ఓపీఎస్‌కు ఓకే
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:42 PM
OPS benefit for employees రాష్ట్ర ప్రభుత్వం.. 2004 సెప్టెంబరుకు ముందు జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాతపెన్షన్ పథకాన్ని (ఓపీఎస్) అమలు చేయనుంది. ఈ మేరకు సోమవారం మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీచేసింది.
మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
డిసెంబరు 31లోగా ఆప్షన్ ఇవ్వాలని ఉత్తర్వులు
జిల్లాలో 725 ఉద్యోగులకుపైగా ప్రయోజనం
విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలకూ లబ్ధి
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, నవంబరు 10(ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ప్రభుత్వం.. 2004 సెప్టెంబరుకు ముందు జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాతపెన్షన్ పథకాన్ని (ఓపీఎస్) అమలు చేయనుంది. ఈ మేరకు సోమవారం మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీచేసింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) స్థానంలో పాత పెన్షన్ పథకాన్ని(ఓపీఎస్) అమలు చేయాలన్న డిమాండ్ ఎట్టకేలకు నెరవేరడంతో ఆయా ప్రభుత్వ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
వాస్తవానికి ఓపీఎస్ అమలుకు సంబంధించి ప్రభుత్వం జూలై 13న ఉత్తర్వులు విడుదల చేసింది. మూడు నెలల్లోగా సీపీఎస్ విధానంలో ఉండేది.. లేదా ఓపీఎస్‌లోకి మారడమా? అనే అప్షన్ ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. కాగా మార్గదర్శకాల విడుదలలో జాప్యం కావడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి మార్గదర్శకాలు రూపొందించింది.
ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో మొత్తం 725 మందికిపైగా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఓపీఎస్ వర్తించనుంది. గ్రూప్-1, గ్రూప్-2, పోలీసు, ఇతర శాఖల్లో 309 మంది ఉద్యోగులకు ప్రయోజనం దక్కనుంది. అలాగే ఎస్జీటీలు 250 మంది, స్కూల్ అసిస్టెంట్‌లు 166 మంది ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరనుంది. వీరితోపాటు మరో వంద మంది వరకూ విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం కలుగనుంది.
సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు దరఖాస్తు చేసుకునే ఉద్యోగులు నిధి పోర్టల్ ద్వారా ఆప్షన్లు ఎంచుకోవాలి. అర్హులైన ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు, మృతుల కుటుంబ సభ్యులు తమ ఆప్షన్‌ను డిసెంబరు 31వ తేదీలోగా నమోదు చేయాలి. ఉద్యోగులు తమ ప్రాథమిక నియామకం నుంచి నిర్దేశిత ఫార్మెట్‌లో నాలుగు రకాల సర్టిఫికెట్లను పంపాల్సి ఉంటుంది. రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కాపీ, సెలక్షన్ లిస్టు లేదా అలాట్‌మెంట్ ఆర్డర్, తొలి అపాయింట్‌మెంట్, జాయినింగ్ ఆర్డర్ మొదలైనవి దరఖాస్తుతోపాటు సమర్పించాలి. ఓపీఎస్‌లోకి ఉద్యోగుల మార్పు పొందిన అనంతరం వారికి జీపీఎఫ్ ఖాతా కేటాయిస్తారు. సీపీఎస్‌లోని ఉద్యోగి వాటా సొమ్మును వడ్డీతో సహా జీపీఎస్ ఖాతాకు జమ చేస్తారు.
కల నెరవేరింది
పాత పెన్షన్ పథకం కోసం ఎన్నోఏళ్లుగా పోరాడుతున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు.. ప్రభుత్వం ఓపీఎస్ అమలుకు ఉత్తర్వులు జారీ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఉపాధ్యాయ, ఉద్యోగుల కల నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు
- కె.శ్రీహరి, ఓపీఎస్ ఉద్యోగుల కమిటీ ఫోరం జిల్లా కన్వీనర్
ఎంతో ఆనందం
ఓపీఎస్ కోసం ఏళ్ల తరబడి పోరాటం చేశాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57 మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్ విధానం అమలు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేయడం ఎంతో అనందంగా ఉంది. వందలాది కుటంబాలకు ఓపీఎస్ విధానం ఆసరాగా నిలుస్తుంది.
- తండ్యాల జనార్దనరావు, ఉపాధ్యాయుడు, 2003 డీఎస్సీ అభ్యరి