500 మందికి 50 ఇడ్లీలే
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:59 PM
Election staff protest in Sarubuzzi రెండో విడత పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణ కోసం సరుబుజ్జిలి వచ్చిన ఎన్నికల సిబ్బందిలో చాలామంది ఆకలితో అలమటించారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం లేక అవస్థలు పడ్డారు. కనీసం తాగేందుకు నీరు కూడా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.
అన్నం, రసంతోనే మధ్యాహ్న భోజనం
తాగునీరు కూడా కరువే
సరుబుజ్జిలిలో ఎన్నికల సిబ్బంది ఆందోళన
పాలకొండ రహదారిపై బైఠాయింపు
సరుబుజ్జిలి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రెండో విడత పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణ కోసం సరుబుజ్జిలి వచ్చిన ఎన్నికల సిబ్బందిలో చాలామంది ఆకలితో అలమటించారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం లేక అవస్థలు పడ్డారు. కనీసం తాగేందుకు నీరు కూడా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస మండలాల నుంచి సుమారు 500 మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది సరుబుజ్జిలి మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల విధులకు శనివారం హాజరయ్యారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వీరంతా ఉదయం 7 గంటలకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలో 500 మందికి టిఫిన్ కోసం కేవలం 50 ఇడ్లీలనే అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజనమైనా బాగా పెడతారని ఆశించారు. కానీ, ఒంటి గంట సమయంలో ఏర్పాటు చేసిన భోజనంలో అన్నం, రసం తప్ప మరే ఇతర పదార్థం లేదు. కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. సరుబుజ్జిలి-పాలకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సుమారు అర గంట పాటు వాహనాలు రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం ఎంపీడీవో ఎం.పావని వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. భోజనాల ఏర్పాట్లలో ఇంతటి నిర్లక్ష్యం తగదని, తీరు మార్చుకోకపోతే ఎన్నికల విధులు బహిష్కరిస్తామంటూ హెచ్చరించారు. ఈ విషయమై ఎంపీడీవో పావని మాట్లాడుతూ తాము నిబంధనల మేరకే అన్నీ చేశామన్నారు.