Share News

ఓపీ డిజిటలైజేషన్‌

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:56 PM

Complete digitization at GGH శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రి(జీజీహెచ్‌- రిమ్స్‌)లో ఔట్‌పేషెంట్‌(ఓపీ) అంతా డిజిటలైజేషన్‌ అయింది. రోగి ఆసుపత్రికి వచ్చిన దగ్గర నుంచి వార్డులో చేరే వరకూ అన్ని సేవలూ డిజిటల్‌గానే జరుగుతున్నాయి.

ఓపీ డిజిటలైజేషన్‌
జీజీహెచ్‌లో అభా కౌంటర్‌ వద్ద రిజిస్ర్టేషన్ల హడావుడి

  • జీజీహెచ్‌లో అంతా ఆన్‌లైన్‌

  • సాంకేతికంగా రోగుల వివరాల నమోదు

  • మరింత మెరుగైన వైద్యసేవలు

  • శ్రీకాకుళం కల్చరల్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రి(జీజీహెచ్‌- రిమ్స్‌)లో ఔట్‌పేషెంట్‌(ఓపీ) అంతా డిజిటలైజేషన్‌ అయింది. రోగి ఆసుపత్రికి వచ్చిన దగ్గర నుంచి వార్డులో చేరే వరకూ అన్ని సేవలూ డిజిటల్‌గానే జరుగుతున్నాయి. జిల్లాలో అమలు చేస్తున్న ఆయుష్మాన్‌భారత్‌ డిజిటల్‌ హెల్త్‌మిషన్‌కు జీజీహెచ్‌ వెన్నుదన్నుగా నిలుస్తోంది. జీజీహెచ్‌కు రోజూ జిల్లా నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో రోగులు వస్తుంటారు. కేవలం ఓపీ విభాగంలోనే రోజుకు సుమారు 800 మంది వరకూ సేవలు పొందుతారు. ఓపీ కౌంటర్‌ వద్ద గతంలో చీటీ ఇచ్చేవారు. ప్రస్తుతం దానిస్థానంలో డిజిటల్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. రోగి వివరాలను ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ చేస్తున్నారు. ఇందుకోసం రోగులకు అవగాహన కల్పించేలా హెల్ప్‌డెస్క్‌లు సైతం ఏర్పాటు చేశారు. రోగులకు ముందుగా అభా ఐడీ (ఆయుష్మాన్‌భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ నెంబర్‌)ను జనరేట్‌ చేస్తారు. ఓపీ దగ్గర నాలుగు అభా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతీ కౌంటర్‌ దగ్గర ముగ్గురు టైనీ ఏఎన్‌ఎంలు ఉంటారు. వీరిదగ్గర ట్యాబ్‌ల్లో కానీ, స్మార్ట్‌ఫోన్‌లో అభా యాప్‌ ద్వారా కానీ రోగుల ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా అభా ఐడీ నెంబర్‌ జనరేట్‌ చేస్తారు. ఆరోగ్యసేతు యాప్‌లోనైనా రోగి ఫొటో అప్‌లోడ్‌ చేసి రిజిస్ర్టేషన్‌ పూర్తిచేస్తారు. తర్వాత జీజీహెచ్‌కు చెందిన క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే.. ఓపీ టోకెన్‌ నెంబర్‌ జనరేట్‌ అవుతుంది. ఓపీ కౌంటర్‌లో ఉన్న సిబ్బంది దానిని ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ హెల్త్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌లోడ్‌ చేసి.. రోగికి ఓపీ చీటి ఇస్తారు. దానిపై కేటాయించిన వార్డు నెంబర్‌ వద్దకు వెళితే డాక్టర్‌ రోగిని పరిశీలించి.. మందులు రాస్తారు. కొంతమందికి అవసరమైతే.. ఆరోగ్య పరీక్షలు సూచిస్తారు. ఆ వివరాలను సైతం ఆన్‌లైన్‌లో వైద్యులు అప్‌లోడ్‌ చేస్తారు. ల్యాబ్‌లో పరీక్షలు అనంతరం రిపోర్టులు సైతం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. వాటి ఆధారంగా వైద్యులు అవసరమైన మందులు, ఇంజక్షన్లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఫార్మసీ విభాగానికి రోగులు వెళ్లి టోకెన్‌ నెంబర్‌ చెబితే చాలు.. వైద్యులు సూచించిన మందులను వారు ఆన్‌లైన్‌లో చూసి.. అందజేస్తారు. ఒకవేళ రోగులు ఆస్పత్రిలో చేరాల్సి వస్తే.. వారి ఆరోగ్య పరిస్థితి వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే పొందుపరిచేలా ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్‌ అయినవరకూ ఎప్పటికప్పుడు అందించిన సేవలు, వైద్యపరీక్షల నివేదికలన్నీ డిజిటల్‌గానే నిక్షిప్తం చేస్తారు. డిజిటల్‌ విధానం వల్ల రోగులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సౌదామిని తెలిపారు.

Updated Date - Oct 06 , 2026 | 11:56 PM