షాపులు పంచాయతీవి.. ఆదాయం వ్యాపారులది
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:36 AM
Panchayat Shops Sublease నరసన్నపేట మేజర్ పంచాయతీ కార్యాలయానికి ఆనుకుని ఉన్న స్థలంలో రెండు దశాబ్దాల కిందట గాంధీబజారు పేరుతో 36 షాపులను అధికారులు నిర్మించారు. ఏటా పంచాయతీ అధికారులు వేలం పాట నిర్వహించి షాపులను అద్దెకు కేటాయిస్తుంటారు.
దశాబ్దాలుగా కొందరి చేతుల్లోనే దుకాణాలు
సబ్‌లీజుకు ఇస్తూ.. అక్రమార్జన
ఆధునికీకరణకు నోచుకోని కూరగాయల మార్కెట్
పట్టించుకోని పాలకవర్గం, అధికారులు
నరసన్నపేట, మార్చి 16(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట మేజర్ పంచాయతీ కార్యాలయానికి ఆనుకుని ఉన్న స్థలంలో రెండు దశాబ్దాల కిందట గాంధీబజారు పేరుతో 36 షాపులను అధికారులు నిర్మించారు. ఏటా పంచాయతీ అధికారులు వేలం పాట నిర్వహించి షాపులను అద్దెకు కేటాయిస్తుంటారు. అయితే, వేలంలో షాపులను దక్కించుకున్న వ్యాపారుల్లో ఆరుగురు మాత్రమే వాటిని నిర్వహిస్తున్నారు. మిగతావారు సబ్ లీజుకు ఇచ్చి అదనపు ఆదాయం పాందుతున్నారు. కొన్నేళ్లుగా ఈ షాపుల్లో దాదాపు 80శాతం మేర కొందరి వ్యాపారుల చేతుల్లోనే ఉంటున్నాయి. వీటిని వారు సబ్ లీజులకు ఇచ్చి పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారు. లీజుదారుల్లో ఎక్కువ మంది రాజకీయ బినామీలు, ప్రధాన పార్టీల అనుచరులు ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఇదీ పరిస్థితి..
నరసన్నపేట మేజర్ పంచాయతీకి గాంధీ బజారు కింది భాగంలో 14 షాపులు, ఒకటో అంతస్తులో 15 షాపులు ఉన్నాయి. కింద భాగంలో ఉన్న షాపులకు సంబంధించి కొందరు లీజుదారులు రూ.15వేలు, మరికొందరు రూ.15వేలు లోపు, ఇంకొందరు రూ.10వేల లోపు పంచాయతీకి అద్దె చెల్లిస్తున్నారు. మిగతావారు మాత్రం ఒక్కో షాపును రూ.18వేల నుంచి రూ.24 వేల వరకు సబ్ లీజుకు ఇచ్చి అద్దె వసూలు చేస్తున్నారు. వీరు పంచాయతీ నుంచి రూ.10వేలకే షాపులను లీజుకు పొందారు. నాగేశ్వర గ్రంథాలయ ముందుభాగంలో ఆరు షాపులు ఉండగా వారు కూడా నామమాత్రంగానే అద్దె చెల్లిస్తున్నారు. రోస్టర్ ప్రతిపాదికన వేలం నిర్వహించాల్సి ఉండగా, అధికారులు మాత్రం దాదాపు 80 శాతం షాపులను ఒకే సామాజిక వర్గానికి దశాబ్దాల నుంచి కట్టబెటుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారిచ్చే మామూళ్లకు అలవాటుపడి పంచాయతీ అధికారులు.. పాలకవర్గ సభ్యలు పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకటో అంతస్తులోని షాపులకు రూ.2వేల లోపు చొప్పున అద్దె నిర్ణయించారు. వీటిలో వ్యాపారాలు చేసేందుకు ఎవరినీ రానీవ్వకుండా దందా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ షాపుల అద్దె ద్వారా పంచాయతీకి నెలకు రూ.3 లక్షలు ఆదాయం వస్తుండగా, సబ్‌లీజుకు ఇస్తున్న వ్యాపారులకు నెలకు రూ.4లక్షల వరకు అద్దె రూపంలో ఆదాయం వస్తోంది. వాస్తవానికి ఏటా పంచాయతీ అధికారులు అద్దెను పది శాతం పెంచుతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు సబ్‌లీజులను భారీ మొత్తంలో పెంచి సొమ్ము చేసుకుంటున్నారు.
నిరుపయోగంగా కూరగాయల మార్కెట్
మేజర్ పంచాయతీలోని విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్‌లో 38 షాపులు దశాబ్దాల నుంచి నిరుపయోగంగా ఉన్నాయి. వ్యాపారులు ఈ షాపులను విడిచిపెట్టి కళాశాల రోడ్డులో వ్యాపారాలు సాగిస్తున్నారు. శిథిలావస్థకు చేరుకున్న దుకాణాలను బాగుచేసి కూరగాయల మార్కెట్‌ను కళాశాల రోడ్డు నుంచి విశ్వేశ్వరయ్య మార్కెట్‌కు తరలించి పంచాయతీ ఆదాయం పెంచేందుకు పాలకవర్గ సభ్యులు, పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. కొందరు వ్యాపారులు కూరగాయల మార్కెట్‌లో షాపులను ఆక్రమించుకోగా, మరికొందరు గిడ్డంగులుగా వాడుకుంటున్నారు. కళాశాల రోడ్డులో ఉన్న తోపుడు బండ్ల వ్యాపారులను ఇక్కడకు తరలిస్తే ట్రాఫిక్ సమస్య కూడా తీరుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం
గాంఽఽధీబజారులో సబ్‌లీజుల వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. రోస్టర్ ప్రకారం ఈ ఏడాది వేలం పాటలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విశ్వేశ్వరయ కూరగాయల మార్కెట్ ఆధునికీకరణకు సంబంధించి ప్రణాళికలను రూపొందించాం. పంచాయతీ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటాం.
-పి.ద్రాక్షాయణి, ఈవో, మేజర్ పంచాయతీ, నరసన్నపేట