Share News

నేడు పరిషత్‌ పోలింగ్‌

ABN , Publish Date - Nov 05 , 2026 | 12:26 AM

Elections for 30 ZPTC and 523 MPTC seats జిల్లాలో గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశారు.

నేడు పరిషత్‌ పోలింగ్‌

  • జిల్లాలో 30 జడ్పీటీసీ, 523 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక

  • బరిలో 1,317 మంది అభ్యర్థులు

  • 2004 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు

  • విధుల్లో 11వేల సిబ్బంది

  • శ్రీకాకుళం, కలెక్టరేట్‌, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో 30 జడ్పీటీసీ స్థానాలకు 95 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇక 542 ఎంపీటీసీ స్థానాలకుగాను... 19 ఏకగ్రీవమయ్యాయి. 523 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 1,222 మంది బరిలో నిలిచారు. మొత్తంగా పరిషత్‌ పోరులో 1,317 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 16,20,965 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 8,04,745 మంది ఉండగా, వారి కన్నా అధికంగా 8,16,164 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరో 56 మంది ఇతరులు నమోదయ్యారు.

  • ఎన్నికల సామగ్రి పంపిణీ

  • జిల్లావ్యాప్తంగా మొత్తం 2,004 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 449 సమస్యాత్మక, 308 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా పోలీసులు గుర్తించారు. ఎన్నికలు, నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగేందుకు వీలుగా 757 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ సదుపాయాన్ని కల్పించారు. పోలింగ్‌ నిర్వహణకు 31 మంది రిటర్నింగ్‌ అధికారులు, 33 మంది సహాయ రిటర్నింగ్‌ అదికారులు, 191 మంది జోనల్‌ అధికారులు, 310 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. బూత్‌ల స్థాయిలో 2220 మంది పీవోలు, 8898 మంది ఇత పోలింగ్‌ సిబ్బందితో సహా మొత్తం 11,118 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. బుధవారం ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో అధికారులు, సిబ్బందికి బ్యాలెట్‌బాక్సులు, ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. సాయంత్రం వారంతా తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు ప్రత్యేక బస్సులు, వాహనాల్లో చేరుకున్నారు.

  • నాలుగు కేంద్రాల్లో లెక్కింపు

  • పోలింగ్‌ ముగిసిన అనంతరం ఈ నెల 7న ఓట్ల లెక్కింపు కోసం జిల్లాలో నాలుగు ప్రధాన కేంద్రాలను ఎంపిక చేశారు. చిలకపాలెంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్‌ కళాశాల, టెక్కలి ఐతం ఇంజనీరింగ్‌ కళాశాల, పలాస ప్రభుత్వ హైస్కూల్‌, పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వీటిలో 71 కౌంటింగ్‌ టేబుళ్లను ఏర్పాటు చేయగా, లెక్కింపు ప్రక్రియ కోసం 658 మంది సూపర్‌వైజర్లు, 2073 మంది కౌంటింగ్‌ సిబ్బందిని నియమించారు.

  • ఓటుహక్కును వినియోగించుకోవాలి : కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని.. ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పిలుపునిచ్చారు. ‘గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఓటర్లు సమయపాలన పాటించాలి. ఓటుహక్కును వినియోగించుకుని స్థానిక సంస్థల బలోపేతానికి తోడ్పడ్డాలి. పోలింగ్‌ కేంద్రాల వద్ద అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఎన్నికలను నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక బలగాలు మోహరిస్తాయి. 757 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ద్వారా కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామ’ని కలెక్టర్‌ తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • 1800 మందితో బందోబస్తు : ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

  • జిల్లాలో గురువారం జరగనున్న ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌కు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు పూర్తిచేశామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘జిల్లాలో 2004 పోలింగ్‌ కేంద్రాల వద్ద 1,800 మందితో పోలీసు బందోబస్తు సిద్ధం చేశాం. ఇద్దరు ఏఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 40 మంది సీఐలు, 65మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. అతి సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాం. రూట్‌మొబైల్స్‌, సైకింగ్‌ఫోర్స్‌, స్పెషల్‌ స్ర్టైకింగ్‌ఫోర్స్‌, క్విక్‌ రెస్పాన్స్‌, రిజర్వ్‌ పార్టీలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, స్టాటిక్‌ సర్వేలెన్స్‌ బృందాలు అందుబాటలో ఉంచాం. డ్రోన్‌, సీసీ కెమేరాలతో నిఘా పెట్టాం. చెక్‌పోస్టుల వద్ద వాహన తనిఖీలు ముమ్మరం చేశాం. నగదు, మద్యం పంపిణీలు అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నాం. పోలీస్‌యాక్ట్‌ 30, బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163 అమల్లో ఉన్నందున ప్రజలు అనవసరంగా గుంపులుగా ఉండరాదు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను భారీ భద్రత నడుమ స్ర్టాంగ్‌రూమ్‌లకు తరలిస్తామ’ని ఎస్పీ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి అనుమాన కార్యకలాపాలు, సమస్యలపై కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, వదంతులు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • కంట్రోల్‌రూమ్‌ నెంబర్లు

  • జిల్లా పోలీసు కార్యాలయం - 63099 90933

  • జిల్లా పోలీసు ఎన్నికలసెల్‌ - 63099 90923

  • శ్రీకాకుళం డీఎస్పీ - 63099 90804

  • కాశీబుగ్గ డీఎస్పీ - 63099 90805

  • టెక్కలి డీఎస్పీ - 63099 90811

Updated Date - Nov 05 , 2026 | 12:26 AM