Share News

ఏడాదిలో ఆఫ్‌షోర్‌

ABN , Publish Date - Jun 16 , 2026 | 12:10 AM

We will provide irrigation water to every acre ‘ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు పనులు ఏడాదిలో పూర్తిచేస్తాం. ప్రతి ఎకరాకూ సాగు నీరందిస్తామ’ని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. వైసీపీ హయాంలో ప్రాజెక్టులు పడకేశాయని, కనీసస్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. రైతులకు సాగునీటి కష్టాలు తీర్చేలా కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి.. పనులు చేపడుతోందని తెలిపారు.

ఏడాదిలో ఆఫ్‌షోర్‌
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • ప్రతి ఎకరాకూ సాగునీరందిస్తాం

  • వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలి

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

  • టెక్కలి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): ‘ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు పనులు ఏడాదిలో పూర్తిచేస్తాం. ప్రతి ఎకరాకూ సాగు నీరందిస్తామ’ని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. వైసీపీ హయాంలో ప్రాజెక్టులు పడకేశాయని, కనీసస్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. రైతులకు సాగునీటి కష్టాలు తీర్చేలా కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి.. పనులు చేపడుతోందని తెలిపారు. సోమవారం టెక్కలి ఆదిత్య కళ్యాణమండపంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ‘అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోంది. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలూ భ్రష్టు పట్టించారు. ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో(2014-19 మధ్య) ఆఫ్‌షోర్‌ పనులకు రూ.420 కోట్లు కేటాయించాం. వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తిచేస్తాం. నేరడి బ్యారేజీ నిర్మాణం కూడా పూర్తిచేసి సాగునీరు అందజేస్తాం. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువులు సమృద్ధిగా ఉన్నాయి. రాష్ట్రంలో వరిపంటకు భవిష్యత్‌ లేదు. రెండేళ్లకు సరిపడా బియ్యం నిల్వలు దేశంలో ఉన్నాయి. వరికి ప్రత్యామ్నాయంగా పంటలు పండించేలా రైతులు దృష్టి సారించాలి. యూరియా వినియోగాన్ని తగ్గించాల’ని మంత్రి అచ్చెన్న సూచించారు. ‘నేను కానీ మా కూటమి నేతలు కానీ ఏ తప్పు చేసినా ప్రశ్నించండి. ఈ జీవితం ప్రజాస్వామ్యానికే అంకితం. కూటమి పాలనలో వైసీపీ నేతల గ్రామాలను సైతం అభివృద్ధి చేశాం. నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటాన’నని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సమావేశంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, కింజరాపు ప్రసాద్‌, ఏఎంసీ చైర్మన్‌ బగాది శేషగిరి, బోయిన గోవిందరాజు, నందిగాం, కోటబొమ్మాళి మండల పార్టీల అధ్యక్షులు పినకాన జోగారావు, బోయిన సత్యశ్రీనివాస్‌, పినకాన అజయ్‌కుమార్‌, బోయిన రమేష్‌, రామ్‌జీ, రామకృష్ణ, వెలమల విజయలక్ష్మి, తర్ర రామకృష్ణ పాల్గొన్నారు.

  • డబుల్‌ ఇంజన్‌ సర్కారుతోనే..

  • ఉచిత రేషన్‌, రైతులకు పెట్టుబడి సాయం ఇలా ఎన్నో పథకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చలువే. నేరడి బ్యారేజీ పూర్తిచేసి జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి. డబుల్‌ ఇంజన్‌ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యం.

  • - అట్టాడ రవిబాబ్జీ, బీజేపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి

  • గతంలో తీవ్ర నష్టం

  • వైసీపీ పాలనలో జగన్మోహన్‌రెడ్డి తీరుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది. పారిశ్రామికవేత్తలు ముందుకురాకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి పాలన సాగుతోంది.

  • - కణితి కిరణ్‌కుమార్‌, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్జి, టెక్కలి.

  • రైతుల హృదయాల్లో చోటు :

  • రైతులు ధాన్యం అమ్మకాలు చేసి 24గంటల్లోపే వారి ఖాతాలో నగదు జమవుతోంది. రైతు హృదయాల్లో కూటమి ప్రభుత్వానికి చోటు దక్కింది. ఏడాదికి రూ.20వేలు రైతుకు పెట్టుబడి సాయం, ప్రతి ఎకరాకు సాగునీరు అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదే.

  • - దారపు లక్ష్మీనారాయణ, నర్శింగపల్లి, టెక్కలి మండలం

  • నలుగురికీ.. ‘తల్లికి వందనం’

  • నాకు నలుగురు పిల్లలు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికీ మాత్రమే ‘అమ్మఒడి’ సాయం అందించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నలుగురికీ ‘తల్లికి వందనం’ సాయం అందింది. ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వరం.

  • - పొందూరు భారతమ్మ, బొడ్డపాడు, కోటబొమ్మాళి మండలం

Updated Date - Jun 16 , 2026 | 12:10 AM