Share News

ఇక ఆఫ్‌‘జోర్‌’

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:02 AM

గత వైసీపీ ప్రభుత్వం ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ను నిర్లక్ష్యం చేసింది. ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంతో ఆఫ్‌షోర్‌ పనులు ముందుకు కదల్లేదు.

ఇక ఆఫ్‌‘జోర్‌’
రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ ప్రాంతం

- శరవేగంగా రిజర్వాయర్‌ నిర్మాణం

- బడ్జెట్‌లో రూ.90.6 కోట్లు కేటాయింపు

- ఊపందుకున్న పనులు

మెళియాపుట్టి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ను నిర్లక్ష్యం చేసింది. ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంతో ఆఫ్‌షోర్‌ పనులు ముందుకు కదల్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆఫ్‌షోర్‌కు సుమారు రూ.90.6 కోట్లు కేటాయించింది. దీంతో ప్రస్తుతం పనులు పరుగులు పెడుతున్నాయి. వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక దృష్టిసారించి అధికారులు, రైతులతో చర్చలు జరిపి పనులకు ఆటంకం కలగకుండా చూస్తున్నారు. జలాశయ పనులతో పాటు పెద్దమడి నుంచి టెక్కలిపట్నం వరకు రహదారి నిర్మాణం, కల్వర్టు పనులు జోరుగా సాగుతున్నాయి. కుడి, ఎడమ కాలువల పనులు సైతం ఊపందుకున్నాయి.

18 ఏళ్ల కిందట శ్రీకారం..

జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా 2008లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పలాస మండలం రేగులపాడు వద్ద రూ.127కోట్ల వ్యయంతో రిజర్వాయర్‌ పనులకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే, ఏళ్ల తరబడి ఈ పనులపై దృష్టి సారించలేదు. అప్పట్లో నిర్వాసితులు, భూములు కోల్పోయిన రైతులకు ఎటువంటి పరిహారం కూడా ప్రకటించలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పనుల్లో కదలిక వచ్చింది. 2016లో మొదటి విడత రూ.466 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల్లో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ కోసం రూ.214 కోట్లు ఖర్చు చేసింది. నిర్వాసిత గ్రామాలు శారదపురం, చిన్నగురువూరు, చీపురుపల్లి, దాసుపురం, రేగులపాడుకు చెందిన 1,154 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేసి పునరావాసం కల్పించింది. ఒక్కొక్క కుటుంబానికి రూ.11.50లక్షల నిర్మాణ వ్యయం అందజేసింది. మరోవైపు రూ.84.06 కోట్లతో రిజర్వాయర్‌ పనులు చేపట్టింది. తరువాత వచ్చిన వైపీపీ ప్రభుత్వం ఆఫ్‌షోర్‌ను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు పూర్తిగా ఆగిపోయాయి. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతే పనులు జరుగుతున్నాయి. గత బడ్జెట్‌లో 299.67 కోట్లు కేటాయించింది.

పనులు ఇలా..

మహేంద్రతనయ నదిపై చాపర వద్ద వరద కాలువ నిర్మాణం చేపట్టనున్నారు. 108 గ్రామాల్లో 24,600 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. చాపర నుంచి చీపురుపల్లి వరకు సుమారు 13.56 కిలోమీటర్ల పొడవునా హెడ్‌ప్లో కెనాల్‌ను నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు 7.9 కిలోమీటర్ల పొడవునా పనులు జరిగాయి. మిగతా పనులు ప్రస్తుతం ప్రారంభించారు. 1.08 టీఎంసీల రిజర్వాయర్‌ నిర్మాణానికి 1,536 ఎకరాల భూమిని వినియోగిస్తున్నారు. దీనికి 2.5 కిలోమీటర్ల పొడవునా ట్యాంక్‌ బండ్‌ నిర్మిస్తున్నార. దీనిఎత్తు 55.5 మీటర్లు. 500 మీటర్లు బెడ్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రిజర్వాయర్‌ నుంచి కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటిని అందించేందుకు 11.5 కిలోమీటర్లతో పాటు ఆర్‌ఎంసీ 12 కిలో మీటర్ల పనులు చేపడుతున్నారు. ఇప్పటి వరకు రూ.345.79 కోట్లు ఖర్చుచేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. 50 ఎకరాల భూసేకరణకు సంబంధించి రైతులకు రూ.7.04 కోట్ల పరిహారం పెండింగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.

వేగవంతంగా పనులు

ఆఫ్‌షోర్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులతో మాట్లాడి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం రహదారులు, కాలువల నిర్మాణం వంటి పనులు జోరుగా సాగుతున్నాయి.

-బి.పాపారావు, తహసీల్దార్‌, మెళియాపుట్టి

Updated Date - Feb 21 , 2026 | 12:02 AM