Share News

ఆన్‌లైన్‌లో వ్యూహం.. ట్రేడింగ్‌లో మోసం

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:08 AM

Rising cybercrime incidents సైబర్‌ కేటుగాళ్లు రోజుకో కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్‌ మీడియాలో నకిలీ యాప్‌లు ప్రవేశపెట్టి ట్రేడింగ్‌లో డబ్బులు పెడితే అధిక మొత్తం వస్తుందంటూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు.

ఆన్‌లైన్‌లో వ్యూహం.. ట్రేడింగ్‌లో మోసం

  • నమ్మితే ఇట్టే ఖాతాలను గుల్ల చేస్తారు

  • జిల్లాలో పెరుగుతున్న సైబర్‌క్రైం ఘటనలు

  • డిజిటల్‌ అరెస్టుల పేరుతో దోపిడీ

  • ఆర్థికంగా నష్టపోతున్న ప్రజలు

  • శ్రీకాకుళం క్రైం, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): సైబర్‌ కేటుగాళ్లు రోజుకో కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్‌ మీడియాలో నకిలీ యాప్‌లు ప్రవేశపెట్టి ట్రేడింగ్‌లో డబ్బులు పెడితే అధిక మొత్తం వస్తుందంటూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. తొలుత నమ్మకం కలిగేలా కొందరికి రెట్టింపు డబ్బులు ఇస్తారు. వేలల్లో ఉన్న పెట్టుబడులను రూ.లక్షలు, రూ.కోట్లలోకి తీసుకెళ్లి చివరకు ఆ యాప్‌ను మాయం చేస్తారు. దీంతో డబ్బులు పోగొట్టుకున్న వారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి మోసాలు జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్నాయి.

  • జిల్లాలో మోసాలెన్నో..

  • ఈ ఏడాది జనవరిలో శ్రీకాకుళం నగరానికి చెందిన సిమ్మ స్వామిబాబు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట జరిగిన సైబర్‌ మోసంలో రూ.23.84 లక్షలు పోగొట్టుకున్నాడు. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి వారు సూచించిన నాలుగు బ్యాంక్‌ అకౌంట్లకు డబ్బులు జమ చేశాడు. పదే పదే వారు డబ్బులు వేయమని కోరడంతో మోసం జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి రూ.12 లక్షలను బ్యాంకు అధికారుల సాయంతో ఫ్రీజ్‌ చేయగలిగారు.

  • శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఇటీవల షేర్‌మార్కెట్‌ చిట్కాల పేరుతో రూ.కోటి పోగొట్టుకున్నాడు. యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా పరిచయమైన వ్యక్తులు ఓ నకిలీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి అధిక లాభాలు వస్తాయని నమ్మించి.. డబ్బులు దోచుకున్నారు.

  • మార్చిలో శ్రీకాకుళం నగరంలోని విశ్రాంత జిల్లా అధికారి ఒకరు సైబర్‌ నేరగాళ్ల చేతిలో చిక్కి రూ.56 లక్షలు పోగొట్టుకున్నాడు. డిజిటల్‌ అరెస్టు పేరుతో కొందరు ఆయనకు పలుమార్లు ఫోన్‌ చేసి బెదిరించారు. మానవ అక్రమ రవాణా ముఠాతో సంబంధాలు ఉన్నాయని చెప్పి భయపెట్టి డబ్బులు వసూలు చేశారు. చివరకు కుటుంబ సభ్యుల ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అ ప్రమత్తమయ్యారు.

  • శ్రీకాకుళం నగరంలోని సూర్యమహల్‌ కూడలి వద్ద గృహాపకరణ వస్తువుల దుకాణ యజమాని తనకు తెలిసిన దాదాపు 200 మంది వ్యక్తులను ఒక గ్రూప్‌గా ఏర్పాటు చేసి మలేషియాకు చెందిన ఒక మహిళ ద్వారా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేయించి నష్టాలు చూపించాడు. గ్రూప్‌ సభ్యులు అడిగేసరికి ఒక్కొక్కసారి నష్టాలు వస్తాయని చెప్పి బుకాయించడంతో చేసేది ఏమీ లేక వారంతా గ్రూప్‌ నుంచి వైదొలిగారు.

  • ఉద్యోగులు, విద్యావంతులే బాధితులు

  • ఇన్వెస్ట్‌మెంట్‌ దందాలో మోసపోతున్న వారిలో ఎక్కువగా ఉద్యోగులు, విద్యావంతులే ఉంటున్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే ప్రకటనలు వాట్సాప్‌, ఇన్‌స్ర్టాగ్రాం, టెలీగ్రాంలో వచ్చే యాప్‌లకు ఆకర్షితులై సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడిపోతున్నారు. రూ.లక్షలు ఇన్వెస్ట్‌ చేసి వారి ఖాతా వివరాలు చెప్పడంతో సైబర్‌ నేరగాళ్లు ఈజీగా డబ్బులు కొట్టేస్తున్నారు. ట్రేడింగ్‌ ద్వారా వచ్చిన లాభాలతోపాటు తమ పెట్టుబడి కూడా తమ ఖాతాలో ఉన్నప్పటికీ విత్‌డ్రా కావడం లేదని, ఎవరైనా సైబర్‌ నేరగాళ్లను సంప్రదిస్తే కొన్ని ఫీజులు కట్టాల్సి ఉంటుందని చెప్పి మరికొంత డబ్బును గుంజేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు చెప్పినట్టు ఎన్నిసార్లు ఫీజుల కింద డబ్బులు చెల్లించినా విత్‌డ్రా కాక మోసపోయినట్టు బాధితులు గుర్తిస్తున్నారు. అలాగే జిల్లాలో డిజిటల్‌ అరెస్టు పేరుతో మోసాలు ఇటీవల పెరుగుతున్నాయి. విద్యావంతులైన విశ్రాంత ఉద్యోగులు, పెన్షన్‌ తీసుకొనే మహిళలనే లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు వల విసురుతున్నారు. ఎన్‌ఫోర్స్‌మెట్‌ డైరెక్టరేట్‌, కస్టమ్స్‌ అధికారులు, సీబీఐ అధికారులు, ముంబై పోలీసుల పేరుతో అమాయకులను బెదిరించి అందినకాడికి దోచుకుంటున్నారు.

  • అప్రమత్తంగా ఉండాలి

  • సైబర్‌ నేరగాళ్లు ప్రజలను మోసగించేందుకు రకరకాల పద్ధతులు అనుసరిస్తున్నారు. మీరు పెట్టే పెట్టుబడికి రెట్టింపు లాభాలు వస్తాయంటూ టెలీగ్రాం, వాట్సాప్‌, ఇన్‌స్ర్టాగ్రామ్‌లలో పోస్టులు పెట్టి మోసగిస్తున్నారు. ఈజీమనీ కోసం ఆశపడితే లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. ఇలాంటి వాటిని ప్రజలు నమ్మొద్దు. అప్రమత్తంగా ఉండాలి. సెల్‌ఫోన్లకు వచ్చే ఎలాంటి అనుమానాస్పద లింకులు ఓపెన్‌ చేయొద్దు. ఒకవేళ ఎవరైనా మోసపోయినట్టు గుర్తిస్తే సైబర్‌క్రైం నెంబర్‌ 1930కు వెంటనే ఫిర్యాదు చేయాలి.

    - ఎస్పీ కేవీ మహేశ్వరరరెడ్డి

Updated Date - Jun 19 , 2026 | 12:08 AM