స్వర్ణ గ్రామమా నీవెక్కడ?
ABN , Publish Date - Jun 24 , 2026 | 11:13 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
- సచివాలయాల పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- నాలుగు నెలలు కావస్తున్నా భవనాలపై మారని పేర్లు
పాతపట్నం, జూన్ 24(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మారుస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీచేసింది. అయితే, నాలుగు నెలలు కావస్తున్నా క్షేత్రస్థాయిలో మార్పులు కనిపించడం లేదు. కార్యాలయ బోర్డులపై పాతపేర్లే దర్శనమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 732 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా, ఒక్క కార్యాలయంపై కూడా బోర్డు మార్చిన దాఖలాలు లేవు. రికార్డులు, కాగితాల్లో మాత్రం అధికారులు స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు అని రాసుకుంటున్నారు. ప్రజలు ఇప్పటికీ వాటిని సచివాలయాలుగానే పిలుస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, అర్జీల విషయంలో సాంకేతికంగా స్వర్ణ గ్రామంగా ప్రస్తావిస్తుండడంతో ప్రజలు అసలు ఈస్వర్ణ గ్రామం కార్యాలయం ఎక్కడ ఉందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. కనీసం రంగులు మార్చడం, కొత్త బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని సచివాలయాలపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు బోర్డులను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది.