ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొని..
ABN , Publish Date - Sep 22 , 2026 | 11:02 PM
అంతవరకూ కేరింతలు కొడుతూ...వినాయకునని ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్న ఆ చిన్నారి అంతలోనే అందని లోకాలకు వెళ్లిపోయింది. కళ్ల ముందే జరిగిన ఈఘోరంతో అక్కడ ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు. రొంపివలస గ్రామంలో సోమవారం రాత్రి వినాయక విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకొంది.
పాతపట్నం/రూరల్, సెప్టెంబరు 22(ఆంద్రజ్యోతి): అంతవరకూ కేరింతలు కొడుతూ...వినాయకునని ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్న ఆ చిన్నారి అంతలోనే అందని లోకాలకు వెళ్లిపోయింది. కళ్ల ముందే జరిగిన ఈఘోరంతో అక్కడ ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు. రొంపివలస గ్రామంలో సోమవారం రాత్రి వినాయక విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకొంది. కలగటి లవ్లీ(10) అనే విద్యార్థిని మృతిచెందగా.... పణుకు అప్పలరాజు గాయపడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. రొంపివలసలోని వినాయకుని విగ్రహ నిమజ్జనానికి రొమదళ గ్రామచెరువు వద్దకు ట్రాక్టర్‌పై ఊరేగింపుగా బయలుదేరారు. ఈ క్రమంలో పణుకు అప్పలరాజు అనే వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొంది. దీంతో కంగారుపడిన ట్రాక్టర్ డ్రైవర్ పిట్ట నారాయణ సడన్ బ్రేక్ వేయడంతో ట్రాక్టర్ వెనుక విగ్రహం వద్ద కూర్చొని ఉన్న కలగటి లవ్లీ జారిపడింది. బాలిక జారిపడిన విషయాన్ని గమనించని డ్రైవర్ ట్రాక్టర్‌ను వెనుకకు వేగంగా తీసుకు రావడంతో బాలికపై నుంచి ట్రాక్టర్ తొట్టె చక్రాలు వెళ్లిపోయాయి. దీంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. గాయపడిన లవ్లీ, అప్పలరాజులను పాతపట్నం సామాజిక ఆసుపత్రికి తరలించారు. లవ్లీ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతిచెందిన లవ్లీ రొంపివలసలో తాతగారింటి వద్ద ఉంటూ ఎం.పి.పి.ఎస్.లో మూడో తరగతి చదువుతోంది. మృతురాలికి సోదరి, సోదరుడు ఉన్నారు. బాలిక తండ్రి ఇటీవలే మృతిచెందాడు. తల్లి హేమలత హైదరాబాద్ వలస వెళ్లి జీవనం సాగిస్తుంది. మృతురాలి సమీప బంధువు తూత ఏసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్.ఐ. కె.మధుసూదనరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
,