్వహించారు. పోర్టు పనులు పరిశీలించేందుకు ప్రభుత్వం 40 మందికి అనుమతి ఇచ్చింది. అయినా పోర్టుకు వెళ్లకుండా దూరంగా సభపెట్టి పోర్టు పనులను వైసీపీయే చేసిందని పిచ్చివాళ్లలా మాట్లాడారు. పోర్టుకు వెళ్తామంటే మళ్లీ అనుమతి ఇస్తాం. మీ హయాంలో జరిగిన పనులు, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పనులు మధ్య తేడా చూడాలి. అప్పటికీ మీ కళ్లు కనిపించకపోతే బూతద్దాలు కూడా ఇస్తాం’ అన్నారు.

మూడు రాజధానుల పేరిట అస్తవ్యస్తం

మూడు రాజధానుల పేరుతో జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. వైసీపీ పాలనలో దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చేశారన్నారు. ‘కూటమి ప్రభుత్వం అమరావతి మన ఏకైక రాజధాని అని అసెంబ్లీలో ప్రతిపాదించి పార్లమెంట్‌కు బిల్లును పంపింది. అక్కడ ఈ బిల్లు ఆమోదం పొందింది. దీనిపై ఉత్తరాంధ్ర ఉద్దండులమని చెప్పుకొనే ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ గతంలో రాజధానులు మారాయని, ప్రభుత్వం మారితే రాజధానులు మార్చుకోవచ్చునని మాట్లాడడం చూస్తే వీరు ఎలా మంత్రులుగా పనిచేశారో అర్థం కావడం లేదు’ అని విమర్శించారు. 2029 ఎన్నికల్లోపు టెక్కలి నియోజకవర్గంలో ఎక్కడా మట్టి రోడ్డు లేకుండా చేస్తామని, మరో రెండేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని అన్నారు.

జిల్లాలో 3.60లక్షల మందికి పింఛన్‌: కలెక్టర్‌

జిల్లాలో 3.60 లక్షల మందికి ప్రతి నెలా రూ.1.30కోట్లను పింఛన్‌ రూపంలో అందజేస్తున్నామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. కోటబొమ్మాళి దళితవాడలో జరిగిన పింఛన్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు దళితులు తమ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రకాశనగర్‌లో కూడా పింఛన్ల పంపిణీ చేపట్టారు. చిన్నపొందరవీధికి చెందిన రైతులకు 1బీలను మంత్రితో కలిసి కలెక్టర్‌ అందజేశారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో ఎన్‌.కృష్ణమూర్తి, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, రాష్ట్ర కాళింగ కోమటి కార్పొరేషన్‌ చైర్మన్‌ బోయిన గోవిందరాజులు, టీడీపీ మండల అధ్యక్షుడు బోయిన గోవిందరావు, పీఏసీఎస్‌ అద్యక్షురాలు వెలమల విజయలక్ష్మి, ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్‌, తహసీల్దార్‌ ప్రసాదరావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 12:16 AM