ఒకవీధి.. రెండు రాష్ట్రాల జగడం
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:11 AM
A border issue that has not been resolved ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల మధ్య ఆ వీధి సరిహద్దు సమస్య ఏడు దశాబ్దాలకుపైగా కొనసాగుతోంది. దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలకు, భూములు సాగుచేస్తున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఏడు దశాబ్దాలుగా తేలని సరిహద్దు సమస్య
కౌసల్యాపురం వాసులకు తప్పని తిప్పలు
శిస్తు చెల్లించాలని ఒడిశా అధికారులు ఒత్తిడి
కొత్తూరు, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల మధ్య ఆ వీధి సరిహద్దు సమస్య ఏడు దశాబ్దాలకుపైగా కొనసాగుతోంది. దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలకు, భూములు సాగుచేస్తున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. వివరాల్లోకి వెళితే.. కొత్తూరు మండలం కౌసల్యాపురం పంచాయతీలోని దేవరవీధి సరిహద్దు సమస్య.. 72 ఏళ్లుగా పరిష్కారం కావడం లేదు. కౌసల్యాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 1 నుంచి 7వరకు సుమారు 38.55 ఎకరాల భూమి ఒడిశా భాగంలో ఉందంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వాదిస్తున్నారు. లేదు ఇది ఆంధ్రాకు చెందినదేనంటూ ఇక్కడి అధికారులు పట్టుబడుతున్నారు. ఈ వివాదంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా.. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల అధికారుల మధ్య దేవరవీధి ప్రజలు నలిగిపోతున్నారు. ఈ స్థలంలో సుమారు 54 కుటుంబాలకు చెందిన 185 మంది నివసిస్తున్నారు. చాలామంది వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా అప్పుడప్పుడూ ఒడిశా అధికారులు వచ్చి.. తమ భూభాగంలో నివాసం ఉంటున్నందుకు శిస్తులు చెల్లించాలని హుకుం జారీ చేస్తున్నారు. ఒడిశా అధికారుల ఒత్తిడితో తాము ఇబ్బందులు పడుతున్నామని ఈ వీధివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫ వివాదం ఇలా..
1953లో పునర్విభజన జరిగింది. ఆ సమయంలో ఒడిశా రాష్ట్రం గంజాయి జిల్లా నుంచి కొత్తూరు తాలుకాలో ఉన్న కౌసల్యాపురం భూభాగం విడిపోయి.. శ్రీకాకుళం జిల్లా పరిధిలో చేరింది. సదరు సర్వే నెంబర్లను కొత్తూరు తాలుకాకు కేటాయించినట్టు అప్పటి రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. కాగా అప్పట్లో ఆంధ్రా రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాల కారణంగా దేవరవీధి ప్రజలకు నేటికీ ఇబ్బందులు తప్పడం లేదు. గంజాం నుంచి జిల్లా విడిపోకముందు కౌసల్యాపురం రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నెం.1నుంచి 7వరకు ఉన్న భూములకు ఒడిశా రాష్ట్రంలోని హడ్డుబంగి రెవెన్యూ పరిధిలో శిస్తులు చెల్లించారు. ఆ రశీదులను చూపి ఈ భూమి తమదేనంటూ అప్పట్లో ఒడిశా ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. ఆంధ్రా అధికారులు కోర్టుకు హజరు కాలేదు. దీంతో ఒడిశా ప్రభుత్వానికి కోర్టు అనుకూల తీర్పునిచ్చింది. ఈ క్రమంలో అప్పట్లో ఆంధ్రా ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు ఆఘమేఘాలపై కోర్టులో అపీలుకు పరుగులు తీశారు. కోర్టులో సమస్య ఉన్నప్పటికీ 1961లో ఒడిశా అధికారులు దేవరవీధి ప్రజలకు శిస్తు వసూళ్లకు డిమాండ్ చేశారు. దీంతో కౌశల్యాపురం రైతులతో ఆంధ్రా ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు కటక్ హైకోర్టులో దావా వేయించారు. ఈ కేసుపై 1981లో మళ్లీ ఒడిశా ప్రభుత్వానికి కోర్టు అనుకూల తీర్పునిచ్చింది. ఆంధ్రా అధికారులు 1984లో మళ్లీ కటక్ కోర్టును ఆశ్రయించి తమ వాదనలు వినిపించారు. అయినా సరే 1990లో ఒడిశాకే అనుకూల తీర్పు రావడంతో 1992లో సుప్రీంకోర్టులో ఆంధ్రా ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు దావా వేశారు. సుప్రీంకోర్టులో నేటికీ వాదనలు సాగుతున్నా.. సరిహద్దు సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.
ఆంధ్రా పథకాలు.. ఒడిశా పన్నులు
ఇటీవల ఆంధ్రా ప్రభుత్వం భూ సర్వే చేసింది. ఆ సమయంలో కూడా ఒడిశా అధికారులు.. తమ భూభాగంలో ఎలా సర్వే చేస్తారని స్థానిక అధికారులను ప్రశ్నించారు. కాగా ఒడిశా అధికారుల ఒత్తిడితో తాము ప్రశాంతంగా జీవనం సాగించలేక పోతున్నామని దేవరవీధి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆంధ్రా ప్రభుత్వం తరపున తమకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఒడిశా ప్రభుత్వం అధికారులు మాత్రం నివాసాలకు శిస్తు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సరిహద్దు సమస్య తేలకపోవడంతో తాము కొత్తగా ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టలేకపోతున్నామని వాపోతున్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా బతుకుదెరువు కోసం చాలామంది వలస పోతున్నారని పేర్కొంటున్నారు. తాగునీరు, కాలువల సమస్యల వేధిస్తోందని, కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. కోర్టులో నడుస్తున్న ఈ సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందోనని ఎదురుచూస్తున్నారు.
సమస్య పరిష్కరించాలి.
ఆంధ్రా భూభాగంలోనే పక్కా ఇళ్లు నిర్మించుకున్నాం. ఆంధ్రా ప్రభుత్వం నుంచే పథకాలు పొందుతున్నాం. ఒడిశా అధికారుల తీరుతో ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడి ప్రభుత్వం ఒడిశా అధికారులతో చర్చించి.. సమస్య పరిష్కరించాలి.
- బత్తుల కృష్ణారావు, దేవరవీధి, కౌసల్యాపురం
సదుపాయాలు లేవు
అప్పుడప్పుడు ఒడిశా అధికారులు వచ్చి నివాసాలు ఉంటున్న వీధి, రైతులు సాగుచేస్తున్న భూములు ఒడిశావేనని చెబుతున్నారు. దేవరవీధిలో మంచినీరు, డ్రైనేజీ సదుపాయాలు లేవు. అధికారులు స్పందించి తాగునీటి ఎద్దడిని తీర్చాలి
- సల్లా దేవి, దేవరవీధి, కౌసల్యాపురం
కోర్టు పరిధిలో ఉంది
కౌశల్యపురం సరిహద్దు సమస్యపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. తీర్పు వచ్చేవరకు వేచి చూడాలి. దేవర వీధి ప్రజలకు ఆంధ్రా ప్రభుత్వం తరపున పథకాలు, సౌకర్యాలు కల్పిస్తున్నాం.
- వై.జోగారావు, తహసీల్దార్, కొత్తూరు