Share News

పనులు తగ్గిస్తేనే.. బిల్లులు!

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:27 AM

Upadhi works problem కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం అమలులో పలు సంస్కరణలు చేపట్టింది. పథకం పేరును వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవిక మిషన్‌(గ్రామీణ్‌)గా మార్చేసింది. దీంతోపాటు రాష్ట్రానికి ఇస్తున్న కేంద్రం నిధులను 75 శాతం నుంచి 60 శాతానికి కుదించింది. పంచాయతీకి 20 పనులు దాటరాదని, ఒక్కో పనికి రూ.50 లక్షల కన్నా అంచనాలు మించరాదని కేంద్రం నిబంధన పెట్టింది. దీంతో పనుల నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

పనులు తగ్గిస్తేనే.. బిల్లులు!
సగంలోనే నిలిచిన ముకుందపురం రోడ్డు పనులు

  • ఒక్కో పంచాయతీకి 20 మాత్రమే

  • కేంద్ర నిబంధనలతో ‘ఉపాధి’కి ఆటంకాలు

  • ఆందోళనలో వేతనదారులు

  • అధికారుల్లో అయోమయం

  • టెక్కలి రూరల్‌, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి):

  • టెక్కలి మండలం జగన్నాఽథపురానికి చెందిన జి.పగడాలమ్మకు పాలశింగి రెవెన్యూ పరిధిలో కొంత మామిడి తోట ఉంది. కూటమి ప్రభుత్వం ఉద్యానశాఖ పనులకు సైతం ఉపాధి నిధులు వినియోగించుకోవచ్చని ప్రకటించింది. దీంతో పగడాలమ్మ మామిడితోటలో ట్రెంచ్‌ల ఏర్పాటుకు గతేడాది దరఖాస్తు చేసింది. వర్షాల కారణంగా పనులు చేయలేదు. ఈ ఏడాది పనులు ప్రారంభించి ఒక్కరోజే చేపట్టారు. మస్తర్‌ జనరేట్‌ కాకపోవడంతో పనులు నిలిపేశారు. పంచాయతీలో 20 పనులకు మించి ఉండడంతో మస్తర్‌ జనరేట్‌ కావడం లేదని అధికారులు చెబుతున్నారు.

  • మెళియాపుట్టి మండలం కేరాశింగి పంచాయతీలో అధికంగా గిరిజన గ్రామాలకు రహదారులు లేవు. దీంతో అధికంగా 250 పనులు గుర్తించి అంచనాలు తయారు చేశారు. కాగా అక్కడ వాటి సంఖ్య తగ్గిస్తే కానీ.. పనులు చేపట్టలేని పరిస్థితి ఉండడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.

  • మెళియాపుట్టి మండలం దీనంబంధుపురం పంచాయతీలో అధికంగా గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ పంచాయతీకి రోడ్లతోపాటు సాగునీటి కాలువలు, చెరువులు, ఉద్యాన శాఖ సంబంధించి సుమారు 80 పనులు గుర్తించి అంచనాలు తయారు చేశారు. ఇప్పటికే రోడ్ల పనులు ప్రారంభించారు. కాగా బిల్లుల సమస్య కారణంగా ఏ పనులు తగ్గించాలో.. ఏవి ఉంచాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ముకుందపురం పంచాయతీలోనూ ఇదే సమస్య నెలకొంది. దీంతో రోడ్డు పనులు మధ్యలోనే నిలిపేశారు.

  • కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం అమలులో పలు సంస్కరణలు చేపట్టింది. పథకం పేరును వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవిక మిషన్‌(గ్రామీణ్‌)గా మార్చేసింది. దీంతోపాటు రాష్ట్రానికి ఇస్తున్న కేంద్రం నిధులను 75 శాతం నుంచి 60 శాతానికి కుదించింది. పంచాయతీకి 20 పనులు దాటరాదని, ఒక్కో పనికి రూ.50 లక్షల కన్నా అంచనాలు మించరాదని కేంద్రం నిబంధన పెట్టింది. దీంతో పనుల నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికంగా ఉపాధి నిధులతో గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తున్నారు. గతేడాది సీతంపేట ఐటీడీఏ పరిధిలో 13 మండలాల్లో 165 రహదారుల పనులకు సంబంధించి రూ.83.49 కోట్లు మంజూరు చేశారు. కాగా.. సకాలంలో బిల్లులు అందక చాలాచోట్ల సగం సగం పనులే కనిపిస్తున్నాయి.

  • జిల్లాలో పల్లెపండగ పథకం ద్వారా ఉపాధిహామీ నిధులతో వివిధ శాఖల్లో 9,457 పనులకు రూ.1453.70 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.297.58 కోట్లు విలువైన 3,238 పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మరో రూ.770.70కోట్లతో 3,985 పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేశారు. కాగా.. పంచాయతీకి 20 పనులు దాటరాదనే నిబంధనతో పనులు ముందుకు సాగడం లేదు.

  • జిల్లాలో 1,431 మినీ గోకులాలకు సంబంధించి రూ.21.94 కోట్లు మంజూరు చేశారు. వీటి పనులపై కూడా సందిగ్ధత నెలకొంది. వేతనదారులకు 100 నుంచి 125 రోజులకు పనిదినాలు పెంచినా, నిబంధనల కారణంగా ప్రస్తుతం కూలీలకు పనులు దొరకని పరిస్థితి నెలకొంది.

  • ఎన్‌ఐసీ పోర్టల్‌లో ఇబ్బందులు

  • ఎన్‌ఐసీ పోర్టర్‌లో పలు రకాల పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. చేసిన పనుల బిల్లులను అప్‌లోడ్‌ చేయడానికి అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీలో చేపట్టిన పనుల సంఖ్యను పోర్టల్‌లో 20కి మించి ఉంటే బిల్లులు అప్‌లోడ్‌ కావడం లేదని చెబుతున్నారు. కొత్త పనులు చేయాలంటే పాతవి తొలగించాల్సి వస్తోంది. దీంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

  • పనులను తగ్గిస్తున్నాం

  • ఒక్కో పంచాయతీకి 20 పనుల కన్నా అధికంగా ఉంటే మస్తర్‌ జనరేట్‌ కావడం లేదు. ఎన్‌ఐసీ పోర్టల్‌లో బిల్లులు తీసుకోవడం లేదు. దీంతో పాతపనులు తగ్గించి కొత్తపనులు చేయడానికి ప్రయత్నిస్తున్నాం.

  • - తెంబూరు రవి, ఏపీవో, మెళియాపుట్టి

Updated Date - Feb 16 , 2026 | 12:27 AM