ఓపీఎస్‌కు ఓకే!
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:17 AM
Preparations to implement old pension system ఉపాధ్యాయుల చిరకాల డిమాండ్.. పాత పెన్షన్ పథకం(ఓపీఎస్)ను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డీఎస్సీ - 2002, 2003 రిక్రూట్‌మెంట్లలో నియమితులైన ఉపాధ్యాయులతోపాటు 2004 ఆగస్టు 31లోగా విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా భర్తీ అయిన ఉద్యోగులందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) స్థానంలో ఓపీఎస్ వర్తింపజేసేలా కసరత్తు జరుగుతోంది.
డీఎస్సీ - 2002, 2003 ఉపాధ్యాయులకు పాతపెన్షన్ విధానం అమలుకు సన్నాహాలు
2004 ఆగస్టు 31లోపు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందినవారికీ వర్తించేలా కసరత్తు
జిల్లాలో 715 మందికి ప్రయోజనం
నరసన్నపేట, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల చిరకాల డిమాండ్.. పాత పెన్షన్ పథకం(ఓపీఎస్)ను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డీఎస్సీ - 2002, 2003 రిక్రూట్‌మెంట్లలో నియమితులైన ఉపాధ్యాయులతోపాటు 2004 ఆగస్టు 31లోగా విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా భర్తీ అయిన ఉద్యోగులందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) స్థానంలో ఓపీఎస్ వర్తింపజేసేలా కసరత్తు జరుగుతోంది. ఈ ప్రతిపాదనపై త్వరలోనే ప్రభుత్వం ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే ఉమ్మడి జిల్లాలో మొత్తం 715 మందికిపైగా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఓపీఎస్ వర్తించనుంది. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2, పోలీసుశాఖ, ఇతర శాఖల్లో సుమారు 309 మంది ఉద్యోగులతోపాటు, ఉపాధ్యాయులకు సంబంధించి ఎస్జీటీలు 240 మంది, స్కూల్ అసిస్టెంట్లు 166 మందికి ప్రయోజనం దక్కనుంది.
ఏమి జరిగిందంటే..
కేంద్ర ప్రభుత్వం 2020, 2023 సంవత్సరాల్లో జారీచేసిన మోమో ఉత్తర్వులు 57 సూచనలు ప్రకారం సీపీఎస్ అమలైన 2004 సెప్టెంబరు ఒకటో తేదీకి ముందు ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయ్యి, పరీక్షలు, ఫలితాలు, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తయినవారందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాల్సి ఉంది. కాగా రాష్ట్రంలో డీఎస్సీ - 2003లో ఉపాధ్యాయ ఉద్యోగ నోటిఫికేషన్ నవంబరులో జారీకాగా రాతపరీక్ష 2004 ఏప్రిల్‌లో జరిగింది. ఫలితాలు అదే ఏడాది జూన్ 11న ప్రకటించారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులను ప్రకటించారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ 2005 ఏప్రిల్ నాటికి పూర్తయింది. ఈ డీఎస్సీలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 406 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. ఉద్యోగాల్లో చేరేనాటికి 2005వ సంవత్సరం వచ్చిందన్న సాకుతో అప్పటి ప్రభుత్వం వీరందరికీ సీపీఎస్‌ను వర్తింపజేసింది. దీంతో తమను ఓపీఎస్‌ను తప్పించడం అన్యాయమంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ, ఉద్యోగ అభ్యర్ధులు ఏళ్ల తరబడి నిరసనలు, ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం సీపీఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ అమలు చేయలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం స్పందించి.. వీరందరికీ ఓపీఎస్ అమలుకు సన్నాహాలు చేస్తోంది. సీపీఎస్ అమలు తేదీకంటే ముందుగానే విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియామకాలు జరగడంతో డీఎస్సీ- 2003 ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేయనుంది. అలాగే ఎంపికల ప్రక్రియ పూర్తయినా, కోర్టు వివాదాల వల్ల నియామకాలు ఆలసమైన డీఎస్సీ-2002 ఉపాధ్యాయులకు కూడా ఓపీఎస్‌ను వర్తింపజేయనుంది. పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. దీంతో ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
కార్యరూపం దాల్చాలి
పాత పెన్షన్ కోసం ఎన్నోఏళ్లుగా పోరాడుతున్న ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ప్రభుత్వ ఆలోచన సంతోషాన్నిచ్చింది. దీనిని కార్యరూపంలోకి తీసుకురావడానికి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు
- కొత్తకోట శ్రీహరి, ఉమ్మడి జిల్లా కన్వీనర్, డీఎస్సీ-2003 టీచర్స్ ఫోరం
ఎంతో సంతోషం
ఓపీఎస్ అమలు కోసం ఎంతో పోరాటం చేశాం. కేంద్రప్రభుత్వం ఇచ్చిన మోమో 57 మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్ విధానం అమలు చేయనుండడం హర్షణీయం. ఓపీఎస్ విధానం అమలైతే ఎంతో మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఆసరా కలుగనుంది.
తండ్యాల జనార్దనరావు, ఉపాధ్యాయుడు, 2003 డీఎస్సీ అభ్యర్థి