Share News

రోడ్డుపైనే పార్కింగ్‌

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:43 PM

Increased traffic congestion in Palasa-Kasibugga పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో ట్రాఫిక్‌ తీవ్రంగా పెరిగిపోయింది. ఈ మునిసిపాలిటీలో అధిక సంఖ్యలో వ్యాపార సముదాయాలు, భారీ షాపింగ్‌మాల్స్‌, బ్యాంకులు, ఆస్పత్రులు ఉన్నాయి. కానీ చాలావాటికి పార్కింగ్‌ సదుపాయం లేదు. దీంతో రోడ్లపైనే వాహనాలను నిలపాల్సి వస్తోంది.

రోడ్డుపైనే పార్కింగ్‌

  • పలాస-కాశీబుగ్గలో పెరిగిన ట్రాఫిక్‌ రద్దీ

  • ఇబ్బందులు పడుతున్న ప్రజలు

  • పలాస, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి):

  • కాశీబుగ్గ సంతమైదానం జరుగుతున్న కేటీ రోడ్డు ప్రాంతం ఇది(పైచిత్రం). ఇక్కడే పార్కింగ్‌, ఇక్కడే బజారు, ఇక్కడే సంత నిర్వహిస్తుండడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. దీనికితోడు సమీపంలో జడ్పీ హైస్కూల్‌ విడిచిపెట్టినప్పుడు.. విద్యార్థులు బయటకు వెళ్లడానికి కూడా వీలులేకుండా కూరగాయల షాపులు, రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్‌ చేస్తు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

  • పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో ట్రాఫిక్‌ తీవ్రంగా పెరిగిపోయింది. ఈ మునిసిపాలిటీలో అధిక సంఖ్యలో వ్యాపార సముదాయాలు, భారీ షాపింగ్‌మాల్స్‌, బ్యాంకులు, ఆస్పత్రులు ఉన్నాయి. కానీ చాలావాటికి పార్కింగ్‌ సదుపాయం లేదు. దీంతో రోడ్లపైనే వాహనాలను నిలపాల్సి వస్తోంది. ప్రధానంగా కేటీ రోడ్డుకు ఇరువైపులా వాహనాలతో పార్కింగ్‌ నిండిపోతోంది. కనీసం రోడ్డుపై నడవడానికి కూడా వీల్లేని పరిస్థితిలో ట్రాఫిక్‌ రద్దీ నెలకొంటోంది. శుక్రవారం వచ్చిందంటే చాలు.. ముఖ్యంగా కాశీబుగ్గ ప్రజలు సంతమైదానం రోడ్డు నుంచి వెళ్లడానికి హడలిపోతుంటారు. పార్కింగ్‌కు స్థలాలు లేక రోడ్డుపైనే వాహనాలు నిలిపివేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసు, మునిసిపల్‌, రెవెన్యూ, మోటారు వెహికల్‌ అధికారులు సంయుక్తంగా పనిచేస్తేనే ట్రాఫిక్‌ గాడిలో పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  • పలాస స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతోపాటు మొత్తం నాలుగు బ్యాంకులు ఉన్న ప్రధాన రహదారికి ఇరువైపులా పార్కింగ్‌కు మార్జిన్‌ అంటూ ఏదీ లేదు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారు. ఎదురుగా రెండు వాహనాలు తప్పుకొని వెళ్లాలంటే ఇబ్బందే. ఇక్కడ నిత్యం ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

  • కాశీబుగ్గలో రాజ్‌కుమార్‌ ఆసుపత్రితోపాటు పాఠశాలలు, కళాశాలలు, వివిధ ఆసుపత్రులు ఉండే ప్రధాన రహదారిపై వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో ప్రజలు, రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డుపై వాహనాలు తీయండి మహాప్రభో అని మొత్తుకుంటున్నా వాహనదారులు పట్టనట్లు వ్యవహరిస్తుంటారు.

  • గాంధీనగర్‌ రహదారిలో ఇరువైపులా కారులు పార్కింగ్‌ చేయడంతో 10 అడుగులు కూడా మధ్యలో ఉండడం లేదు. మరో వాహనం వెళితే తప్పించుకోవడం కష్టంగా మారింది. షాపింగ్‌మాల్స్‌, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, బ్యాంకులు ఉన్న ఈ రహదారి అత్యంత రద్దీగా ఉంటుంది. వివాదాల్లో ఉండే ఈ ప్రాంతాన్ని 40 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మించినా ప్రజలకు మాత్రం దారి కష్టాలు తీరడం లేదు. దీంతో స్థానికులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు.

  • కాశీబుగ్గ కేటీరోడ్డులో రెండు కిలోమీటర్ల మేర అన్నీ ప్రాంతాల్లోను రోడ్డుకు ఇరువైపులా, మధ్యలో వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారు. పేరుకు 80 అడుగుల రహదారిగా ఉన్నా 20 అడుగులు కూడా నడకదారి ఉండకపోవడం విశేషం. బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలతోపాటు నిత్యం వేలాది మంది ప్రజలు ఈ మార్గంగుండా వెళ్తుంటారు. రోడ్డుకు అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్‌ చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. షాపింగ్‌ మాల్స్‌, షాపుల వద్ద పార్కింగ్‌కు స్థలాలు కేటాయించుకోవాల్సిన బాధ్యత సంబంధిత నిర్వాహకులదే. కానీ ఖరీదైన రోడ్డుపై పార్కింగ్‌ చేస్తు ఏకంగా రోడ్డునే కబ్జా చేశారు. రామకృష్ణ పోలీసుమార్గ్‌, శ్రీనివాసలాడ్జి జంక్షన్‌, హరిశంకర్‌ థియేటర్‌ రోడ్‌, వెంకటేశ్వర ఐమాక్స్‌ రోడ్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్‌, జీడిపండు జంక్షన్‌, ఇందిరా జంక్షన్‌ వంటి ముఖ్య ప్రాంతాల్లో రోడ్డును కబ్జాచేసి పార్కింగ్‌ చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాలు పార్కింగ్‌ లేకుండా చర్యలు చేపట్టాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Sep 06 , 2026 | 11:43 PM