నలుగురిలో ఒకరికి కిడ్నీ ముప్పు!
ABN , Publish Date - Sep 13 , 2026 | 12:00 AM
Kidney tests for 3,897 people... ఉద్దానం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ మహమ్మారి మూలాలపై సాగుతున్న పరిశోధనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కిడ్నీ వ్యాధులకు కారణాలను అన్వేషించేందుకు క్షేత్రస్థాయిలో చేపట్టిన అధ్యయనానికి సంబంధించిన మధ్యంతర నివేదికను నిపుణుల బృందం తాజాగా ఐసీఎంఆర్‌కు పంపింది.
నాలుగు మండలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన
24.35 శాతం మందికి నిర్ధారణ
3,897మందికి పరీక్షలు.. 949 మంది బాధితులు
కారణం తెలియని సీకేడీయూ కేసులు 399
కవిటి మండలంలోనే అత్యధికంగా నమోదు
ఐసీఎంఆర్‌కు అధ్యయన బృందం మధ్యంతర నివేదిక
శ్రీకాకుళం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఉద్దానం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ మహమ్మారి మూలాలపై సాగుతున్న పరిశోధనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కిడ్నీ వ్యాధులకు కారణాలను అన్వేషించేందుకు క్షేత్రస్థాయిలో చేపట్టిన అధ్యయనానికి సంబంధించిన మధ్యంతర నివేదికను నిపుణుల బృందం తాజాగా ఐసీఎంఆర్‌కు పంపింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌కు ఈ నివేదిక వివరాలను బృందం వివరించింది. మిగిలిన మండలాల్లోనూ త్వరలోనే పరీక్షలు పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. ఉద్దానంలో 5,851 మందిని పరిశీలించాలన్న లక్ష్యంతో బృందం అధ్యయనం చేపట్టింది. నాలుగు మండలాల్లో 3,897 మంది ఇళ్లవద్దకే వెళ్లి పరిశీలించి రక్తం, మూత్ర నమూనాలను సేకరించింది. వీరిలో ఏకంగా 949 మందికి (24.35 శాతం) మూత్రపిండ వ్యాధి ఉన్నట్లు గుర్తించడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఇందులో 550 మందికి క్రోనిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) ఉండగా, 399 మందికి కారణం తెలియని క్రోనిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీయూ) ఉన్నట్లు మధ్యంతర విశ్లేషణలో తేలింది. ముఖ్యంగా కవిటి మండలంలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.
పనితీరు బాగున్నా.. ‘ఆల్బుమిన్’ అలారం
కిడ్నీవ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ బాధితుల రక్తంలో క్రియాటినిన్, యూరియా, యూరిక్ యాసిడ్ స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. కిడ్నీల వడపోత సామర్థ్యం మందగించడమే ఇందుకు కారణం. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. కొందరిలో కిడ్నీ పనితీరు సాధారణంగానే ఉన్నా, మూత్రంలో ‘ఆల్బుమిన్’ స్థాయులు అసాధారణంగా ఉంటున్నాయి. ఇలా కిడ్నీ పనితీరు తగ్గి, ఆల్బుమిన్ పెరిగిన వారిని ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉంచాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూత్ర నమూనాల్లోని కొన్ని బయోమార్కర్ల ఆధారంగా భవిష్యత్తులో కిడ్నీ వ్యాధి ముప్పును ముందుగానే పసిగట్టే పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. త్వరలో ఆర్‌ఎన్‌ఏ సీక్వెన్సింగ్, జన్యు సంబంధిత అంశాలపైనా పరీక్షలు చేయనున్నారు.
నీరు, మట్టి, వ్యసనాలపైనా లోతైన అధ్యయనం..
కేవలం వైద్యపరమైన కారణాలే కాకుండా.. కవిటి సహా ఇతర మండలాల్లో పర్యావరణ, వృత్తిపరమైన అంశాలపై కూడా బృందం లోతుగా అధ్యయనం చేస్తోంది.
హెవీ మెటల్స్ ఆనవాళ్లు: మట్టి, నీటి నమూనాలతో పాటు రక్తం, మూత్రంలో పురుగు మందుల అవశేషాలు, భారీ లోహాల (హెవీమెటల్స్) ఆనవాళ్లపై హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ సహకారంతో పరిశోధనలు జరుగుతున్నాయి.
వ్యవసాయం, ఎండ తీవ్రం: సర్వేలో పాల్గొన్నవారిలో మూడోవంతు మంది వ్యవసాయ రంగానికి చెందినవారే. పురుగుమందులు, ఎరువుల వాడకం, ఎండ వేడికి కిడ్నీ వ్యాధులకు ఉన్న లింకును పరిశీలిస్తున్నారు.
జీవనశైలి వ్యాధులు: సర్వేలో పాల్గొన్నవారిలో 55.3 శాతం మంది 48 ఏళ్లు పైబడిన వారు కాగా.. వీరిలో 38.8 శాతం మందికి పొగాకు వినియోగం, 23.7 శాతం మందికి మద్యం అలవాటు ఉన్నట్లు నమోదైంది. మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల ప్రభావంపైనా డేటా సేకరిస్తున్నారు.
ప్రొఫెసర్ రవిరాజు సారథ్యంలో..
ఉద్దానంలో అసలు సీకేడీ, సీకేడీయూ ఎందుకు వస్తోంది? వ్యాధిని ప్రాథమిక దశలోనే ఎలా గుర్తించాలి? అనే లక్ష్యాలతో ఐసీఎంఆర్-డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ఆమోదంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. మూడేళ్ల పాటు సాగే ఈ పరిశోధన కోసం రూ.6.2కోట్ల నిధులు కేటాయించారు. సీనియర్ నెఫ్రాలజిస్ట్ ప్రొఫెసర్ టి.రవిరాజు ఈ అధ్యయనానికి మెంటర్‌గా వ్యవహరిస్తుండగా, ఆంధ్రా మెడికల్ కాలేజీ నెఫ్రాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జి.ప్రసాద్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా ఉన్నారు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులతో ఈ పరిశోశన వేగంగా కొనసాగుతోంది. మొత్తం 5,851 మందిపై అధ్యయనం పూర్తయిన తర్వాత వచ్చే తుది ఫలితాలు, బయోమార్కర్ విశ్లేషణలతో కిడ్నీ వ్యాధుల మూలాలపై పూర్తి స్పష్టత వస్తుందని మంత్రి సత్యకుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.