Share News

వైసీపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు

ABN , Publish Date - Jun 01 , 2026 | 11:57 PM

ఆచరణ సాధ్యం కాని అబద్ధపు హామీలతో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రజలను ఘోరంగా మోసం చేశారని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

 వైసీపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు
దివ్యాంగురాలికి పింఛన్‌ సొమ్ము అందిస్తున్న మంత్రి అచ్చెన్న

-ఆచరణ సాధ్యం కాని హామీలతో మోసం చేశారు

- సొంత మీడియాలో డీఎస్సీపై దుష్ప్రచారం

- ఆ పార్టీ సమాధి కావడం ఖాయం

- మంత్రి అచ్చెన్నాయుడు

సంతబొమ్మాళి, జూన్‌1 (ఆంధ్రజ్యోతి): ఆచరణ సాధ్యం కాని అబద్ధపు హామీలతో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రజలను ఘోరంగా మోసం చేశారని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మండలంలోని తోటాడలో సోమవారం ఆయన ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో వైసీపీ తీరుపై, జగన్‌ కుట్రలపై నిప్పులు చెరిగారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన విశాఖ రెల్వేజోన్‌ను గత వైసీపీ ప్రభుత్వం చేతకానితనంతో నిర్వీర్యం చేసిందని మంత్రి విమర్శించారు. ‘రైల్వేజోన్‌ ఏర్పాటుకు కనీసం 54 ఎకరాల భూమిని కూడా కేటాయించలేక ఐదేళ్లు పాటు కాలయాపన చేసింది. ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన నిటబడితే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఆయన సొంత టీవీ, పేపరు ద్వారా డీఎస్సీపై అబద్ధాలు ప్రచారం చేస్తూ కుట్రలు చేస్తున్నారు. గొడ్డలి పోటు రాజకీయాలు చేసిన వైసీపీ భవిష్యత్తులో పూర్తిగా సమాధి కావడం ఖాయం. నంద్యాలలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం తలను తొలగించి కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ నేతలు కుట్ర పన్నారు. వారి కుట్రలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రూ.10.5 లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి నెట్టారు. గ్రామాల్లో ఒక్క రూపాయి ఖర్చు చేసి అభివృద్ధి చేయలేదు. ప్రతినెలా కేవలం బటన్‌ నొక్కామంటూ కథలు చెప్పారు.’ అని ఎద్దేవా చేశారు.

అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలి..

2014-19 మధ్యకాలంలో టీడీపీ చేసిన అభివృద్ధిపై, 2019-24 మధ్య వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత 24 నెలల్లో 65లక్షల మంది లబ్ధిదారులకు రూ.65వేల కోట్లను పింఛన్ల రూపంలో పంపిణీ చేసినట్లు తెలిపారు. ‘ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌సిక్స్‌ హామీలను అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. టెక్కలి నియోజకవర్గంలో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు రూ.624కోట్ల మంజూరు చేయించాం. టెండర్ల ప్రకియ జరుగుతుంది. రానున్న 18 నెలల్లో పనులు పూర్తి చేస్తాం. ఇంటింటికీ తాగునీరు అందించే 2029 ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తాను.’ అని అన్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, టీడీపీ నాయకులు కింజరాపు హరివరప్రసాద్‌రెడ్డి, అప్పన్న, సుగ్గు స్వరూప్‌రెడ్డి, ఎంపీటీసీ మోడి రామచంద్రరావు, మాజీ సర్పంచ్‌ సునీతారామరాజు, జనసేన ఇన్‌చార్జి కణితి కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2026 | 11:57 PM