Share News

ఏడాదిలో ఆఫ్‌షోర్‌ నీరు: మంత్రి అచ్చెన్న

ABN , Publish Date - Aug 14 , 2026 | 11:35 PM

ఆఫ్‌షోర్‌ ప్రాజెక్ట్‌ను ఏడాదిలో పూర్తిచేసి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

ఏడాదిలో ఆఫ్‌షోర్‌ నీరు: మంత్రి అచ్చెన్న
జడ్యాడలో జరిగిన సభలో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు.

నందిగాం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ఆఫ్‌షోర్‌ ప్రాజెక్ట్‌ను ఏడాదిలో పూర్తిచేసి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం కొత్తగ్రహారం జాతీయ రహదారి నుంచి జడ్యాడ సీసీ, బీటీ రహదారిని, జడ్యాడ జంక్షన్‌ నుంచి టెక్కలిపట్నంకు సీసీ రహదారిని, జడ్యాడలో రెండు సీసీ రహదారుల్ని ప్రారంభించారు. జలజీవన్‌ మిషన్‌ కింద నిర్మించనున్న మంచినీటి పథకం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ హనుమంతు అప్పయ్యదొర శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్ట్‌ను ఐదేళ్లు వైసీపీ విస్మరించిందని అన్నారు. తాము ఈ ప్రాజెక్ట్‌కు ప్రాముఖ్యత ఇచ్చి నిధులు మంజూరు చేయించామన్నారు. కాలువ ద్వారా నీరు అందని గ్రామాలకు లిఫ్ట్‌ఇరిగేషన్‌ ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. టెక్కలి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి భారీ మంచినీటి పథకం ద్వారా 18 నెలల్లో రూ.641కోట్ల వ్యయంతో 24 గంటలూ మంచినీరు అందిస్తామని తెలిపారు. అర్హులైన వితంతువులకు త్వరలోనే ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, మండల టీడీపీ అధ్యక్షులు పినకాన జోగారావు, నాయకులు పి.అజయ్‌కుమార్‌, ఎం.బాలకృష్ణ, ఎస్‌.జానకిరాం, బి.కిష్టమ్మ, మహేష్‌, కె.హరిబాబు, బి.గిరిబాబు, జనసేన ప్రతినిధి చిరంజీవి, బీజేపీ నాయకులు కామరాజు తదితరులు పాల్గొన్నారు.

50 ఏళ్ల సమస్యకు మంత్రి చొరవతో పరిష్కారం

నందిగాం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 50ఏళ్ల భూ సమస్యకు చొరవ చూపి పరిష్కరించడంతో శుక్రవారం జడ్యాడలో 75 మందికి పట్టాలు అందించారు. గ్రామం పరిధిలో సుమారు 41 ఎకరాల భూములను ఏళ్ల తరబడి సాగుచేస్తున్నా ఎటువంటి హక్కులు లేకపోవడంతో రుణం పొందడం గానీ, భీమా పరిహారం రావడం గానీ, ఎటువంటి రాయితీలు పొందలేకపోయారు. దీంతో గ్రామానికి చెందిన వీరు మంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ఆయన సీఎం దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కారం చూపారు. దీంతో వారంతా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఇదే చొరవతో అండగా నిలవాలని, ఈ గ్రామంలో ఇతర పార్టీలు ఉండకూడదని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో సర్వేలు పేరుతో సమస్యలు సృష్టించారని, సీఎం చంద్రబాబునాయుడు చొరవతో ఏడాది కాలంలో ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, అధికారులు పి.సోమేశ్వరరావు, యు.కుమార్‌ పట్నాయక్‌, శ్రీకాంత్‌వర్మ, నాగరాజు, మనోరత్నం, పీఆర్‌ డీఈఈ సుధాకర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ రామకృష్ణ, నాయకులు పి.జోగారావు, అజయ్‌కుమార్‌, బాలకృష్ణ, బి.కిష్టమ్మ, జి.కురమయ్య, రామస్వామి, కె.జనార్దనరావు, ఆర్‌.రమేష్‌, కె.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 11:35 PM