Share News

పెళ్లికి వెళ్లి...తిరిగి వస్తూ..

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:58 PM

పట్టుపురం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్లు ఎస్‌ఐ అమీర్‌ అలీ తెలిపారు.

 పెళ్లికి వెళ్లి...తిరిగి వస్తూ..
ద్రాక్షవేణి మృతదేహం

ప్రమాదంలో వివాహిత మృతి

మెళియాపుట్టి/పాతపట్నం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): పట్టుపురం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్లు ఎస్‌ఐ అమీర్‌ అలీ తెలిపారు. పాతపట్నం మండలం బడ్డుమర్రి గ్రామానికి చెందిన కూన ద్రాక్షవేణి (42) మెళియాపుట్టి మండలం గుమ్మడి గ్రామానికి సమీప బంధువుల వివాహానికి బంధువుతో కలసి ద్విచక్ర వాహనంపై వెళ్లింది. పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై తిరిగి బడ్డుమర్రి వస్తుండగా పట్టుపురం-జోడూరు మధ్యలో ప్రమాదవశాత్తూ ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడి గాయాలు పాలైంది. స్థానికులు గుర్తించి...ఆమెను 108 వాహనంపై టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్టు తెలిపారు. మృతురాలి భర్త చిరంజీవులు హైదరాబాద్‌లో కూలి పనులు చేస్తుంటాడు. వీరికి రాహుల్‌, అంజలి అనే పిల్లలు ఉన్నారు. తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాతపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.

Updated Date - Aug 29 , 2026 | 11:58 PM