Share News

కిలో పనస రూపాయి

ABN , Publish Date - May 07 , 2026 | 12:18 AM

పనస రైతుకు కష్టకాలం వచ్చింది. ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. రెండు మూడు నెలల కిందట వరకు కిలో పనస పండు ధర రూ.100 ఉండగా, కేవలం ఒక్క రూపాయే పలుకుతోంది.

కిలో పనస రూపాయి
రోడ్డు పక్కన పారబోసిన పనస పండ్లు

అయినా కొనుగోలుకు వ్యాపారుల అనాసక్తి

పండ్లను రోడ్లపక్క పారబోస్తున్న రైతులు

రెండు నెలల కిందట రూ.వంద పలికిన ధర

వజ్రపుకొత్తూరు, మే 6 (ఆంధ్రజ్యోతి): పనస రైతుకు కష్టకాలం వచ్చింది. ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. రెండు మూడు నెలల కిందట వరకు కిలో పనస పండు ధర రూ.100 ఉండగా, కేవలం ఒక్క రూపాయే పలుకుతోంది. దీంతో కూలీ డబ్బులు కూడా గిట్టుబాటు కాకపోవడంతో కొందరు రైతులు పండ్లను కోసి పశువులకు వేస్తుండగా, మరికొందరు రోడ్లపక్క పారబోస్తున్నారు. ఇంకొందరు రైతులు చెట్లకే పండ్లను వదిలేస్తున్నారు. ఉద్దానం రైతులకు జీడి, కొబ్బరి తరువాత అంతలా ఆదాయం అందించే పంట పనస. ముఖ్యంగా నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో రైతులు కుటుంబాలను పోషించే పంటగా చెబుతారు. ఆ సమయంలో రైతులు పనస చెట్ల వద్ద కాపలా ఉంటారు. పిందెలను పశువులు తినేయడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటారు. సీజన్‌ ప్రారంభంలో మంచి ధర ఉండడంతో రైతులు ఎంతో సంతోష పడ్డారు. రెండు నెలల కిందట వరకూ ఉద్దానం నుంచి ఒడిశా, పశ్చిమబెంగాల్‌, బిహార్‌, ఛత్తీస్‌ఘడ్‌ వంటి ప్రాంతాలకు పనస పండ్లు ఎగుమతయ్యేవి. వ్యాపారులు కూడా కొనుగోలు చేసేందుకు పోటీ పడేవారు. కేజీ పండుకు రూ.100 చెల్లించేవారు. అయితే ప్రస్తుతం ఒక్కసారిగా పరిస్థితిలు మారాయి. కిలో పండును రూపాయికి కూడా కొనుగోలు చేయడం లేదు. డిమాండ్‌ లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కావడం లేదు. దిగుబడి కూడా ఒక్కసారిగా పెరిగిపోవడంతో వ్యాపారులు కొద్ది మొత్తం మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారిగా ధర పతనం కావడంతో రైతులు తట్టుకోలేకపోతున్నారు.

గిట్టుబాటు కావడం లేదు

పనస పండ్ల ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. చెట్ల నుంచి పండ్లు కోసి మార్కెట్‌ తరలించేందుకు కూడా గిట్టుబాటు కావడం లేదు. వ్యాపారులు కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో పండ్లను రోడ్లపై పారబోస్తున్నాం.

-తెప్పల చాణఖ్య, రైతు, బైపల్లి

Updated Date - May 07 , 2026 | 12:18 AM