Share News

తల్లిదండ్రులూ తస్మాత్‌ జాగ్రత్త!

ABN , Publish Date - Apr 16 , 2026 | 12:59 AM

ఇటీవల పిల్లలు ద్విచక్ర వాహనాలను తీసుకొని రోడ్ల మీదకు వస్తున్నారు.

తల్లిదండ్రులూ తస్మాత్‌ జాగ్రత్త!

- పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు

- ప్రమాదాలకు కారకులు కావద్దు

- బాధ్యులపై కేసులు నమోదు చేస్తాం

-హెచ్చరిస్తున్న పోలీసులు

- శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్‌ రోడ్డులో గత ఏడాది ముగ్గురు మైనర్లు ద్విచక్ర వాహనంపై అతివేగంగా దూసుకెళ్తూ ఎదురుగా వస్తున్న వృద్ధుడిని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

- గత నెలలో తన స్నేహితుడికి వాహనం ఇవ్వాలని ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలసకు చెందిన ఇద్దరు మైనర్లు బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. అందులో ఒక బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో మైనర్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఇటీవల పిల్లలు ద్విచక్ర వాహనాలను తీసుకొని రోడ్ల మీదకు వస్తున్నారు. కొందరు పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా బైక్‌ను బయటకు తెస్తున్నారు. మరికొందరికి వారి తల్లిదండ్రులే స్వయంగా వాహనాలను ఇస్తున్నారు. దీంతో వారు ఇష్టానుసారంగా బైక్‌లను నడుపుతున్నారు. రహదారుల నిబంధనలు తెలియకపోవడం, డ్రైవింగ్‌ సరిగా రాకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇతరులను సైతం వాహనాలతో ఢీకొం టున్నారు. ఇటీవల పోలీసుల తనిఖీల్లో ఎక్కువగా మైనర్లే పట్టుబడుతున్నారు. 18 ఏళ్లలోపు వారు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. అయినా కొందరు తల్లిదండ్రులు ముందుజాగ్రత్త లేకుండా వారికి వాహనాలు ఇస్తున్నారు. వీధిలోనే కదా అని అనుకుంటున్నారు. కానీ అలవాటు పడిన పిల్లలు ప్రధాన రహదారులపైకి కూడా వస్తున్నారు. జిల్లాలో అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా మైనర్లు ద్విచక్ర వాహనాలపై కనిపిస్తున్నారు. చిన్న వయసులో బైక్‌ అలవాటు పడుతూ కాస్త పెద్దయ్యాక ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్నారు. పిల్లాడు మారం చేశాడానో.. అలుగుతున్నాడనోనని స్పోర్ట్స్స్‌ బైక్‌లు, రైస్‌ బైక్‌లు కొని ఇచ్చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రమాదాలు జరిగిన తర్వాత అయ్యో పాపం అని బాధపడుతున్నారు. సోషల్‌ మీడియా ప్రభావంతో ఎక్కువ మంది యువకులు బైక్‌ రైడింగ్‌పై మక్కువ పెంచుకుంటున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో కాలేజీలు విడిచిపెట్టే సమయంలో బైక్‌లతో హోరెత్తిస్తున్నారు. వీటిపై పోలీసులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

గత మూడేళ్లలో కేసులు ఇలా..

మైనర్ల రోడ్డు ప్రమాదానికి సంబంధించి 2023లో 33 కేసులు, 2024లో 30 కేసులు, 2025లో 35 కేసులు, గత మూడు నెలల కాలంలో మూడు కేసులు నమోదయ్యాయి. మరోవైపు పోలీస్‌శాఖ మైనర్ల డ్రైవింగ్‌కు సంబంధించి తనిఖీలు చేపట్టింది. లక్షల రూపాయల జరిమానా కూడా వసూలు చేసింది. 2024లో 317 మంది మైనర్లు బైక్‌లను డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడ్డారు. వారి నుంచి రూ.1,69,595 జరిమానా వసూలు చేశారు. ఈ మూడు నెలల్లో 27 మంది నుంచి రూ.1,25,945 వసూలు చేసినట్టు పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఏడాదిన్నర కిందట ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. వందలాది మందిని పట్టుకున్నారు. వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఆ తరువాత ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించిన దాఖలాలు లేవు. అంతేకాకుండా మైనర్లు వాహనాలతో పట్టుబడినా పోలీసులు ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారని, చిన్నపాటి ఫైన్‌తో సరిపెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

నిబంధనలు పాటించాల్సిందే

ప్రతిఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలి. మైనర్లకు వాహనాలు ఇవ్వడం తల్లిదండ్రులు మానుకోవాలి. అవగాహన లేకుండా వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. దీనివల్ల ఇతరులు సైతం ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. పిల్లల కోరికలను తీర్చడానికి వాహనాలు కొనివ్వడం, అప్పగించడం వల్ల దుష్ప్రయోజనాలు కలుగుతుంటాయి. సంబంధిత అంశంపై పోలీస్‌శాఖపరంగా దృష్టిసారించాం. అంతేకాకుండా తల్లిదండ్రులు, వాహన యజమానులను బాధ్యులను చేసి కేసులు నమోదు చేస్తాం. కొత్త మోటారు చట్టం ప్రకారం రూ.25 వేలు, మూడేళ్లు జైలు శిక్ష ఉంటుంది. తల్లిదండ్రులు సైతం సహకరించి మార్పు తీసుకొని రావాలి.

- వానపల్లి రామారావు, ట్రాఫిక్‌ సీఐ, శ్రీకాకుళం

Updated Date - Apr 16 , 2026 | 12:59 AM