నామినేషన్‌కు అభ్యర్థితో పాటు ఒకరికే అనుమతి
ABN , Publish Date - Oct 22 , 2026 | 01:27 AM
ఎంపీటీసీ నామినేషన్లు వేసేందుకు అభ్యర్థితో పాటు ఒకరికే అనుమతి ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలు ఇచ్చారు.
కేంద్రానికి 100 మీటర్ల వరకు పటిష్ఠ పోలీసు బందోబస్తు
జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలు
నరసన్నపేట, కోటబొమ్మాళిలో నామినేషన్ల స్వీకరణ పరిశీలన
కోటబొమ్మాళి/నరసన్నపేట, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ నామినేషన్లు వేసేందుకు అభ్యర్థితో పాటు ఒకరికే అనుమతి ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలు ఇచ్చారు. నరసన్నపేట, కోటబొమ్మాళిలో నామినేషన్ల కేంద్రాలను ఆయన బుధవారం పరిశీలించారు. కార్యాలయానికి సుమారు 100 మీటర్ల పరిధిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి, నిషేధాజ్ఞలు అమలు చేయాలని టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావుకు సూచించారు. నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థితోపాటు ఒక్కరినే అనుమతించాలని, ఎలాంటి ఘర్షణలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కిల్లారి నారాయణరావు, స్థానిక ఎస్‌ఐ వంగపండు సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలన
బ్యాలెట్ బాక్సుల భద్రతపై అధికారులతో సమీక్ష
టెక్కలి రూరల్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): టెక్కలి డివిజన్ స్థానిక ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సుల భద్రత కోసం కె. కొత్తూరు ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి బుధవారం సంయుక్తంగా పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. టెక్కలి ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి, డీఎస్పీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి
శ్రీకాకుళం కలెక్టరేట్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రకటనల ప్రసారానికి కనీసం మూడు రోజుల ముందే నిర్ణీత నమూనాలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)కి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతోపాటు ప్రకటనకు సంబంధించిన రెండు ఎలకా్ట్రనిక్ కాపీలు, ధ్రువీకరించిన స్ర్కిప్ట్, రూపకల్పన ఖర్చు, ప్రసార వ్యయాల వివరాలను సమర్పించాలన్నారు. చెల్లింపులు చెక్కు లేదా డీడీ రూపంలోనే చేయాలని సూచించారు. కమిటీ మార్పులు సూచిస్తే 24 గంటల్లోగా సవరించి మళ్లీ సమర్పించాలన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి రాజకీయ ప్రకటనల ప్రసారాలకు అనుమతి ఉండదని తెలిపారు. పత్రికలు, ఎలకా్ట్రనిక్ మీడియాలో ప్రచురితమయ్యే వార్తల్లో పెయిడ్ న్యూస్‌పై నిరంతర నిఘా ఉంటుందన్నారు. జిల్లా కమిటీ నిర్ణయంపై అభ్యంతరాలుంటే మూడు రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించి స్వేచ్ఛాయుత ఎన్నికలకు సహకరించాలని పిలుపునిచ్చారు.