Share News

వృద్ధాప్యం శాపమై.. రాయికి బలై!

ABN , Publish Date - Jul 11 , 2026 | 12:36 AM

అప్పటి వరకూ తనతో ఉన్న ఇద్దరూ ప్రమాదాన్ని గమనించి తప్పుకున్నారు. కానీ వృద్ధాప్యం కారణంగా ఆ వ్యక్తి తప్పుకోలేక పోయాడు.

వృద్ధాప్యం శాపమై.. రాయికి బలై!
ఎర్రయ్య (ఫైల్‌)

కోటబొమ్మాళి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): అప్పటి వరకూ తనతో ఉన్న ఇద్దరూ ప్రమాదాన్ని గమనించి తప్పుకున్నారు. కానీ వృద్ధాప్యం కారణంగా ఆ వ్యక్తి తప్పుకోలేక పోయాడు. రాయి కింద పడి కన్నుమూశాడు. పొడుగుపాడు సమీపంలోని దాలికొండపై ఉన్న అరసవల్లి గ్రానైట్‌ క్వారీలో శుక్రవారం సాయంత్రం రాయి పడడంతో రేగులపాడు కు చెందిన పల్లి ఎర్రయ్య (62) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు తోటి కూలీలు గొలివి ధర్మారావు, వెలమల మల్లేసుతో కలసి ఎర్రయ్య పని చేస్తుండగా.... పెద్ద రాయి దొర్లుకుంటూ వీరి మీదకు వచ్చింది. ఇద్దరు పక్కకు దూకి తప్పించుకోగా... ఎర్రయ్య వృద్ధుడు కావడంతో తప్పించుకోలేక... రాయి కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే కూలీలు క్వారీలో ఉన్న ఎక్సకవేటర్‌తో రాయిని పక్కకు జరిపి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధర్మారావు, మల్లేసుకు స్వల్ప గాయాలు కావడంతో వారిని స్థానిక స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. మృతుడు ఎర్రయ్యకు భార్య పార్వతి, వివాహితులైన కుమార్తెలు కింజరాపు ఉమా, దే శిల్లి హేమలతలు ఉన్నారు. ఈ మేరకు స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 11 , 2026 | 12:36 AM