Share News

వరిసాగు.. నిరాశాజనకం

ABN , Publish Date - Aug 02 , 2026 | 12:30 AM

Adverse conditions due to the impact of El Niño ‘సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొంది. వరిసాగుకు ప్రస్తుత పరిస్థితులు ఆశాజనకంగా లేవ’ని ఎన్‌జీ రంగా వ్యవసాయ విద్యాలయ ఉపకులపతి పీవీ సత్యనారాయణ తెలిపారు. శనివారం కంచిలి మండలం బూరగాంలో ఎద పద్ధతిలో సాగు చేస్తున్న వరి పంట పొలాలను, నారుమడులను జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు.

వరిసాగు.. నిరాశాజనకం
బూరగాంలో వరినారును పరిశీలిస్తున్న ‘ఎన్‌జీ రంగా’ ఉపకులపతి సత్యనారాయణ, జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ

ఎల్‌నినో ప్రభావంతో ప్రతికూల పరిస్థితులు

ఎన్‌జీ రంగా వ్యవసాయ విద్యాలయ ఉప కులపతి సత్యనారాయణ

కంచిలి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ‘సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొంది. వరిసాగుకు ప్రస్తుత పరిస్థితులు ఆశాజనకంగా లేవ’ని ఎన్‌జీ రంగా వ్యవసాయ విద్యాలయ ఉపకులపతి పీవీ సత్యనారాయణ తెలిపారు. శనివారం కంచిలి మండలం బూరగాంలో ఎద పద్ధతిలో సాగు చేస్తున్న వరి పంట పొలాలను, నారుమడులను జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. ఉపకులపతి సత్యనారాయణ మాట్లాడుతూ ‘ఎల్‌నినో ప్రభావం వల్ల క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేస్తున్నాం. జూన్‌, జూలై నెలల్లో 60 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీనివల్ల ప్రస్తుతం ఎద పద్ధతిలో సాగు చేస్తున్న రైతులపై తీవ్ర ప్రభావం పడింది. సూపర్‌ ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఉంటాయని మే నెలలోనే హెచ్చరించినా రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయలేదు. ప్రస్తుత పరిస్థితులు వరిసాగుకు ప్రతికూలంగా ఉన్నాయి. వారం రోజుల్లో వర్షాలు కురిస్తే పరిస్థితులు మారవచ్చు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక అందజేస్తాం. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 15వ తేదీలోగా ప్రధానమంత్రి ఫసల్‌బీమా పథకంలో నమోదు కావాల’ని సూచించారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. స్వల్ప కాల పరిమితి కలిగిన పంట విత్తనాలను సబ్సిడీపై అందించాలని కోరారు. పప్పు దినుసులు, నూనె పంటలకు బీమా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ పీడీ జగన్మోహన్‌, కృషి విజ్ఞాన్‌ కేంద్రం శాస్త్రవేత్త కె.భాగ్యలక్ష్మీ, ఎఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు జి.చిట్టిబాబు, పి.ఉదయ్‌బాబు, ఇన్‌చార్జి ఏడీఏ బి.నర్సింహమూర్తి, కంచిలి ఎవో కొంకేన సురేష్‌, రైతులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2026 | 12:30 AM