ఒకటి ఓకే.. రెండు రద్దు
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:27 AM
Government orders on the reorganization of panchayats జిల్లాలోని లావేరు, రణస్థలం మండలాల్లో గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను అనుసరించి 2020లో ఇచ్చిన పలు జీవోలను రద్దు చేస్తూ, కొత్త మార్గదర్శకాలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్‌దండే శుక్రవారం మూడు వేర్వేరు ఉత్తర్వులు విడుదల చేశారు.
పంచాయతీల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వ ఉత్తర్వులు
రణస్థలం మండలంలో కొత్తగా ‘వెంకటరావుపేట’ ఆవిర్భావం
లావేరు మండలంలో పాతవే పునరుద్ధరణ
శ్రీకాకుళం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని లావేరు, రణస్థలం మండలాల్లో గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను అనుసరించి 2020లో ఇచ్చిన పలు జీవోలను రద్దు చేస్తూ, కొత్త మార్గదర్శకాలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్‌దండే శుక్రవారం మూడు వేర్వేరు ఉత్తర్వులు విడుదల చేశారు. వీటి ప్రకారం లావేరు మండలంలో రెండు కొత్త పంచాయతీలు రద్దు కాగా, రణస్థలం మండలంలో ఒక కొత్త పంచాయతీ ఏర్పాటైంది.
రద్దయిన బంతుపేట, పాతరౌతుపేట
లావేరు మండలంలో గతంలో ఏర్పాటు చేసిన కొత్త పంచాయతీలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 ఫిబ్రవరి 12న జారీ చేసిన జీవో నంబర్336 ద్వారా బెజ్జిపురం, సిగిరి కొత్తపల్లి పంచాయతీలను విడదీసి ‘బంతుపేట’ను కొత్తగ్రామ పంచాయతీగా అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆ జీవోను రద్దు చేసింది. కోర్టు తీర్పును అమలుచేస్తూ ప్రభుత్వం తాజాగా జీవో 126 ద్వారా బంతుపేట పంచాయతీ ఏర్పాటును రద్దు చేసింది. పాత పంచాయతీలైన బెజ్జిపురం, సిగిరి కొత్తపల్లిలను వాటి పాత ప్రాదేశిక స్వరూపంతోనే యథాతథంగా పునరుద్ధరించింది.
అలాగే లావేరు మండలంలో తామాడ గ్రామ పంచాయతీని విడదీసి ‘పాతరౌతుపేట’ను కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ 2020లో ఇచ్చిన జీవో 338ని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు జీవో 127 ద్వారా తామాడ పంచాయతీని దాని పాత భౌగోళిక స్వరూపంతోనే పునరుద్ధరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కొత్తగా ‘వెంకటరావుపేట’ పంచాయతీ
రణస్థలం మండలంలో కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక్కడ వల్లభరావుపేట, రావాడ గ్రామ పంచాయతీల నుంచి కొన్ని గ్రామాలను విడదీస్తూ ‘వెంకటరావుపేట’ను కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం జీవో 123లో పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు గతంలో ఇచ్చిన జీవో 588ని రద్దు చేసి నిబంధనలకు అనుగుణంగా కొత్త ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్రమంలో రావాడ పంచాయతీ పరిధిలోని ‘ఉప్పినివలస’ పేరును ‘ఉప్పివలస’గా ప్రభుత్వం ఉత్తర్వుల్లో సవరణ చేసింది.
కొత్తగా ఏర్పడిన వెంకటరావుపేట పంచాయతీలో వెంకటరావుపేట(జనాభా 855), ఉప్పివలస (జనాభా 658) గ్రామాలు ఉంటాయి. మొత్తంగా ఈ కొత్త పంచాయతీ జనాభా 1513, అలాగే పంచాయతీ వార్షిక ఆదాయం రూ. 1,47,200 గా నిర్ధారించారు. ఈ విభజన అనంతరం మిగిలిన వల్లభరావుపేట పంచాయతీ 1146 జనాభాతో యథాతథంగా కొనసాగుతుంది. రావాడ పంచాయతీ రావాడ, లెంకపేట గ్రామాలతో కలిపి మొత్తం 1297 జనాభాతో కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.