Share News

లిఫ్ట్‌ టాప్‌పై పడి ఒకరి మృతి

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:44 AM

శ్రీకాకుళంలో ఓ ఇంట్లోని లిఫ్ట్‌ స్టాప్‌పై పడి ఒకరు దుర్మరణం పాలైన సంఘటన చోటుచేసుకుంది.

 లిఫ్ట్‌ టాప్‌పై పడి ఒకరి మృతి
వెంకటేశ్వరరావు (ఫైల్‌)

శ్రీకాకుళం క్రైం, జూలై 16 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలో ఓ ఇంట్లోని లిఫ్ట్‌ స్టాప్‌పై పడి ఒకరు దుర్మరణం పాలైన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, వన్‌టౌన్‌ పోలీసుల కథనం మేరకు.. శ్రీకాకుళం నగరంలోని ఎల్‌బీఎస్‌కాలనీలోని పార్క్‌ వద్ద ఉన్న ఇంట్లో నివసిస్తున్న కట్టా వెంకటేశ్వరరావు (బాబు) అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నాడు. వెంకటేశ్వరరావు బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఇంట్లో ఉన్న భార్యకు బయటకు వెళ్లి వస్తానని చెప్పి తన మొబైల్‌ చూస్తూ లిఫ్ట్‌ గ్రౌండ్‌ఫ్లోర్‌ స్విచ్‌ నొక్కాడు. అయితే లిఫ్ట్‌ రాకముందే దాని తలుపులు తెరుచుకోవడంతో వెంకటేశ్వరరావు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న లిఫ్ట్‌ పైభాగంలో పడిపోయాడు. ఆ సమయంలో ఇంటిలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఎవరూ లేకపోవడంతో లిఫ్ట్‌పై పడిపోయిన వెంకటేశ్వరరావు సాయం కోసం కేకలు వేసినా ఎవరికీ వినిపించలేదు. గురువారం ఉదయం ఆరు గంటలకు వెంకటేశ్వరరావును కలిసేందుకు ఆయన వద్ద పనిచేసే శ్రీనివాస్‌ అనే కార్మికుడు వచ్చాడు. ఆసమమంలో పైఫ్లోర్‌కు వెళ్లేందుకు లిఫ్ట్‌ వద్దకు వచ్చి చూడగా లిఫ్ట్‌ పైభాగంలో కాళ్లు కనిపించాయి. దీంతో శ్రీనివాస్‌ పెద్దగా అరిచి చూసేసరికి తన యజమాని రక్తం మడుగులో పడిఉన్నాడు. దీంతో పై అంతస్తులో ఉన్న భార్యకు తెలిపి 108 వాహనానికి సమాచారం అందించాడు. అప్పటికే కట్టా వెంకటేశ్వరరావు మృతిచెందినట్లు నిర్ధారించడంతో వన్‌టౌన్‌ పోలీసులు, ఆయన కుమారుడు నాగచైతన్యకు సమాచారం అందించారు. నాగచైతన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ మృతదేహాన్ని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. శవపంచనామా జరిపించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఆయన కుమారుడు నాగచైతన్య ఉద్యోగ రీత్యా విశాఖలో భార్య, పిల్లలతో జీవిస్తున్నాడు. కుమార్తె భర్తతో వేరే ఊరులో ఉంటోంది.

Updated Date - Jul 17 , 2026 | 12:44 AM