Share News

ఇక్కడి కార్యాలయాలు అక్కడికి

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:32 AM

జిల్లా కేంద్ర రైల్వేస్టేషన్‌గా సేవలు అందిస్తున్న శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) స్టేషన్‌ మనుగడకు ముప్పు వాటిల్లేలా సౌత్‌కోస్ట్‌ రైల్వేజోన్‌ అధికారులు వ్యవహరిస్తున్నారు.

ఇక్కడి కార్యాలయాలు అక్కడికి
శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌

- ఆమదాలవలస రైల్వేస్టేషన్‌ నుంచి

ఏఐఎన్‌, ఐవోడబ్ల్యూ ఆఫీస్‌లు పలాసకు తరలింపు

- సౌత్‌కోస్ట్‌ రైల్వేజోన్‌ అధికారుల నిర్ణయం

- ఉద్యోగులు, కార్మికుల ఆందోళన

- రంగంలోకి దిగిన కేంద్రమంత్రి రామ్మోహన్‌, ఎమ్మెల్యే రవికుమార్‌

- అధికారులతో మాట్లాడి అడ్డుకుంటామని హామీ

ఆమదాలవలస, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్ర రైల్వేస్టేషన్‌గా సేవలు అందిస్తున్న శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) స్టేషన్‌ మనుగడకు ముప్పు వాటిల్లేలా సౌత్‌కోస్ట్‌ రైల్వేజోన్‌ అధికారులు వ్యవహరిస్తున్నారు. సుమారు ఐదు దశాబ్దాలుగా ఇక్కడ సేవలందిస్తున్న కీలకమైన రైల్వే కార్యాలయాలను పలాసకు తరలించేందుకు వారు చీకటి ప్రయత్నాలు చేస్తుండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అమృత్‌భారత్‌ పథకం కింద ఈ స్టేషన్‌ను ఎంపిక చేసి కోట్లాది రూపాయలతో ఆధునికీకరిస్తుంటే, మరోవైపు ఇక్కడున్న ఆఫీసులను తరలించి దీని ప్రాధాన్యతను మసకబార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని రైల్వే ఉద్యోగులు, కార్మికులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

55 ఏళ్ల చరిత్ర..

ఇంజనీరింగ్‌ తదితర నిర్వహణ పనుల కోసం 1971లో శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్‌ ఆవరణలో ఏఐఎన్‌, ఐవోడబ్ల్యూ (ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌) కార్యాలయాలను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. 1971 నుంచి నేటి వరకు ఈ 55 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో 27 మంది అధికారులు ఇక్కడ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ రెండు కార్యాలయాల పరిధిలో 52 మంది రైల్వే ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా రైల్వేక్వార్టర్స్‌లోనే తమ కుటుంబాలతో నివసిస్తూ పిల్లలను ఇక్కడి స్థానిక పాఠశాలల్లో చదివించుకుంటున్నారు. అధికారుల తాజా నిర్ణయంతో ఈ 52 కుటుంబాలు ఇప్పుడు తీవ్ర గందరగోళంలో పడ్డాయి.

ప్రజలపై 70 కిలోమీటర్ల భారం...

ఈ రెండు కార్యాలయాలు ఆమదాలవలసలోనే ఉండడం వల్ల పొందూరు నుంచి పూండి వరకు ఉన్న రైల్వే పరిధిలోని పనులన్నీ సకాలంలో సాగుతున్నాయి. రైల్వేస్టేషన్‌ పరిసరాల్లోని సుమారు 60 షాపులు నిర్మాణాలు, వాటి నిర్వహణ, రైల్వే ట్రాక్‌ పనులు, నీటి సరఫరా వంటి అత్యవసర సేవలను ఈ కార్యాలయాలే పర్యవేక్షిస్తున్నాయి. ఒక వేళ ఈ ఆఫీసులను పలాసకు తరలిస్తే పొందూరు, శ్రీకాకుళం, ఆమదాలవలస తదితర పరిసర ప్రాంతాల ప్రజలు, వ్యాపారులు ఏ చిన్న రైల్వే అవసరం వచ్చినా సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాసకు పరుగులు తీయాల్సి ఉంటుంది.

సొంత జోన్‌లోనే అన్యాయమా..?

ఇన్నాళ్లు ఈ ప్రాంత రైల్వేస్టేషన్ల నిర్వహణ ఒడిశా (ఈస్ట్‌కోస్ట్‌రైల్వే) పరిధిలో ఉండేది. ఆ రాష్ట్ర అధికారుల పెత్తనం నుంచి విముక్తి లభించిందని, మన సొంత జోన్‌ ఏర్పడిందని ఆనందిస్తున్న తరుణంలో జిల్లా ప్రజాప్రతినిధులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. విశాఖ రైల్వే జోన్‌ అధికారులు జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అడ్డుకొని తీరుతాం..

ఆఫీసుల తరలింపు వ్యవహారంపై స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు తక్షణమే స్పందించాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌, స్థానిక నాయకులు లంక నాగరాజు, నాగళ్ల మురళీధర్‌యాదవ్‌, జి.మురళీకృష, టి.గురయ్య, మాలిక్‌ సింహాద్రి, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు తంగి శంకరరావు తదితరులు ఈ వ్యవహరాన్ని కేంద్ర పౌర విమానయానశాఖా మం త్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్‌ దృష్టికి తీసుకొనివెళ్లారు. సమస్య తీవ్రతను విన్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తక్షణమే స్పందించారు. ఈ విషయమై తాను స్వయంగా విశాఖపట్నం రైల్వేజనరల్‌ మేనేజర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీనిచ్చారు. స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి రాకుండా అధికారులు ఇలాంటి చర్యలు ఎలా చేపడతారని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తరలిపోకుండా అడ్డుకుంటామన్నారు. రైల్వేబోర్డు వెంటనే తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించాలని అన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 12:32 AM