‘పీ4’ విప్లవాత్మకమైనది
ABN , Publish Date - Aug 28 , 2026 | 11:58 PM
Financial security ‘P4’... పేదరిక నిర్మూలన, అట్టడుగు వర్గాల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘పీ4’ (పీపుల్-పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) కార్యక్రమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
వెలగపూడి నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష
కలెక్టరేట్ నుంచి వర్చువల్‌గా హాజరైన కేంద్రమంత్రి, కలెక్టర్
శ్రీకాకుళం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలన, అట్టడుగు వర్గాల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘పీ4’ (పీపుల్-పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) కార్యక్రమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న ‘విజన్ యూనిట్లు’, ‘పీ4’ కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం వెలగపూడి సచివాలయం నుంచి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యేలు, ప్రత్యేకాధికారులు, యంగ్ ప్రొఫెషనల్స్, నాలెడ్జ్ పార్టనర్లు భాగస్వాములయ్యారు. సీఎం చంద్రబాబు నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాలను, మార్గదర్శకాలను కేంద్రమంత్రి నమోదు చేసుకుని అనంతరం జిల్లా అధికారులతో క్షేత్రస్థాయి అమలుపై సమీక్షించారు.
అట్టడుగు వర్గాలకు ఆర్థిక భరోసా ‘పీ4’..
సమీక్ష అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ ‘‘గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐటీ, వ్యవసాయం, మహిళా సాధికారత రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అట్టడుగు వర్గాలను దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా నిలబెట్టే ‘పీ4’ కార్యక్రమం వీటన్నింటిలో అత్యంత విశిష్టమైనది. జిల్లాలో ఇప్పటికే లక్ష మందికి పైగా లబ్ధిదారులను గుర్తించాం. వారిలో 51,000 మందిని మార్గదర్శకులకు (మెంటార్లకు) అనుసంధానం చేసి వారి ఉపాధి, ఆర్థిక వనరుల పెంపునకు పటిష్ట చర్యలు చేపట్టాం. ‘స్వర్ణాంధ్ర - 2047’ సాధన దిశగా విజన్ యాక్షన్ అమలులో జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో నిలవడం గర్వకారణం’’ అన్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండ్యా, సీపీవో ప్రసన్నలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు.