భూముల రీసర్వేకు ప్రజలు సహకరించాలి
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:18 AM
భూముల రీసర్వేకు సంబంధించి రెవెన్యూ అధికారులకు గ్రామస్థులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు.
అడ్డుకోవడం సరికాదు
జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్
ఎల్.ఎన్.పేట, జూలై 2 (ఆంధ్రజ్యోతి): భూముల రీసర్వేకు సంబంధించి రెవెన్యూ అధికారులకు గ్రామస్థులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు. చొర్లంగి పంచాయతీలోని గోలుకుప్ప గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూములను అధికారికంగా గుర్తించేందుకు జరుగుతున్న రీసర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెవెన్యూ సిబ్బందిని సర్వే చేయకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. రైతులు బిడ్డిక రామారావు, నిమ్మక త్రినాథులు, బిడ్డిక అప్పారావులతో పాటు మరికొంతమంది మాట్లాడుతూ రెండు, మూడు తరాల నుంచి తమసాగులోనే భూములు ఉన్నాయని తెలిపారు. ఇంతవరకు తాము సాగుచేసుకుంటున్న భూములపై ఎలాంటి సమస్యలు రాలేదని వివరించారు.
అక్రమంగా విక్రయించొద్దు
అనంతరం తురకపేట జంక్షన్‌లోని ఉషా ఎంటర్‌ప్రైజెస్ ఎరువుల దుకాణాన్ని జేసీ తనిఖీ చేశారు. దుకాణానికి సంబంధించిన రికార్డులను, గోదాంలో ఉన్న ఎరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఎరువుల విక్రయంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ప్రభుత్వ ధరలకే అందించాలన్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ముంగెన్నపాడు గ్రామంలో సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అక్కడ ఆన్‌లైన్‌లో తక్కువగా నమోదైందన్నారు. బీఎల్వో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని... సకాలంలో సర్ సర్వేను పూర్తి చేయాలన్నారు. ఆయనతోపాటు టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, తహసీల్దార్ జె. ఈశ్వరమ్మ, డీటీ నీలిమ, సీనియర్ అసిస్టెంట్ ఎస్.గవరయ్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.