Share News

అయ్యో.. ఎంతపని చేశావు తల్లీ!

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:02 AM

Woman dies after being hit by train with children భార్యాభర్తల మధ్య మద్యం చిచ్చు రేపింది. భర్త మద్యం తాగి వచ్చాడనే మనస్తాపంతో.. శ్రీకాకుళం నగరం గూనపాలెంలో నివసిస్తున్న పొలుమూరు జ్యోతి(33).. తన ఇద్దరి కుమారులతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాతగారింటికి వెళ్దామని చెప్పి.. నరసన్నపేట మండలం కంబకాయి పాత రైల్వేగేట్‌ వద్దకు చేరుకుని.. రైలు కిందకు దూకింది.

అయ్యో.. ఎంతపని చేశావు తల్లీ!
శ్రీకాకుళంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హేమంత్‌, పునీత్‌.. ఇన్‌సెట్‌లో జ్యోతి(ఫైల్‌),

  • దంపతుల మధ్య చిచ్చురేపిన చిన్న విషయం

  • పిల్లలతో రైలు కింద పడి వివాహిత మృతి

  • కాళ్లు కోల్పోయి.. బయటపడిన కుమారులు

  • రైలు ఆపి.. ఆ ఇద్దరినీ కాపాడిన లోకోపైలెట్‌

  • ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

  • చిన్నపాటి వివాదం.. క్షణికావేశం.. ఆ కుటుంబాన్ని చీకట్లోకి నెట్టాయి. ఓ మహిళ ప్రాణం తీసుకునేలా చేశాయి. ఇద్దరు పిల్లలకు అమ్మను లేకుండా చేశాయి. వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేశాయి.

  • ఆ తలంపే వచ్చినప్పుడు.. ఒక్కక్షణం.. ఒక్కక్షణం స్థిమితంగా ఉండుంటే.. ఇద్దరు బంగారు బిడ్డల గురించి ఆలోచించి ఉంటే.. ఇంత ఘోరం జరిగేదా? వారి జీవితాల్లో చీకట్లు అలముకునేవా?

  • ఆ ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారుగానీ, వారిని లాలించేదెవరు? ఆలనాపాలన చూసేదెవరు? అమ్మ ప్రేమను పంచేదెవరు? కోల్పోయిన వారి కాళ్లు తెచ్చివ్వగలమా? జీవితాంతం ఈ ఘోరం వారిని వెంటాడదా?

  • ఆసుపత్రిలో ఈ ఇద్దరు చిన్నారుల నరకయాతన.. ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది. హృదయం ముక్కలయ్యేలా చేస్తోంది. నరసన్నపేట సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘోరం హృదయవిదారకం.

  • నరసన్నపేట/ శ్రీకాకుళం క్రైం, మార్చి 31(ఆంధ్రజ్యోతి): భార్యాభర్తల మధ్య మద్యం చిచ్చు రేపింది. భర్త మద్యం తాగి వచ్చాడనే మనస్తాపంతో.. శ్రీకాకుళం నగరం గూనపాలెంలో నివసిస్తున్న పొలుమూరు జ్యోతి(33).. తన ఇద్దరి కుమారులతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాతగారింటికి వెళ్దామని చెప్పి.. నరసన్నపేట మండలం కంబకాయి పాత రైల్వేగేట్‌ వద్దకు చేరుకుని.. రైలు కిందకు దూకింది. ఈ ఘటనలో జ్యోతి మృతి చెందగా.. ఇద్దరు కుమారులు మాత్రం తీవ్ర గాయాలతో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రైల్వేపోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

  • నరసన్నపేట మండలం కంబకాయి గ్రామానికి చెందిన పొలుమూరు చిన్నవాడు, వేణుమ్మకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో చిన్న కుమార్తె జ్యోతికి ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి రమణతో 14 ఏళ్ల కిందట వివాహమైంది. రమణ డీఆర్డీఏలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తూ.. కుటుంబంతో శ్రీకాకుళంలోని గూనపాలెంలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు హేమంత్‌, పునీత్‌ ఉన్నారు. శ్రీకాకుళంలోని ప్రైవేటు స్కూల్‌లో హేమంత్‌ ఏడోతరగతి, పునీత్‌ నాలుగో తరగతి చదువుతున్నారు. వెంకటరమణ సోమవారం తెలిసినవారి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి మద్యం సేవించి రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. మద్యం తాగి రావడం ఏమిటని రమణను భార్య జ్యోతి నిలదీసింది. వీరిద్దరి మధ్య తగాదా చోటుచేసుకుని.. కొద్దిసేపటికి సద్దుమనిగింది. కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేసి పడుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు వెంకటరమణ తన కార్యాలయానికి వెళ్లిపోయాడు. జ్యోతి పిల్లలను స్కూల్‌కు పంపించకుండా.. తాతగారి ఊరువెళ్దామని చెప్పింది. కుమారులతో కలిసి శ్రీకాకుళం నుంచి నరసన్నపేటకు బస్సులో చేరుకుంది. అక్కడి నుంచి ఆటో ఎక్కి కంబకాయి గ్రామం దాటిన తర్వాత పాతగేట్‌.. అండర్‌ పాసేజ్‌ వద్ద దిగింది. బసివాడ వైపు రైల్వేట్రాక్‌ పక్కన నడుస్తూ.. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న వివేకా ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందకు అకస్మాత్తుగా పిల్లలతో కలిసి పట్టాలపైకి దూకింది. ఈ ఘటనలో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. పట్టాలపై హేమంత్‌, పునీత్‌ కాళ్లు ఇరుక్కుపోయాయి. హేమంత్‌కు ఎడమకాలు ముడికి కింద భాగం తెగిపోయింది. పునీత్‌కు కుడికాలు ముడికి కింద వరకు, ఎడమ కాలు పాదం కింద భాగం తెగిపోయింది. తలకు కూడా గాయమైంది. లోకో పైలట్‌ రైలు నిలుపుదల చేశారు. గాయాలపాలైన ఆ ఇద్దరు పిల్లలను అదే రైలులో శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి రైల్వే అధికారులు అంబులెన్స్‌లో శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు. అయితే పునీత్‌ను మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఓ వైపు తల్లి దూరమై.. మరోవైపు కాళ్లు పోగొట్టుకుని చికిత్స పొందుతున్న ఆ ఇద్దరినీ చూసి.. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, ఇటువంటి ఘటన జరుగుతుందని ఊహించలేదని దిగ్ర్భాంతి చెందారు.

Updated Date - Apr 01 , 2026 | 12:02 AM