Share News

రేపు పరిషత్‌ పోరు

ABN , Publish Date - Nov 04 , 2026 | 12:50 AM

MPTC, ZPTC election campaign ends జిల్లాలోని రెండు మునిసిపాలిటీల్లో విజేతల లెక్క తేలింది. ఇక పరిషత్‌ పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనల మేరకు జిల్లాలో మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో అభ్యర్థుల ప్రచార హోరు ముగిసింది. బహిరంగ ప్రచారానికి తెర పడింది. లోపాయికారీ పంపకాల ప్రక్రియ మొదలైంది.

రేపు పరిషత్‌ పోరు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి తెర

  • పలు గ్రామాల్లో మద్యం, డబ్బు పంపిణీ

  • శ్రీకాకుళం/ ఎచ్చెర్ల రూరల్‌, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రెండు మునిసిపాలిటీల్లో విజేతల లెక్క తేలింది. ఇక పరిషత్‌ పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనల మేరకు జిల్లాలో మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో అభ్యర్థుల ప్రచార హోరు ముగిసింది. బహిరంగ ప్రచారానికి తెర పడింది. లోపాయికారీ పంపకాల ప్రక్రియ మొదలైంది. పలు గ్రామాల్లో అభ్యర్థులు.. తమ అనుచరుల ద్వారా ఓటర్లకు మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 30 జడ్పీటీసీ స్థానాలకు 95 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి 22 స్థానాలు, జనసేన నుంచి 6, బీజేపీ నుంచి 2 స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి 15 మంది, సీపీఐ(ఎం) నుంచి ఐదుగురు, ఇండిపెండెంట్‌లుగా 15 మంది, సీపీఐ నుంచి ఒకరు పోటీలో ఉన్నారు. ఇక 542 ఎంపీటీసీ స్థానాలకుగాను... 19 ఏకగ్రీవమయ్యాయి. 523 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 1,222 మంది బరిలో నిలిచారు. చాలా గ్రామాల్లో అభ్యర్థులు విజయమే లక్ష్యంగా వ్యూహం పన్నుతున్నారు. ప్రధాన పార్టీలతో పాటు, కొన్నిచోట్ల స్వతంత్య్ర అభ్యర్థులు.. ఓటర్లకు మద్యం, డబ్బులు కుమ్మరిస్తున్నారు.

  • ఎచ్చెర్ల మండలంలో 23 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. కొన్నిచోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటుకు గరిష్ఠంగా రూ.2వేలు చొప్పున పంపిణీ చేస్తున్నట్టు సమాచారం. కేశవరావుపేట, ఎస్‌.ఎం.పురం, ఫరీదుపేట, ధర్మవరం, బొంతలకోడూరు, ఎచ్చెర్ల, చిలకపాలెం, అల్లినగరం, కొత్తపేట, ముద్దాడ, పొన్నాడ వంటి ప్రాంతాల్లో డబ్బులు, మద్యం అధికంగా పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. జాతీయ రహదారికి అనుకుని గ్రామాల్లో వైసీపీ నాయకులు మద్యం కూపన్లు అందజేస్తున్నారు. ఆ కూపన్లను స్థానిక వైన్‌షాపునకు తీసుకెళితే.. మద్యం ఇస్తున్నారు. కొన్నిచోట్ల అభ్యర్థులు ముందుగానే మద్యం అందుబాటులో ఉంచుకుని పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మద్యం, డబ్బు పంపిణీ సాగుతోందని.. దీనిపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

  • మహిళా ఓటర్లే అధికం

  • పరిషత్‌ పోరులో జిల్లాలో మొత్తం 16,20,965 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 8,04,745 మంది ఉండగా, వారి కన్నా అధికంగా 8,16,164 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరో 56 మంది ఇతరులు నమోదయ్యారు. ఓటర్‌ స్లిప్పుల పంపిణీ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.

  • పకడ్బందీ భద్రత.. వెబ్‌కాస్టింగ్‌..

  • జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,004 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 449 సమస్యాత్మక, 308 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా పోలీసులు గుర్తించారు. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలు, నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగేందుకు వీలుగా 757 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ సదుపాయాన్ని కల్పించారు. పోలింగ్‌ ప్రక్రియ కోసం 3,646 పెద్దవి, 384 మధ్యస్థాయి, 146 చిన్న బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేశారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు కోసం జిల్లాలో నాలుగు ప్రధాన కేంద్రాలను ఎంపిక చేశారు. చిలకపాలెంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్‌ కళాశాల, టెక్కలి ఐతం ఇంజనీరింగ్‌ కళాశాల, పలాస ప్రభుత్వ హైస్కూల్‌, పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

  • పరిషత్‌ పోలింగ్‌కు ‘స్థానిక’ సెలవులు: కలెక్టర్‌

  • జిల్లాలో ఈ నెల 5న జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా.. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పోలింగ్‌ కేంద్రాలుగా కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, విద్యాసంస్థలకు పోలింగ్‌ ముందు రోజైన బుధవారం, పోలింగ్‌ రోజైన గురువారం.. ఈ రెండు రోజులు స్థానిక సెలవు ప్రకటించారు. పోలింగ్‌ సామగ్రి పంపిణీ, బూత్‌ల ఏర్పాటుకు అనువుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు జరిగే పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థలకు గురువారం స్థానిక సెలవు అమల్లో ఉంటుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, కర్మాగారాలు, వ్యాపార, వాణిజ్య దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా గురువారం వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. ఉద్యోగులకు ఓటు హక్కు కల్పించడంలో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Nov 04 , 2026 | 12:50 AM