Share News

డయేరియాతో ఒకరి మృతి

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:26 AM

Diarrhea at srikakulam శ్రీకాకుళంలోని దమ్మలవీధి, గోల్కొండరేవు వీధి, కాకివీధి, మంగువారితోట తదితర ప్రాంతాల్లో డయేరియా కేసుల సంఖ్య పెరుగుతోంది. అధికారికంగా 54 కేసులు నమోదు కాగా, ఇందులో మంగళవారం ఒకరు మృతి చెందినట్టు అధికారులు నిర్ధారించారు.

డయేరియాతో ఒకరి మృతి
మండల సురేష్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు.. ఇన్‌సెట్‌లో సురేష్‌ (ఫైల్‌)

  • మరో ముగ్గురు కూడా..? నిర్ధారించని అధికారులు

  • ఇతర అనారోగ్య సమస్యలే కారణమంటున్న వైనం

  • మొత్తం 54 కేసులు.. .రిమ్స్‌లో 16 మందికి చికిత్స

  • ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న బాధితులు

  • అరసవల్లి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని దమ్మలవీధి, గోల్కొండరేవు వీధి, కాకివీధి, మంగువారితోట తదితర ప్రాంతాల్లో డయేరియా కేసుల సంఖ్య పెరుగుతోంది. అధికారికంగా 54 కేసులు నమోదు కాగా, ఇందులో మంగళవారం ఒకరు మృతి చెందినట్టు అధికారులు నిర్ధారించారు. కాగా.. డయేరియా బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. కలుషిత నీరు తాగడం వల్లే డయేరియా వ్యాప్తికి కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతానికి మునిసిపల్‌ కుళాయిల ద్వారా సరఫరా చేసిన నీటిని తాగొద్దని కలెక్టర్‌ ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ నీటిని కూడా వేడిచేసి తాగాలని అధికారులు సూచిస్తున్నారు. గోల్కొండరేవు వీధిలోని వైద్యశిబిరం నిర్వహించి.. డయేరియా బాధితులకు సేవలు అందిస్తున్నారు. వారికి ప్రథమ చికిత్స అనంతరం అంబులెన్స్‌ల ద్వారా కిమ్స్‌, రిమ్స్‌, జెమ్స్‌ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇంకొంతమంది నేరుగా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి చికిత్స పొందుతున్నారు. దీంతో బాధితుల సంఖ్యపై స్పష్టత కొరవడుతోంది.

  • ఒకరి మృతి.. మిగతావారి సంగతి?

  • డయేరియాతో రిమ్స్‌లో చికిత్స పొందుతూ.. మంగువారితోట ప్రాంతంలోని కండ్రవీధికి చెందిన మండల సురేష్‌(43) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. డయేరియా బారినపడి ఆదివారం ఆయన రిమ్స్‌లో చేరారు. కాగా.. ఆయనకు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

  • అలాగే గోల్కోండరేవు రోడ్డుకు చెందిన అంధవరపు సంతోష్‌(35), దమ్మలవీధికి చెందిన దుత్త లక్ష్మణరావు(43), సదాశివుని నరసింగరావు(54) కూడా మంగళవారం వేర్వేరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ముగ్గురూ డయేరియా వ్యాప్తి చెందిన ప్రాంతవాసులే అయినప్పటికీ.. ఆ లక్షణాలతో మృతి చెందినట్టు అధికారులు నిర్ధారించడం లేదు. ఇతర అనారోగ్య సమస్యలే కారణమని చెబుతున్నారు. దీంతో డయేరియా మృతుల సంఖ్యపై కూడా స్పష్టత లేదని ఈ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • రిమ్స్‌లో 21 కేసులు

  • రిమ్స్‌లోని ప్రత్యేక డయేరియా వార్డులో చేరిన రోగుల సంఖ్య 21కు చేరుకుంది. ఇందులో మండల సురేష్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. అలాగే నరసింగరావు అనే వ్యక్తి అసుపత్రికి తీసుకువచ్చేసరికి మృతి చెందాడు. మరో ముగ్గురు రోగులను వారి బంధువులు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం 16 మందికి చికిత్సల అందిస్తున్నామని, అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రసన్నకుమార్‌ తెలిపారు.

  • కలెక్టర్‌ పరిశీలన

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జిల్లా వైద్యారోగ్యశాఖ అఽధికారి, మునిసిపల్‌ అధికారులు మంగళవారం ఉదయాన్నే గోల్కొండరేవు రోడ్‌లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరం వద్దకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలించి, వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆయా వీధుల్లో పారిశుధ్య నిర్వహణ చర్యలను పరిశీలించారు. మంగళవారం సాయంత్రం రిమ్స్‌కి వెళ్లి ప్రత్యేక వార్డులో రోగులను పరామర్శించారు. అలాగే నగరంలో ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నవారి ని పరిశీలించి.. వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు.

  • బాధితులకు మెరుగైన వైద్యం అందించండి : సీఎం ఆదేశం

  • శ్రీకాకుళంలో డయేరియా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షించారు. మంగళవారం వేర్వేరుగా రెండుసార్లు జిల్లా అధికారులతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందజేయాలని ఆదేశించారు. కాగా.. శ్రీకాకుళంలో రోడ్‌ రిపేర్‌ పనుల కారణంగా డయేరియా వ్యాపించిందని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ఘటనలో మొత్తంగా 65 మంది వివిధ ఆసుపత్రిల్లో చేరారని వివరించారు. ఎనిమిది మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని.. ప్రస్తుతం వివిధ ఆసుపత్రిల్లో మొత్తం 55 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. శ్రీకాకుళం కిమ్స్‌లో 30 మంది, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 11 మంది, జెమ్స్‌లో 6 మంది, అర్బన్‌ పీహెచ్‌సీలో నలుగురు, మెడికవర్‌లో ఒకరు, ఇతర ప్రైవేట్‌ ఆసుపత్రిల్లో ముగ్గురు బాధితులు చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. జెమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. మిగిలిన 53 మంది బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

  • డయేరియా ప్రభావంపై నగరంలో జరుగుతున్న క్షేత్రస్థాయి సర్వే గురించి సీఎం చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సర్వేలో భాగంగా డయేరియా లక్షణాలు ఉన్న మరో 79 మందిని గుర్తించామని, అయితే వారి పరిస్థితి ఆందోళనకరంగా లేదని.. ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపినట్లు వివరించారు. వారికి అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను ఇంటి వద్దూ అందజేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాధితులందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని, ముఖ్యంగా వెంటిలేటర్‌పై ఉన్న ఇద్దరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించారు. వ్యాధి మరింత ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తాగునీటి కాలుష్యం జరగకుండా క్లోరినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని, మురుగునీటి కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి బాధితులకు ధైర్యం చెప్పాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Updated Date - Feb 25 , 2026 | 12:26 AM