Share News

పింఛన్‌.. సర్వర్‌ టెన్షన్‌

ABN , Publish Date - Sep 10 , 2026 | 12:23 AM

Flood of applications for new pensions జిల్లాలో ఎక్కడచూసినా ‘ఎన్టీఆర్‌ భరోసా’ పథకం కింద సామాజిక పింఛన్ల దరఖాస్తు సందడి కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించగా.. సర్వర్‌ సమస్య వెంటాడుతోంది. దీంతో ఆశావహులకు ఇబ్బందులు తప్పడం లేదు. గడువులోగా తమ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదవుతాయో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు.

పింఛన్‌.. సర్వర్‌ టెన్షన్‌
మెళియాపుట్టి మీ సేవా వద్ద మంగళవారం రాత్రి కిటకిట

కొత్త పింఛన్లకు దరఖాస్తుల వెల్లువ

వెంటాడుతున్న సాంకేతిక ఇబ్బందులు

ధ్రువపత్రాల కోసం అవస్థలు

గడువు సమీపిస్తుండడంతో ఆశావహుల్లో ఆందోళన

మెళియాపుట్టి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి)

మెళియాపుట్టి మండలం వసుంధర సచివాలయం పరిధిలో రట్టిణి, వసుంధర, నడసందర గ్రామాలు ఉన్నాయి. మూడేళ్ల నుంచి కొత్త పింఛన్ల కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ నెల 16 నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో.. స్వర్ణ పంచాయతీ కార్యాలయాలు, నెట్‌ సెంటర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. కాగా సర్వర్‌ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు ఒకరిద్దరు దరఖాస్తులు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదుకావడంతో.. ఆందోళన చెందుతున్నారు.

టెక్కలి మండలం నర్సింగపల్లి స్వర్ణ పంచాయతీ కార్యాలయానికి.. బుధవారం నర్సింగపల్లి, ముఖలింగపురం పంచాయతీలకు చెందిన సుమారు 50 మంది కొత్త పింఛన్ల దరఖాస్తు కోసం వచ్చారు. సర్వర్‌ పనిచేయకపోవడంతో రోజంతా నిరీక్షించారు. 20 మంది దరఖాస్తులు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదుకావడంతో మిగిలినవారంతా నిరాశతో వెనుదిరిగారు.

జిల్లాలో ఎక్కడచూసినా ‘ఎన్టీఆర్‌ భరోసా’ పథకం కింద సామాజిక పింఛన్ల దరఖాస్తు సందడి కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించగా.. సర్వర్‌ సమస్య వెంటాడుతోంది. దీంతో ఆశావహులకు ఇబ్బందులు తప్పడం లేదు. గడువులోగా తమ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదవుతాయో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 3,04,344 మంది పింఛన్‌దారులు ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. కానీ, అమలు చేయలేదు. చివరిసారిగా 2023లో పింఛన్లు మంజూరయ్యాయి. తరువాత కనీసం స్పౌజ్‌ పింఛన్లు కూడా మంజూరుకాలేదు. 2024 జూన్‌లో కూటమి వచ్చిన తరువాత.. ఎన్నికల హామీ మేరకు లబ్ధిదారుల పింఛన్ల మొత్తాన్ని పెంచింది. అలాగే భర్త పింఛనుదారుడైతే చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్‌ వర్తించేలా స్పౌజ్‌ పింఛన్‌ మంజూరు చేసింది. 2023 డిసెంబరు నుంచి స్పౌజ్‌ పింఛన్లకు మోక్షం కలిగించింది. కొత్త పింఛన్‌ల మంజూరుకు మాత్రం కాస్త వెనుకంజ వేసింది. దీంతో అర్హుల్లో కొంత నైరాశ్యం ఉండేది. తాజాగా ఈ నెల 7 నుంచి అన్నిరకాల సామాజిక పింఛన్లకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించడంతో ఆశావహుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మూడేళ్ల తర్వాత పింఛన్లు మంజూరు చేస్తుండడంతో స్వర్ణ పంచాయతీ కార్యాలయాలకు, నెట్‌సెంటర్ల వద్ద బారులుదీరుతున్నారు. దరఖాస్తు ప్రక్రియలో సర్వర్‌ మొరాయించడం.. ఆధార్‌ ఓటీపీలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 16 వరకే దరఖాస్తులకు గడువు ఉండడంతో ఆందోళన చెందుతున్నారు.

ధ్రువపత్రాల కోసం పాట్లు

పింఛన్‌ దరఖాస్తుకు సంబంధించి అవసరమైన ధ్రువపత్రాల కోసం చాలామంది పాట్లు పడుతున్నారు. నిబంధనల మేరకు పింఛన్‌ దరఖాస్తుదారులు ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. రేషన్‌ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు ఉండాలి. వయసు నిర్ధారణ పత్రాలు అవసరం. వితంతు పింఛన్‌ కోసం భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. ఒంటరి మహిళ పింఛన్‌ కోసం 50 సంవత్సరాలు నిండినట్లు తహసీల్దార్‌ జారీ చేసిన ధ్రువపత్రం, దివ్యాంగ పింఛన్‌కైతే 40శాతంపైబడి దివ్యాంగత వున్నట్లు సదరం ధ్రువపత్రం తప్పనిసరి. డప్పు కళాకారులు, చేనేత, కళ్లు గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు సెల్ఫ్‌డిక్లరేషన్‌తోపాటు పంచాయతీ ప్రత్యేక అధికారి ధ్రువీకరణ, సంబంధిత సహకార సంస్థల నుంచి అనుమతి పత్రాలు ఉండాలి. ఈ ధ్రువపత్రాలు లేక చాలామంది మీసేవా కేంద్రాలు, తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గడువులోగా ధ్రువపత్రాలు రాకపోతే.. పింఛన్‌ దరఖాస్తుకు అవకాశం కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Sep 10 , 2026 | 12:23 AM