శుభకార్యానికి వెళ్లి వస్తూ...
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:52 AM
Deaths of two people in road accident ఓ శుభకార్యానికి వెళ్లి.. ఆనందంగా తిరిగి వస్తూ.. మరికొన్ని గంటల్లో ఇంటికి చేరుకుంటామనుకున్న ఆ కుటుంబంలో విషాదం రేగింది. అకస్మాత్తుగా సంభవించిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం మండలం చాపురంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
లారీని ఢీకొన్న కారు
ఇద్దరి మృతి.. మరో నలుగురికి గాయాలు
శ్రీకాకుళం మండలం చాపురం హైవే వద్ద ఘటన
శ్రీకాకుళం క్రైం/ పోలాకి/ నరసన్నపేట, జూలై 26(ఆంధ్రజ్యోతి): ఓ శుభకార్యానికి వెళ్లి.. ఆనందంగా తిరిగి వస్తూ.. మరికొన్ని గంటల్లో ఇంటికి చేరుకుంటామనుకున్న ఆ కుటుంబంలో విషాదం రేగింది. అకస్మాత్తుగా సంభవించిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం మండలం చాపురంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం రూరల్ ప్రాంతానికి చెందిన బంకుపల్లి సత్య గోపాల్ శాస్త్రి(75), పోలాకి మండలం గొల్లలవలస ప్రాంతానికి చెందిన గోపాలశాస్త్రి బంధువులు.. మొత్తం ఆరుగురు ఆదివారం ఉదయం కారు(ఎర్టిగా)లో విజయనగరం జిల్లా రాజాంలోని బంధువుల ఇంట్లో బాలసారె కార్యక్రమానికి వెళ్లారు. గొల్లలవలసలో కారును అద్దెకు తీసుకుని వీరు వెళ్లారు. రాజాంలో కార్యక్రమం ముగించుకుని సాయంత్రం తిరిగి వస్తుండగా శ్రీకాకుళం మండలం చాపురం హైవే వద్ద చెన్నై నుంచి కోల్‌కత్తాకు వెళ్తున్న కంటైనర్‌లారీ ఎడమభాగాన ఉన్న హుక్కుకు ఢీకొన్నారు. దీంతో కారును సుమారు యాభై మీటర్లుమేర లారీ ఈడ్చుకుపోయింది. కారులో ముందుసీటులో కూర్చున్న బంకుపల్లి సత్య గోపాల్ శాస్త్రి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్ పొట్టా వినయ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన నలుగురికీ గాయలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. స్థానికులు.. హుటాహుటిన క్షతగాత్రులను అంబులెన్స్‌లో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి డ్రైవర్ వినయ్‌కుమార్ మరణించాడు. అలాగే క్షతగాత్రుల్లో మరో ఇద్దరు దార్లపూడి వెంకట సూర్యనారాయణ, రోజా దంపతులను మెరుగైన చికిత్స కోసంశ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సంఘటనా ప్రాంతాన్ని రూరల్ స్టేషన్ ఎస్‌ఐ కరణం వెంకట సురేష్ పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ఆగిన బతుకు బండి
చిన్నతనంలోనే ఆ యువకుడు కుటుంబ బాధ్యతలను మోయాల్సి వచ్చింది. కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ...తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. ప్రమాదం రూపంలో యువకుడిని మృత్యువు బలిగొనడంతో కుటుంబం దీనంగా విలపిస్తోంది. చాపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసన్నపేటలోని దేశవానిపేటకు చెందిన వినయ్(26) మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వీరు నిరుపేదలు. వినయ్ తండ్రి సింహాచలం స్థానిక హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తుండగా... తల్లి భద్రమ్మ గృహిణి. వీరికి ఇద్దరు కుమారులు కాగా, వినయ్ పెద్దవాడు.