వరి మద్దతు ధర పెంపు
ABN , Publish Date - May 13 , 2026 | 11:29 PM
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించే వరి పంటకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించింది.
- క్వింటాకు రూ.72 పెంచుతూ కేంద్రం నిర్ణయం
- 80 కేజీల బస్తా రూ.1,952
టెక్కలి, మే 13(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించే వరి పంటకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించింది. క్వింటా వరి గ్రేడ్-1 రకం రూ.2,461, కామన్ రకం రూ.2,441గా నిర్ణయించింది. గత ఏడాది గ్రేడ్-1 రకం రూ.2,389, కామన్ రకం రూ.2,369 ఉండేది. ఈ ఖరీఫ్‌లో క్వింటాకు రూ.72 మద్దతు ధరను పెంచడంతో రూ.2,461 అయింది. దీని ప్రకారం 80కేజీల ధాన్యం బస్తా రూ.1,952 పలకనుంది. ఈ మేరకు బుధవారం కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. జిల్లాలో వరి పండించే ప్రాంతం లక్షా54వేల230 హెక్టార్లగా వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. సరాసరి ఎకరాకు 20బస్తాల ధాన్యం దిగుబడి ప్రాప్తికి, 8.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు పండించే అవకాశాలు ఉన్నాయి. రైతు అవసరాలకు పోగా మిగిలిన ధాన్యానికి రూ.63.36కోట్ల ఆదాయం రైతాంగానికి సమకూరనుంది. అయితే ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, ఇతరత్రా సమస్యలు తోడైతే దిగుబడులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క పెరిగిన వ్యయం, ఎరువులు, పురుగుమందుల ధరలతో పోల్చిచూస్తే కేంద్రం పెంచిన కనీస మద్దతు ధర కంటితుడుపే అని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. వరికి కనీస మద్దతు ధర పెంచడంలో కేంద్ర ప్రభుత్వం మొసలికన్నీరు కారుస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.