Share News

అయ్యో.. వన్యప్రాణులు

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:24 AM

Wildlife suffers due to lack of water అటవీ ప్రాంతాల నుంచి వన్యప్రాణులు మైదాన ప్రాంతాలకు తరలివచ్చి.. ఊహించని విధంగా మృత్యువాత పడుతున్నాయి. కొన్ని రోడ్డు ప్రమాదాల్లో.. మరికొన్ని కుక్కల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి.

అయ్యో.. వన్యప్రాణులు
పలాస వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన జింకను పరిశీలిస్తున్న అటవీశాఖ జంతు పరిరక్షకుడు

  • అడవిని వీడి.. మృత్యుమార్గాల వైపు

  • వేసవిలో నీరు లభించక ఇబ్బందులు

  • మైదాన ప్రాంతాలకు వస్తూ.. ప్రాణాలు కోల్పోతున్న వైనం

  • పలాస, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి):

  • గత నెల 20న పలాసలోని పాత జాతీయ రహదారి శాసనం గ్రామం వద్ద లారీ ఢీకొని ఓ జింక మృతి చెందింది. అటవీ ప్రాంతం నుంచి దప్పిక తీర్చుకోవడానికి వచ్చిన ఆ జింక.. రోడ్డు ప్రమాదానికి గురై విగతజీవిగా మారింది.

  • గత నెల 21న ఓ జింక కొండపై నుంచి దాహం తీర్చుకోవడానికి ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ వెనుక ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంతానికి వచ్చింది. దీనిని చూసిన కుక్కలు వెంబడించి.. దాడి చేసి.. చంపి తినేశాయి.

  • ఏడాది కిందట కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోకి అరుదైన అడవిగొర్రె ఒకటి తప్పించుకొని వచ్చింది. కుక్కలు దాడి చేయడంతో ఒకరోజు చికిత్స అనంతరం మృత్యువాత పడింది.

  • కొన్నాళ్ల కిందట పలాస మండలం వీరభద్రాపురం గ్రామ సమీపంలో అరుదైన రక్తపింజరి పాములు ఐదు చేరుకొని ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. స్నేక్‌ స్నాచర్‌ చాకచక్యంగా వాటిని పట్టుకొని సమీప కొండల్లో విడిచిపెట్టారు.

  • మందస, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో అరుదైన చుక్కల జింకలు తరచూ నీటి కోసం గ్రామాల్లో సంచరిస్తున్నాయి. కుక్కలు వెంబడిస్తుండడంతో రక్షణ కోసం ఇళ్లల్లోకి వస్తున్నాయి.

  • అటవీ ప్రాంతాల నుంచి వన్యప్రాణులు మైదాన ప్రాంతాలకు తరలివచ్చి.. ఊహించని విధంగా మృత్యువాత పడుతున్నాయి. కొన్ని రోడ్డు ప్రమాదాల్లో.. మరికొన్ని కుక్కల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. కాశీబుగ్గ, పాతపట్నం, టెక్కలి అటవీ పరిధిలో నిత్యం ఇటువంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల పులులు కూడా అడవిని వీడి మైదానం బాట పట్టాయి. భామిని, కొత్తూరు ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తూ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. పాములు, ఎలుగుబంట్లు, హైనాల గూర్చి చెప్పనవసరం లేదు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అడవి జంతువులు రోడ్లపై సంచరిస్తూనే ఉన్నాయి. అడవుల్లో పోడు వ్యవసాయం పేరుతో చెట్లు నరికివేయడం, భారీ వృక్షాలను కలప కోసం తరలించడం, అక్రమంగా కొండలు, గుట్టలు తవ్వుతూ కంకరను తరలిస్తుండడంతో అడవిలో ఉండాల్సిన జీవులు జనావాసాల్లోకి వస్తున్నాయి. దీనికితోడు వర్షాభావం కారణంగా నీటి నిల్వలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో నీటి కోసం వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తు మృత్యువాత పడుతున్నాయి. గతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో జంతువులు, ఇతర జీవరాశులు ఉన్న అడవి భూముల్లో చెరువులు తవ్వడం, వాటికి నీటి కుండీలు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం వాటికోసం ప్రత్యేకంగా నిధులు లేకపోవడంతో అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేకపోతున్నారు. ఫలితంగా అడవిలో ఉండే వన్యప్రాణులు రోడ్లపైకి వచ్చి మృత్యువాత పడుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. దీనిపై అటవీశాఖ అధికారులు తగు రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది.

Updated Date - Apr 14 , 2026 | 12:24 AM