అమ్మో భల్లూకాలు
ABN , Publish Date - Feb 11 , 2026 | 11:22 PM
అడవులు, కొండలపై ఉండాల్సి ఎలుగుబంట్లు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. ప్రధానంగా జీడి తోటలు అధికంగా ఉన్న ఉద్దానం గ్రామాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.
- గ్రామాల్లోకి వచ్చేస్తున్న ఎలుగుబంట్లు
-తితలీ తుఫాన్ తరువాత ఎక్కువైన వైనం
- అడవులు, కొండలు తరిగిపోతుండడమే కారణం
- ఈ నెల 7న వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ అనకాపల్లి గ్రామ సమీప తోటల్లో రెండు ఎలుగుబంట్లు హల్‌చల్ చేశాయి. పిల్ల ఎలుగుబంటి ఇనుప కంచెలో చిక్కుకుంది. నడుముకు ఇనుప వైరు బిగిసు కోవడంతో బయటకు రాలేకపోయింది. స్థానికులు గుర్తించి అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ప్రత్యేక వాహనంలో వచ్చి.. ఇనుపకంచెలో చిక్కుకున్న ఎలుగుబంటికి మత్తు మందు ఇచ్చి బోన్‌లో బంధించి విశాఖ జూకు తరలించారు. తల్లి ఎలుగుబంటి ఇంకా ఆ ప్రాంతంలో సంచరిస్తూనే ఉంది.
- రెండేళ్ల కిందట కిడిసింగి గ్రామం వద్ద తోటలో పని చేస్తున్న రైతులపై ఎలుగుబంటి దాడి చేసింది. నలుగురు రైతులను హతమార్చింది. మెట్టూరు వద్ద కూడా ఇద్దరు రైతులపై దాడి చేసి చంపేసింది.
- ఆరేళ్ల కిందట సోంపేట మండలం ఎర్రముక్కాం వద్ద ఎలుగుబంట్లు ప్రజలపై దాడి చేశాయి. మొత్తం ఆరుగుర్ని పొట్టన పెట్టుకున్నాయి.
పలాస, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): అడవులు, కొండలపై ఉండాల్సి ఎలుగుబంట్లు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. ప్రధానంగా జీడి తోటలు అధికంగా ఉన్న ఉద్దానం గ్రామాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఏదో ఒకచోట నిత్యం కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు హడలిపోతున్నారు. ప్రస్తుతం జీడి సీజన్ (జనవరి నుంచి జూన్ వరకూ) కావడంతో జీడి పిక్కల సేకరణకు రైతులు తోటలకు వెళ్తున్నారు. అయితే, జీడి తోటల్లో సంచరిస్తున్న ఎలుగుబంట్లు రైతులపై దాడులకు తెగబడుతున్నాయి. వీటి దాడుల్లో ఇప్పటికే పలువురు రైతులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు క్షతగాత్రులుగా మారారు. గతంలో మందస మండలం రట్టి, భేతాళపురం, నల్లబొడ్లూరు, సోంపేట మండలం ఎర్రముక్కాం వంటి ప్రాంతాల్లో ఎలుగుబంట్లు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం వజ్రపుకొత్తూరు మండలం నుంచి సోంపేట మండలం వరకూ విస్తరించిన జీడి తోటలు, సముద్ర తీరప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తూ ప్రజలను భయపెడుతున్నాయి. నల్లబొడ్లూరు కొండలు పదుల సంఖ్యలో ఎలుగుబంట్లకు ఆవాసంగా ఉండేవి. ఈ కొండలను చదును చేయడంతో పాటు చెట్లను తొలగించడంతో ఎలుగుబంట్లు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి.
- తితలీ తుఫాన్‌కు ముందు దట్టమైన జీడి తోటలు, కొండలు, గుట్టల మధ్యలో ఎలుగుబంట్లు ఆవాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తుండేవి. 2018 అక్టోబరు 11న సంభవించిన తితలీ తుఫాన్‌తో ఉద్దానం స్వరూపం మారిపోయింది. తుఫాన్ బీభత్సానికి వేల సంఖ్యలో చెట్లు నేలకొరగ్గా, కొండలు, గుట్టలు కరిగిపోయాయి. దీంతో ఎలుగుబంట్లు నివసించేందుకు ఆవాసం లేకుండా పోయింది. దీనికి తోడు ఎలుగుబంట్లు ఎక్కువగా నివాసం ఉండే నల్లబొడ్లూరు కొండను క్వారీకి వినియోగించడంతో ఆ ప్రాంతంలో ఉన్నవన్నీ చెల్లాచెదురయ్యాయి. గతంలో ఒకటి రెండు ఎలుగుబంట్లు సంచారం ఉండే చోట ప్రస్తుతం పదుల సంఖ్యలో దర్శనం ఇస్తుండడంతో ప్రజలు హడలిపోతున్నారు. జనసంచారం లేని చోటకు వాటిని తరలించడం, లేదా బంధించి సంరక్షణ శాలలకు తరలించడం చేస్తేనే తమకు ఎలుగుబంట్ల బెడద తప్పుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.