Share News

ఆఫ్‌షోర్‌.. జోరు

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:03 AM

Reservoir works progressing briskly ఆఫ్‌షోర్‌ పనులపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి పనులు పూర్తిచేసి.. రైతులకు సాగునీరు అందించేలా చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జోరుగా పనులు సాగుతున్నాయి.

ఆఫ్‌షోర్‌.. జోరు
ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ వద్ద నిర్మిస్తున్న రిటర్నింగ్‌వాల్‌

  • చురుగ్గా రిజర్వాయర్‌ పనులు

  • వచ్చే ఖరీఫ్‌ నాటికి పూర్తయ్యే అవకాశం

  • మెళియాపుట్టి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఆఫ్‌షోర్‌ పనులపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి పనులు పూర్తిచేసి.. రైతులకు సాగునీరు అందించేలా చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జోరుగా పనులు సాగుతున్నాయి. మెళియాపుట్టి, నందిగాం, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల పరిధిలో 24,600 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2008 ఏప్రిల్‌ 4న పలాస మండలం రేగులపాడు వద్ద మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులకు అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.127 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించారు. మెళియాపుట్టి, చాపర సమీపంలో మహేంద్రతనయపై ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌ ఏర్పాటు చేసి సాగునీటిని కాలువల ద్వారా ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌కు తరలించాలని నిర్ణయించారు. రిజర్వాయర్‌ నుంచి వివిధ ప్రాంతాలకు సాగునీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో పనులకు శ్రీకారం చుట్టారు. కాగా.. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నారు.. కానీ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులు మాత్రం పూర్తికావడం లేదు. ఈక్రమంలో ప్రస్తుతం అంచనా వ్యయం రూ.852.45 కోట్లకు పెరిగిపోయింది. పాదయాత్ర సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తిచేస్తామని వైసీపీ అధినేత జగన్‌ హామీ ఇచ్చారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ ఐదేళ్లలో పనుల ఊసే లేదు. ఏటా బడ్జెట్‌లో నిధులు కేటాయించినా.. పనులు మాత్రం జరగలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించడంతో పనుల్లో కదలిక వచ్చింది. ఈ ఏడాది బడ్జెట్‌లో సుమారు రూ.90కోట్లు కేటాయించడంతో పనులు జోరుగా సాగుతున్నాయి. రిజర్వాయర్‌ గట్టు రాతికట్టుతోపాటు పెద్దమడి నుంచి దాసుపురం పునరావాస కాలనీ మీదుగా రహదారి పనులు సైతం చేస్తున్నారు. చాపరలో జీరోలెవెల్‌ వద్ద వంతెన పనులు చేపడుతున్నారు.

  • 14.575 కిలోమీటర్లకు టన్నెల్‌ మినహాయించి 11 కిలోమీటర్లు పూర్తిచేశారు. మెళియాపుట్టి మండలంలో అర్చనాపురం వద్ద 600 మీటర్ల మేరకు టన్నెల్‌ పనులు జరుగుతున్నాయి. సీఎంసీడీ పనులు 24కుగానూ 16 పూర్తయ్యాయి.

  • కిందస్థాయి నుంచి 7 మీటర్లు ఎత్తు పెంచారు. ఆర్‌ఎంసీ కుడి ప్రధాన కాలువ పక్కనే 7.5 మీటర్లు ఎత్తున పనులు జరిగాయి. ఆప్‌స్ట్రీమ్‌ కేసింగ్‌ పనులు చేపడుతున్నారు. హార్జెంటల్‌ శాండ్‌ ఫిల్టర్‌, రాక్టోతోపాటు కుడి ప్రధాన కాలువకు బ్యారెల్‌ పనులు చేస్తున్నారు.

  • ఈ పనులు పూర్తయితే మహేంద్రతనయ నుంచి కాలువలు నిర్మించనున్నారు. కుడికాలువ 10 కిలోమీటర్లు, ఎడమ కాలువ 12 కిలోమీటర్లు వరకు నిర్మించాల్సి ఉంది. ప్రధాన కుడికాలువ కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికే నష్టపరిహారం అందజేశారు. కాలువపై వంతెన పనులు చేపడుతున్నారు. పనులు పూర్తయితే నాలుగు మండలాల రైతులకు సాగునీటితోపాటు.. పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల ప్రజలకు తాగునీరు అందే అవకాశం ఉంది.

  • కొన్ని పెండింగ్‌

  • ఇటీవల కురిసిన వర్షాలకు పట్టుపురం వద్ద రహదారిపైకి ఆఫ్‌షోర్‌ కాలువ నీరు రావడంతో ప్రజలు ఆందోళన చెందారు. ఇక్కడ రక్షణ గోడలు నిర్మించాలని కోరుతున్నారు. అలాగే చీపురుపల్లి, దాసుపురం గ్రామాలకు కొంతమంది తమకు నష్టపరిహారం అందజేయాలని కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారు. భూ సేకరణకు సంబంధించి నష్టపరిహారం సుమారు రూ.16.20 కోట్లు పెండింగ్‌ ఉంది. అధికారులు, పాలకులు స్పందించి పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందజేయాలని నిర్వాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆఫ్‌షోర్‌ పనులు త్వరగా పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు.

  • ఈ విషయమై వంశధార ఈఈ శేఖరరావు వద్ద ప్రస్తావించగా.. ‘రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.90 కోట్లు కేటాయించింది. పనులు త్వరితగతిన పూర్తిచేసేలా కృషి చేస్తున్నామ’ని తెలిపారు.

Updated Date - Sep 30 , 2026 | 12:03 AM