Share News

మాది రైతు సంక్షేమ ప్రభుత్వం

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:53 PM

Land survey started రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని కేం ద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శుక్రవారం గార మండలం అంపోలులో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి భూముల రీసర్వే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

మాది రైతు సంక్షేమ ప్రభుత్వం
మాట్లాడుతున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

అంపోలులో భూముల రీసర్వే ప్రారంభం

గార, జనవరి 2(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని కేం ద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శుక్రవారం గార మండలం అంపోలులో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి భూముల రీసర్వే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం గ్రామసభలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం భూముల రీసర్వే పేరుతో రైతులను నానా ఇబ్బందులకు గురిచేసింది. పట్టాదారు పాస్‌ పుస్తకాలపై అప్పటి సీఎం ఫొటోను కూడా ముద్రించి ప్రచారం చేసుకున్నారు. అప్పట్లో భూముల రీసర్వేలో జరిగిన అవకతవకలు కారణంగా ఇబ్బందులు పడిన రైతులకు న్యాయం చేస్తామని ఎన్నికల్లో సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 600 గ్రామాల్లో భూముల రీసర్వే కొనసాగుతోంది. ఈ సర్వేలో రైతుల భూములకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ సరిపోల్చుతారు. ఇందుకు రైతులు కూడా అధికారులకు సహకరించాలి. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా పరిశ్రమల స్థాపనకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే గూగుల్‌ కంపెనీను విశాఖపట్నం తీసుకు రావడంలో సీఎం చంద్రబాబు కృషి ప్రశంసనీయం. త్వరలోనే భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామ’ని తెలిపారు.

ఎమ్మెల్యే శంకర్‌ మాట్లాడుతూ ‘గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూముల రీసర్వేలో తలెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం. ఆరు నెలలుపాటు రీసర్వే ప్రక్రియ కొనసాగనుంద’ని తెలిపారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ భూముల రీ సర్వే ప్రక్రియలో రైతులు పూర్తివివరాలను అధికారులకు తెలియజేయాలని సూచించారు. అలాగే సతివాడలో నిర్వహించిన గ్రామసభలో కూడా ఎమ్మెల్యే గొండు శంకర్‌ పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. కార్య క్రమంలో ఆర్డీవో సాయిప్రత్యూష, తహసీల్దార్‌ ఎం.చక్రవర్తి, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 11:53 PM