Share News

అయ్యో.. చిన్ని తల్లులూ!

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:35 AM

మూడేళ్ల భవానీ ముద్దు ముద్దు మాటలు ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నారు. నాలుగు నెలల చాందిని బోసినవ్వులు ఇంకా కళ్లలోంచి చెదిరిపోలేదు.

అయ్యో.. చిన్ని తల్లులూ!
పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్న దృశ్యం

కన్నీటిపర్యంతమైన బంధువులు, గ్రామస్థులు

రెండు రోజుల తర్వాత స్వగ్రామంలో అంత్యక్రియలు

ఆమదాలవలస, జూలై 1 (ఆంధ్రజ్యోతి):

మూడేళ్ల భవానీ ముద్దు ముద్దు మాటలు ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నారు. నాలుగు నెలల చాందిని బోసినవ్వులు ఇంకా కళ్లలోంచి చెదిరిపోలేదు. అపురూపమైన వారి శరీరాలు మూటల్లో కట్టి ఉండడాన్ని చూసి తట్టుకోలేక పోయారు. వెదుళ్లవలసలో తల్లి చేతిలో సోమవారం రాత్రి హత్యకు గురైన ఇద్దరు బాలికలు మంగళవారం ఉదయం పోలీసులు సాయంతో రిమ్స్‌కు చేరుకున్నాయి. తండ్రి రాక ఆలస్యం, బంటుపల్లి-వెదుళ్లవలస గ్రామస్థుల వాగ్వాదంతో బుధవారం సాయంత్రానికి కూడా మృతదేహాలకు పోస్టుమార్టం జరగలేదు. ఒకపక్క అదే ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో తల్లి చికిత్స పొందుతుండగా, మరోపక్క అదే ఆసుప త్రిలోని మార్చురీలో చిన్నారుల మృతదేహాలు ఉండడం తలచుకుని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నారులు భవానీ, చాందిని మృతదేహాలకు రెండు రోజుల అనంతరం ఎట్టకేటలకు బుధవారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం బుధవారం సాయం త్రం అంబులెన్స్‌లో గ్రామానికి చేరుకున్న మృతదేహాలను చూసి గ్రామస్థులు, బంధువుల ఆర్తనాదాలు ఆకాశన్నంటాయి.

అపస్మారక స్థితిలోనే వరలక్ష్మి..

వరలక్ష్మి ఇంకా రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గొంతు కోసుకొని కొన ఊపిరితో మంగళవారం ఆసుపత్రిలో చేరిన ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వరలక్ష్మి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి అపస్మారక స్థితిలోనే ఉన్నట్టు రిమ్స్‌ వైద్యులు తెలిపినట్టు పోలీసులు చెప్పారు.

నలుగురిపై వేధింపుల కేసు

వెదుళ్లవలస ఘటనపై నలుగురిపై బుధవారం వేధింపుల కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సనపల బాలరాజు తెలిపారు. వెదుళ్లవలస గ్రామానికి చెందిన కూర్మాపు వరలక్ష్మి సోమవారం రాత్రి తన ఇద్దరు చిన్నారులు భవానీ (3 ఏళ్లు), చాందిని(4 నెలల) గొంతులను కోసి చంపి.. తాను కూడా గొంతు కోసుకున్న విషయం తెలిసిందే. వరలక్ష్మి తల్లి శీల వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త కూర్మాపు రమణ, అత్త లక్ష్మి, మామ మల్లేసు, అత్త తల్లి మద్దూరు బాజామ్మపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. వరలక్ష్మి, రమణ వివాహం సమయంలో నగదు, బంగారం ఇచ్చినా తరచూ అదనపు కట్నం, భూములు కావాలని తమ కుమార్తెను వేధించారని, దీనివల్ల ఇటువంటి దుశ్చర్యకు వరలక్ష్మి పాల్పడినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. నిందితులను అదుపులోనికి తీసుకున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. కేసు విచారణ డీఎస్పీ, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నిర్వహిస్తున్నారని, పూర్తిస్థాయిలో దర్యాప్తు అనంతరం నలుగురు నిందితులను అరెస్టు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jul 02 , 2026 | 12:35 AM