Share News

అమ్మో.. న్యూమెనియా

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:49 PM

చలి కాలం ప్రారంభమైంది. జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

అమ్మో.. న్యూమెనియా

- జిల్లాలో పెరుగుతున్న బాధితులు

- చలికాలంలో అప్రమత్తంగా ఉండాలి

- చిన్నపిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

-లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి

- నేడు ప్రపంచ న్యూమోనియా దినోత్సవం

నరసన్నపేట, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): చలి కాలం ప్రారంభమైంది. జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ కాలంలో న్యూమోనియా బాధితులు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఊపిరితిత్తులను కాపాడుకోవాలని చెబుతున్నారు. ప్రజలు జలుబు, దగ్గు వంటి రుగ్మతల బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు పాటించాలని, లేదంటే జులుబు, దగ్గు ముదిరి న్యూమోనియాకు దారి తీసి ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. న్యూమెనియా ఒక అంటు వ్యాధి. బ్యాక్టీరియా, వైరస్‌, శిలీంధ్రాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లతో ఊపిరితిత్తుల్లో ద్రవం లేదా చీము ఏర్పడటానికి కారణమవుతుంది. న్యూమోనియాకు గురైతే జ్వరం రావడం, శ్లేష్మంతో కూడిన దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు వంటివి ఏర్పడతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల్లో ప్రమాదంగా ఉంటుంది. గురువారం ప్రపంచ న్యూమోనియా దినం సందర్భంగా కథనం.

జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో న్యూమోనియా బాధితులు ప్రతి ఏటా పెరుగుతున్నారు. వైద్యఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు సుమారు 3,500 మంది న్యూమోనియా బారిన పడ్డారు. గతేడాది కంటే ఈ ఏడాది 10శాతం మేర బాధితులు పెరిగారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో దాదాపు 14 శాతం మరణాలకు న్యూమెనియా కారణమని వెల్లడైంది. జిల్లాలో సంభవించిన శిశు మరణాల్లో 6 శాతం నుంచి7 శాతం వరకు న్యూమోనియా బాధితులేనని గణాంకాలు చెబుతున్నాయి. న్యూమోనియా లక్షణాలను సకాలంలో గుర్తించి, వైద్య సేవలను అందించడం ద్వారా దాని నుంచి బయట పడవచ్చునని వైద్యులు చెబుతున్నారు.

ఎలా సంక్రమిస్తుందంటే..

న్యూమోనియా బ్యాక్టీరియా, వైరస్‌ వలన కూడా వస్తుంది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు గాలిలో విడుదలయ్యే బిందువుల ద్వారా ఒకరి ద్వారా మరొకరికి సంక్రమించవచ్చు. పుట్టిన వెంటనే తల్లి నుంచి బిడ్డకు కూడా వ్యాపిస్తుంది. తల్లిదండ్రులు ధూమపానం చేయడం, అఽధిక కాలుష్యం, రద్దీగా ఉంటే ప్రాంతాల్లో నివసించడంతో పాటు కొన్ని పర్యావరణ కారకాల వల్ల కూడా న్యూమోనియా బారిన పడే ప్రమాదం ఉంది.

శిశువుల్లో లక్షణాలు ఇవే..

- జ్వరం, చలి

- చెమటలు పట్టడం

- ఆకలి లేకపోవడం

- శక్తి లేకపోవడం

-శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

- దగ్గు, ఛాతీనొప్పి

- వేగంగా శ్వాస తీసుకోకపోవడం. సాధారణంగా కంటే ఎక్కవగా ఏడవడం

- ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు గుసగుసలాగే శబ్దం రావడం

పెద్దల్లో లక్షణాలు

- జ్వరం ఒక్కసారిగా పెరుగుతుంది. తగ్గదు

- తీక్షణ దగ్గు- మ్యూకస్‌/చిమ్మతో వస్తుంది. కొన్నిసార్లు ఆకుపచ్చగా లేదా పసుపుగా వస్తుంది

- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఊపిరి బిగుసుకుపోవడం. ప్రత్యేకంగా శ్వాసతీసుకుంటే ఛాతితో నొప్పి పెరుగుతుంది.

- తీవ్ర అలసట వస్తుంది. కొద్ది దూరంగా నడిస్తే ఆయాసం, బలహీనతగా ఉంటుంది. ముందుకు అడుగు వేయలేని స్థితి కూడా కొన్నిసమయాల్లో ఉంటుంది.

- వికారం, వాంతులు

ఈ పరీక్షలు చేయాలి..

రోగికి శారీరక పరీక్ష, లేదా రక్తం, కఫం పరీక్షలు, పల్స్‌ అక్సిమెట్రీ, సీటీ స్కాన్‌, ఛాతీ ఎక్స్‌-రే వంటి ఇమేజింగ్‌ పరీక్షలు, బ్రొంకోస్కోపి, ధమనుల రక్తవాయువు పరీక్షల ద్వారా న్యూమోనియోను నిర్ధారించవచ్చును.

నివారణ మార్గాలు..

న్యూమోనియా నివారణకు సంబంధించి ఉత్తమ విధానాల్లో మొదటిది వైరస్‌, బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా టీకాలు వేయడం. సూక్ష్మజీవులతో పోరాడేందుకు, శరీరానికి రోగ నిరోధక శక్తి ఇచ్చేందుకు ఈ టీకాలు దోహదం చేస్తాయి.

- ధూమపానం మానుకోవాలి. ఎందుకంటే ఇది శ్వాస కోశ ఇన్ఫెక్షన్లను పట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది

- పరిశ్రమలు, వాహనాల నుంచి వచ్చే పొగకు దూరంగా ఉండాలి. ఈ పొగద్వారా ఊపిరితిత్తులు పాడయ్యే అవకాశం ఉంది.

- తగినంత వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా అవసరం.

- రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు తాజా పండ్లు, కాయకూరలు తినాలి. ఆకుకూరలు కూడా తీసుకోవాలి.

- మద్యం తాగడం మానుకోవాలి.

డాక్టర్‌ను సంప్రదించాలి

తరచుగా జ్వరం రావడం, జలుబు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. న్యూమోనియాను మొదటి దశలో గుర్తించడం ద్వారా త్వరగా కోలుకోవచ్చును. చిన్నపిల్లల్లో గుర్తించడమే కష్టం. కాబట్టి తల్లి ఈ లక్షణాలను గుర్తించాల్సి ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరం.

-డాక్టర్‌ రెడ్డి భార్గవ్‌, ఎండీ, సీహెచ్‌సీ, నరసన్నపేట

అవగాహన పెంచుతున్నాం

గ్రామాల్లో న్యూమెనియాపై అవగాహన పెంచుతున్నాం. చలికాలంలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నాం. దగ్గు, జలుబుతో బాధపడేవారికి కఫం పరీక్షలను నిర్వహిస్తున్నాం. వృద్ధుల్లో ఎక్కువగా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రజలు చలికాలంలో మరింత అప్రమత్తంగా ఉంటే న్యూమోనియా నివారించవచ్చు.

పి.గురునాథరావు, పీహెచ్‌సీ వైద్యుడు, సైరిగాం, జలుమూరు మండలం

Updated Date - Nov 11 , 2026 | 11:49 PM