పొలంలో ఎరువులు చల్లి వస్తూ...
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:20 AM
మండలంలోని పెద్దగుజ్జువాడ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమ్మరిగుంట పంచాయతీ సింగంవలస గ్రామానికి చెందిన కుంచి సుబ్బారావు (36) మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మరొకరికి తీవ్ర గాయాలు
జలుమూరు (సారవకోట), ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దగుజ్జువాడ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమ్మరిగుంట పంచాయతీ సింగంవలస గ్రామానికి చెందిన కుంచి సుబ్బారావు (36) మృతి చెందాడు. లంబ గ్రామానికి చెందిన పోతల నాగరాజు (45)కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు బుధవారం సుబ్బారావు అత్తవారి గ్రామమైన లంబ వెళ్లాడు. అక్కడి నుంచి తన బావమరిది పోతల నాగరాజుతో కలసి సాయంత్రం ఎరువులు వేయడానికి పొలానికి వెళ్లాడు. పొలం నుంచి తిరిగి లంబ గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా... పెద్దగుజ్జువాడ వద్ద ఎదురుగా వస్తున్న జీపు ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న సుబ్బారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెనుక కూర్చున్న నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని గాయాలకు గురైన నాగరాజును టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ. అనిల్‌కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి కోటబొమ్మాళిలోని సామాజిక ఆస్పత్రికి తరలించినట్టు ఎస్‌ఐ చెప్పారు. మృతునికి భార్య సుజాత, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబాన్ని పోషించే యజమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పిల్లలను ఎలా పోషించేదని భార్య విలపించిన తీరు అందరినీ కలచివేస్తోంది.