ఆదేశాలు సరే.. ఆచరణో!
ABN , Publish Date - Aug 31 , 2026 | 01:03 AM
జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్న పీజీ వైద్యులు డ్యూటీలతో నలిగిపోతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీజీ వైద్యుల కష్టాలు
36 గంటల పాటు విధులు
తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతున్న వైనం
వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలని డీఎంఈ ఆదేశాలు
24 గంటలకు మించి డ్యూటీ వద్దని సూచన
సెప్టెంబరు నుంచి అమలు చేస్తామంటున్న రిమ్స్ సూపరింటెండెంట్
శ్రీకాకుళం కల్చరల్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్న పీజీ వైద్యులు డ్యూటీలతో నలిగిపోతున్నారు. కొన్నిసార్లు 36 గంటలు, మరికొన్నిసార్లు 48 గంటలు పనిచేస్తూ తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. వేళకు సరైన నిద్ర ఉండడం లేదని, తిండి తిన్నా వంట పట్టక దాని ప్రభావం తమ ఆరోగ్యంపై పడుతుందని పలువురు పీజీ విద్యార్థులు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పీజీ వైద్య విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) తాజాగా కొన్ని మార్గనిర్దేశాలు ఇచ్చారు. వారికి వారంలో 74 గంటలకు మించి విధులు కేటాయించవద్దని, వరసుగా 24 గంటలకు మించి డ్యూటీ చేయించవద్దని, వారానికి ఒకరోజు పూర్తిస్థాయి సెలవు ఇవ్వాలని, వారికి మౌలిక వసతులు కల్పించాలని పేర్కొంటూ వైద్య కళాశాల ప్రిన్సిపాళ్లు, బోధనాసుపత్రి సూపరింటెండెంట్లకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆచరణ సాధ్యమేనా అన్న అనుమానం అందరిలో నెలకొంది.
ఒకేలా రోస్టర్..
రాష్ట్రంలోని అన్ని భోదనాసుపత్రుల్లో పీజీ వైద్యుల రోస్టర్ ఇంచుమించూ ఒకలే ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకూ ఆరు యూనిట్లగా డ్యూటీలు ఉంటాయి. జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 100 మంది వరకూ పీజీ వైద్యులు ఉన్నారు. ప్రధాన విభాగాలకు ఎక్కువ మందిని, ప్రాధాన్యత తక్కువగా ఉండే విభాగాలకు తక్కువ మందిని కేటాయిస్తారు. ఉదయం 8 గంటలనుంచి వీరి విధులు మొదలవుతాయి. ఓపీ దగ్గర సీనియర్లకు సహాయపడుతూ ఆ రోజు వచ్చే రోగులకు అందుబాటులో ఉంటారు. ఇన్‌పేషెంట్లను వార్డుల్లో చేర్పించడం, ఆరోజు రాత్రి క్యాజువాలిటీలో అందుబాటులో ఉండడం చేస్తుంటారు. మరుసటిరోజు సాయంత్రం 4 గంటల వరకూ వార్డుల్లో రోగుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటారు. ఇలా 36 గంటల పాటు వీరికి క్షణం తీరిక ఉండదు. ఈ సమయంలోనే తిండి, విశ్రాంతి, కాలకృత్యాలు తీర్చుకుని విధుల్లో కొనసాగాలి. మూడురోజులకొకసారి డబుల్ డ్యూటీలు పడుతుంటాయి. అలాంటప్పుడు ఏకంగా 48 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో చాలా మంది విసిగిపోతుంటారు. మహిళా పీజీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. డాక్టర్ల మధ్య ఎంత సర్ధుబాటు ఉన్నా, నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఇవన్నీ భరించాల్సిందేనన్న భావనతో ఎక్కువమంది పీజీలు నోరువిప్పరు. మౌనంగానే ఇబ్బందులు భరిస్తూ విధులకు హాజరవుతుంటారు.
కాజువ్యాలిటీ దగ్గర కొంచెం భిన్నం..
ఇతర విభాగాల కన్నా క్యాజువాలిటీ దగ్గర పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇక్కడి పీజీ డాక్టర్లకు 12గంటల రోస్టర్‌లు ఉంటాయి. ఒక్కోసారి ఇది 18 గంటల వరకు ఉంటుంది. రోగుల తాకిడి బట్టి నిరంతరం ఇక్కడ పరుగులు తీయాల్సిందే. ప్రమాదాలు, పాముకాటు, ఆత్మహత్యా యత్నాలు ఒకటేమిటి తక్షణం వైద్య సహాయం అందాల్సిన కేసులన్నీ ఇక్కడకే వస్తుంటాయి. ఈ తరహా కేసులు వరుసపెట్టి వస్తుంటాయి. అలాంటప్పుడు పీజీ వైద్యులకు క్షణం తీరిక ఉండదు. వచ్చిన అత్యవసర కేసులకు ప్రాణాపాయం లేకుండా తక్షణ వైద్యసేవలు అందిస్తూనే, మరోపక్క కొత్త కేసులన్నింటికీ హాజరు కావాల్సి ఉంటుంది. ఇంత బిజీ షెడ్యూల్ మధ్యనే తిండి, కాలకృత్యాలు కొద్దిపాటి విశ్రాంతి జరిగిపోవాలి. దీంతో క్యాజువాలిటీలో పనిచేసే వారు ఒత్తిడికి గురవుతున్నారు.
వారానికి ఒక రోజు సెలవు ఇవ్వాలి..
ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పీజీ డాక్టర్లకు వారానికి 74 గంటలు మించి విధులు కేటాయించ వద్దని, వారికి వారానికి ఒకరోజు పూర్తి సెలవు ఇవ్వాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ విష్ణువర్ధన్ ఆదేశాలు జారీచేశారు. ప్రతీ విభాగానికి అసోసియేట్ ప్రొఫెసర్ అంతకు పైస్థాయి అధికారిని పీజీ రిజిస్ట్రార్‌గా నియమించాలని పేర్కొన్నారు. విభాగాధిపతి, పీజీ రిజిస్ట్రార్, ఫ్యాకల్టీ, సీనియర్, జూనియర్ రెసిడెంట్లు సమన్వయంతో రోస్టర్లు రూపొందించాలని సూచించారు. తాగునీరు, శుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని, ప్రతీ కళాశాలలో నోడల్ అధికారిని నియమించి నెలవారీ నివేదికలను ప్రతినెలా 10లోగా డీఎంఈ కార్యాలయానికి పంపించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
సెప్టెంబరు నుంచి అమలుచేస్తాం..
పీజీ వైద్య విద్యార్థులకు రోస్టర్లు అడిగాం. అందరితో చర్చించి రోస్టర్లు ఎలా వేయాలన్న దానిపై ఒక నిర్ణయం తీసుకుంటాం. సెప్టెంబరు నుంచి వారానికి ఒకరోజు సెలవును అమలు చేస్తాం.
-డాక్టర్ జి.సౌమిని, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజనాసుపత్రి, శ్రీకాకుళం
క్యాజువాలిటీలో శారీరక శ్రమ ఎక్కువ..
అత్యవసర విభాగంలో పనిచేయడం శారీరక శ్రమతో కూడుకున్నది. క్షణం తీరిక ఉండదు. నిత్యం వచ్చే రోగులతో పరుగులు తీయాలి. ప్రాణాపాయం లేకుండా సేవలందించాలి. వారానికి ఒక రోజు సెలవు మంచిదే.
-రోషన్‌కుమార్, పీజీ డాక్టర్