Share News

అమ్మో..పిడుగులు

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:57 PM

జిల్లాలో మూడు రోజుల వ్యవధిలోనే పిడుగుపాటుకు నలుగురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.

అమ్మో..పిడుగులు

- జిల్లాలో మూడు రోజుల్లో నలుగురి మృతి

- ప్రతిఏటా పెరుగుతున్న బాధితులు

- జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు

- ఈ నెల 5న మందస మండలం పెద్ద కేసుపురంలో పిడుగుపాటుకు గురై తల్లీకూతురు మడియా కృష్ణవేణి, యోగేశ్వరి మృతి చెందారు. జీడితోటలో పిక్కలు ఏరుతుండగా ఒక్కసారిగా మేఘావృతమై వర్షం ప్రారంభమైంది. ఇంతలోనే పిడుగుపడడంతో తల్లీకూతురు తోటలోనే నేలకొలిగారు.

- ఈ నెల 6న మహేంద్రగిరుల్లో పిడుగు పడడంతో మెళియాపుట్టి మండలం రట్టిని గ్రామానికి చెందిన వినోద్‌ జెన్నా అనే యువకుడు మృతి చెందాడు. స్నేహితులతో కలిసి మహేంద్రగిరులను చూసేందుకు వినోద్‌ వెళ్లాడు. స్నేహితులంతా గుడిలో ఉండగా బయట ఉన్న వినోద్‌పై పిడుగు పడడంతో ఘటనాస్థలంలోనే మృతిచెందాడు.

- ఈ నెల 6న జి.సిగడాంలో కురిటి భూలోకమ్మకు చెందిన ఇంటి ఆవరణలో పిడుగుపడింది. దీంతో ఇంట్లో ఉన్న విద్యుత్‌ పరికరాలన్నీ ధ్వంసమయ్యాయి. ఇంటిపైక ప్పు ఊడిపడింది.

రణస్థలం/మెళియాపుట్టి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడు రోజుల వ్యవధిలోనే పిడుగుపాటుకు నలుగురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి వర్షా కాలంలో పిడుగులు ఎక్కువగా పడతాయి. కానీ, ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే పిడుగుల మోత ప్రారంభం కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజులుగా వాతావరణంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం వరకూ తీవ్రంగా ఎండ ఉంటోంది. ఆ తరువాత ఒక్కసారిగా మేఘావృతమవుతోంది. వెంటనే ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. అయితే ఎక్కువగా పిడుగుపాటుకు బడుగులు, రైతులే బలవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏటా ఏప్రిల్‌ నాటికి రబీకి సంబంధించి పంటలు పూర్తవుతాయి. ఆ సమయంలో మేకలు, గొర్రెలు, ఆవులు మందలు వేసేందుకు పొలాలు అనుకూలం. పగలంతా పొలాల్లో మేతలు పెడతారు. రాత్రికి పొలాల్లో మందలు వేస్తారు. తద్వారా వాటి మల, మూత్రవిసర్జనతో భూమికి సారం లభిస్తుంది. మందలో పశువులను బట్టి ఒక రాత్రికి రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకూ తీసుకుంటారు. అయితే ఆ సమయంలోనే పిడుగు పాటుతో కాపరులతో పాటు మూగజీవులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఎంతటి వర్షమైనా.. ఉరుములు, మెరుపులు వచ్చిన పశువుల వద్దే కాపరులు ఉండాలి. ఆ సమయంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ పిడుగుపాటు ప్రమాదాలను ముందుగానే పసిగట్టి సమాచారం ఇస్తోంది. ‘వజ్రపాత్‌’ యాప్‌ ద్వారా అప్రమత్తం చేస్తున్నా ఫలితం లేకపోతోంది. గొర్రెల పెంపకందారులకు స్మార్ట్‌ ఫోన్లు ఇచ్చి అవగాహన కల్పిస్తే వారి ప్రాణాలను కాపాడవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇలా చేయండి..

ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద, ఎత్తయిన ప్రదేశాల్లో ఉండకూడదు. వ్యవసాయ పంపు సెట్లలకు దూరంగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఉండాల్సి వస్తే మోకాళ్ల మధ్య తల వంచి, రెండు చేతులతో చెవులు మూసుకొని భూమికి తగలకుండా కూర్చోవాలి. ఆరుబయట, రేకులషెడ్లు, వరండాల్లో ఉండకూడదు. పశు సంపదను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి. ఇళ్లలో ఉన్నవారు తలుపులు, కిటికీలను మూసేసి విద్యుత్‌ సరఫరాను నిలిపివేయాలి.

మృతుల కుటుంబాలకు సాయం

గత ఐదేళ్లలో జిల్లాలో 100 మందికి పైగా పిడుగుపాటుకు మృతిచెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ, గత వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్కరికీ పూర్తిస్థాయిలో సాయం అందిన దాఖలాలు లేవు. వాస్తవానికి పిడుగుపాటుతో ఎవరైనా మృతిచెందితే బాధిత కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం అందించాలి. ఒకవేళ 60 శాతం వైకల్యం దాటితే రూ.2 లక్షలు, 60 శాతం లోపు ఉంటే రూ.59 వేలు పరిహారంగా అందిస్తారు. మృతుడి వివరాలు, పోస్టుమార్టం నివేదిక, ఎఫ్‌ఐఆర్‌ తదితర వివరాలతో తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. వీటిని అధికారులు పరిశీలించి కలెక్టర్‌ కార్యాలయానికి పంపిస్తారు. అనంతరం పరిహారం మంజూరవుతుంది. అయితే, గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులు నివేదికలు అందించినా పరిహారం మాత్రం చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పిడుగుపాటు బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు అందిస్తోంది. 2022 నుంచి నిలిచిపోయిన పెండింగ్‌ పరిహారాన్ని సైతం మంజూరు చేసింది.

Updated Date - Apr 07 , 2026 | 11:57 PM