Share News

పరిషత్‌ పోరు ప్రశాంతం

ABN , Publish Date - Nov 06 , 2026 | 01:29 AM

57.34 percent polling for ZPTC seats జిల్లావ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ సాధారణ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు అందిన అధికారిక నివేదిక ప్రకారం జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ స్థానాలకు 57.34 శాతం, ఎంపీటీసీ స్థానాలకు 57.36 శాతం పోలింగ్‌ నమోదైంది.

పరిషత్‌ పోరు ప్రశాంతం
సింగుపురంలో పోలింగ్‌ కేంరద్రం వద్ద బారులుదీరిన ఓటర్లు

  • జడ్పీటీసీ స్థానాలకు 57.34 శాతం

  • ఎంపీటీసీలకు 57.36 శాతం పోలింగ్‌

  • శ్రీకాకుళం డివిజన్‌లోనే అత్యధికంగా నమోదు

  • శ్రీకాకుళం, నవంబరు 5(ఆంధ్రజ్యోతి):

  • 05-etcherla-rural-01.gifUntitled-1.gifఉదయం 9 గంటల వరకు మందకొడిగా ప్రారంభమైన ఓటింగ్‌ ప్రక్రియ, మధ్యాహ్నం 1 గంట సమయానికి ఊపందుకుంది.

  • జిల్లాలో 30 జడ్పీటీసీ స్థానాలకు గాను 2,004 పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులు పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 16,20,895 మంది ఓటర్లకు గాను 9,29,419 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. డివిజన్లవారీగా పరిశీలిస్తే శ్రీకాకుళంలో అత్యధికంగా 61.84 శాతం పోలింగ్‌ నమోదైంది. టెక్కలి డివిజన్‌లో 54.04 శాతం, పలాస డివిజన్‌లో 53.82 శాతం చొప్పున ఓటింగ్‌ నమోదైంది.

  • మండలాల వారీగా పరిశీలిస్తే.. లావేరులో అత్యధికంగా 67.49 శాతం మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. రణస్థలంలో 67.13 శాతం పోలింగ్‌ నమోదైంది. పాతపట్నం మండలంలో మాత్రం ఓటర్లు నిరాశపరిచారు. అక్కడ కేవలం 45.53 శాతం మాత్రమే ఓటేశారు.

  • ఎంపీటీసీ ఎన్నికలు ఇలా..

  • జిల్లాలో మొత్తం 542 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 19 ఏకగ్రీవమయ్యాయి. 523 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. దీనికోసం 1,940 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 15,69,362 మంది ఓటర్లకుగాను 9,00,221 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎంపీటీసీ ఓటింగ్‌లోనూ శ్రీకాకుళం డివిజన్‌ 62.03 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. టెక్కలి డివిజన్‌లో 53.99 శాతం, పలాస డివిజన్‌లో 53.64 శాతం ఓటింగ్‌ నమోదైంది.

  • మండలాల వారీ పరిశీలిస్తే.. లావేరు(67.48ు), రణస్థలం (66,19ు) ముందంజలో ఉన్నాయి. పాతపట్నంలో మాత్రం అత్యల్పంగా 46.89 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • ఉన్నతాధికారుల పరిశీలన

  • జిల్లాలోని వివిధ పోలింగ్‌ కేంద్రాలను ఉన్నతాధికారులు పరిశీలించారు. ఎచ్చెర్ల మండలంలోని అతిసమస్యాత్మక గ్రామమైన ఫరీదుపేటలో పోలింగ్‌ నిర్వహణ, బందోబస్తును విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌జెట్టీ పర్యవేక్షించారు. సజావుగా ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే రణస్థలం, గార మండలం శాలిహుండంలో పోలింగ్‌ కేంద్రాలను కూడా డీఐజీ పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు.

  • ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట, పొందూరు మండలం నందివాడ, బురిడి కంచరాం, లోలుగు, వీఆర్‌ గూడెం, రాపాక, దళ్లవలస, తోలాపి, కింతలి, కనిమెట్ట గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పరిశీలించారు. అలాగే ఆమదాలవలస మండలం వంజంగి, కనుగులవలస, కొత్తవలస, బొబ్బిలిపేట, కొర్లకోట గ్రామాల్లో పర్యటించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లతో మాట్లాడారు.

  • గార, అంపోలు, శ్రీకూర్మం, బూరవెల్లి తదితర గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పరిశీలించారు.

  • కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి క్యూలో నిల్చొని ఓటు వేశారు.

  • ‘పొన్నం’ కేంద్రం-2లో నేడు రీపోలింగ్‌

  • శ్రీకాకుళం మండలం పొన్నం పంచాయతీ నవనంబాడు గ్రామంలోని పోలింగ్‌ కేంద్రం 2లో శుక్రవారం రీ పోలింగ్‌ నిర్వహించ నున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. గురువారం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో విధానపరమైన లోపం తలెత్తినందున.. రీపోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ కేంద్రం పరిధిలో 932 మంది ఓటర్లు ఉన్నారని, ఎన్నికను పారదర్శకంగా.. ప్రశాంతంగా నిర్వహిం చేందుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి రీపోలింగ్‌ జరుగుతుందని.. ఓటర్లు అంతా ఓటుహక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Nov 06 , 2026 | 01:29 AM